- హ్యురన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాజా నివేదిక
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారతీయులు
- విశ్వాసమే విజయం… సంకల్పమే సామ్రాజ్యం
- స్వయం కృషితో వేల కోట్ల వ్యాపార విజయం
- ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాభ్యాసం
- విశ్వమంతా ఏకమై వారిని విజేతలను చేసింది
సహనం వందే, హైదరాబాద్:
ఓ కాలమా! నీ గమనాన్ని కాసేపు ఆపి చూడు. విధి రాసిన రాతను మించి తమ దృఢ సంకల్పంతో సరికొత్త పుటలు రాసుకున్న ముగ్గురు వనితల గాథ ఇది. అపజయాల అంధకారాన్ని చీల్చుకుంటూ అజేయమైన సిరి సంపదలతో మెరుస్తున్న ఈ తారలు… కేవలం ధనవంతులు మాత్రమే కాదు… పురుషాధిక్య ప్రపంచంలో తమ ముద్ర వేసిన అసలైన సామ్రాజ్ఞులు. హ్యురన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం... 20 దేశాల 150 మంది స్వయంశక్తి బిలియనీర్ల వేదికపై మన భారతీయ వనితలు కీర్తి కిరీటాలు ధరించి నిలిచారు.

ఈ విశ్వమంతా ఏకమై…
మీరు దేనినైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే… ఈ విశ్వమంతా ఏకమై దానిని మీకు అందిస్తుంది. ఇది ఒక రహస్యం. ప్రపంచంలోని అత్యంత విజయవంతులైన వ్యక్తులు పాటించిన రహస్యం. మహిళా బిలియనీర్ల జాబితా కేవలం అంకెల సంకలనం కాదు. అది అచంచలమైన సంకల్ప శక్తికి నిదర్శనం. ముఖ్యంగా ముగ్గురు భారతీయ వనితలు శూన్యం నుంచి శిఖరానికి చేరిన తీరు చూస్తుంటే… వారు పాటించిన సిద్ధాంతం ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది.
విశ్వం కొన్నిసార్లు లేదని చెబుతుంది…
విశ్వం మనకు కొన్నిసార్లు ‘లేదు’ అని చెబుతుంది… ఎందుకంటే అంతకంటే గొప్పది మన కోసం వేచి ఉందని దాని అర్థం. బెంగళూరుకు చెందిన కిరణ్ మజుందార్ షా బ్రూయింగ్ చదివి ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు లోకం ఆమెను తిరస్కరించింది. కానీ ఆమె తన కలపై నమ్మకాన్ని వదులుకోలేదు. కేవలం 10 వేల రూపాయల స్వల్ప పెట్టుబడితో బయోకాన్ ప్రారంభించినప్పుడు ఆమె మనస్సులో ఒకటే స్పష్టత ఉంది. ఎలాగైనా ఎదగాలన్న ఆమె సంకల్పంతో నేడు 16,600 కోట్ల రూపాయల నిధి ఆమె సొంతమైంది. మీరు దేనిపై దృష్టి పెడితే అది అవుతుంది అనడానికి కిరణ్ ప్రస్థానమే నిదర్శనం.
50 ఏళ్ల వయస్సులో వ్యాపారం ప్రారంభం…
ముంబైలోని గుజరాతీ కుటుంబంలో జన్మించిన ఫాల్గుణి నాయర్ కథ ఒక సాహసోపేతమైన మలుపు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేసి కొటక్ మహీంద్రా బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్‌గా అత్యున్నత స్థాయికి చేరారు. అయితే 50 ఏళ్ల వయసులో తన సురక్షితమైన ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబైలో ఒక చిన్న గదిలో ముగ్గురు వ్యక్తులతో నైకా ఈ – కామర్స్ వ్యాపారం ప్రారంభించారు. అంతా ముగిసింది అనుకునే చోట తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆమె తన విజయాన్ని ముందే ఊహించారు… దానిని బలంగా విశ్వసించారు. అందుకే నేడు 38,180 కోట్ల రూపాయల అపార సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. మీరు విశ్వాన్ని నమ్మితే అది మీకు అద్భుతాలను బహుమతిగా ఇస్తుంది.

రాధా… దేశంలో టాప్ మహిళ బిలియనీర్
మీరు చేసే పనిలో స్పష్టత ఉంటే ప్రపంచమే మీ వద్దకు వస్తుంది. తమిళనాడుకు చెందిన రాధా వంబు ఆర్భాటాలకు వెళ్లలేదు… కేవలం తన పనిపైనే దృష్టి పెట్టారు. ఐఐటీ మద్రాస్‌లో చదువుకున్న ఆమె జోహో కార్పొరేషన్‌ను నిర్మించారు. విదేశీ పెట్టుబడులు లేకపోయినా ఆమె సంకల్పం అనంతమైన వనరులను ఆకర్షించారు. నేడు 56,440 కోట్ల రూపాయల నికర ఆస్తులతో హ్యురన్ జాబితాలో ఆమె అత్యున్నత స్థానంలో నిలిచారు. కృతజ్ఞతా భావం, పట్టుదల ఉంటే విశ్వం మీ సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది.

భారతీయ శక్తికి ప్రపంచ నీరాజనం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్వయంశక్తి మహిళా బిలియనీర్ల విషయంలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. చైనా, అమెరికా తర్వాత మన దేశమే ఉండటం మనందరి సామూహిక సంకల్ప బలం. ఈ ఏడాది 115 మంది మహిళల సంపద పెరగడం గమనార్హం. ఇది సూచిస్తున్న సత్యం ఒక్కటే. సానుకూల దృక్పథం ఉన్న చోట వృద్ధి తప్పనిసరి. 20 దేశాల ప్రతినిధులు ఉన్న ఈ జాబితాలో భారతీయ వనితలు తమ ముద్రను బలంగా వేశారు.
విద్యావంతులైన వ్యాపారవేత్తలుగా గుర్తింపు
ఈ ముగ్గురిలో ఉన్న మరో ప్రధాన పోలిక వారి ఉన్నత విద్య. రాధా వంబు ఐఐటీ గ్రాడ్యుయేట్ కాగా, ఫాల్గుణి నాయర్ ఐఐఎం పూర్వ విద్యార్థిని. కిరణ్ మజుందార్ షా ఆస్ట్రేలియాలోని బల్లారట్ కాలేజీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. కేవలం డబ్బుతో కాకుండా మేధస్సుతో సామ్రాజ్యాలను నిర్మించవచ్చని వీరు నిరూపించారు. సాఫ్ట్‌వేర్, ఈ-కామర్స్, బయోటెక్నాలజీ వంటి విభిన్న రంగాల్లో వీరు సాధించిన విజయం భారతీయ మహిళల బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. మన అంతర్గత ఆలోచనల్లో మార్పు వస్తే బయటి ప్రపంచం దానంతట అదే మారుతుందని వీరు నిరూపించారు.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్