- ఎర్రజెండాకు మచ్చ తెచ్చిన రెండు ఘటనలు
- సీఎం రేవంత్ ముందు మోకరిల్లిన మావోలు
- తమ్మినేని వీరభద్రాన్ని అభిశంసించిన సీపీఎం
- రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో అల్లకల్లోలం
సహనం వందే, హైదరాబాద్:
తుపాకి గొట్టం ద్వారానే అధికారం దక్కుతుందని నమ్మిన నక్సలైట్ల ప్రస్థానం ముగిసింది. విప్లవ పంథా విఫలమైందని గుర్తించిన 130 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చి చేరారు. మరోవైపు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే సీపీఎంలో లాబీయింగ్‌లు బయటపడటంతో ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు ఈ వారం తెలంగాణ రాజకీయాల్లో అల్లకల్లోలానికి దారితీశాయి.

విప్లవ పతనం దిశగా…
తెలంగాణలో ఎర్రజెండా పట్టు సడలిపోయింది. మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంది. 130 మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వానికి లొంగిపోయారు. వీరంతా తుపాకులను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒకరు రీజినల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.
ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు
సమస్య ఏదైనా చర్చలే పరిష్కారం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అజ్ఞాతంలో ఉన్న గణపతి సహా మిగిలిన వారు కూడా లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ కమిటీ ప్రతిపాదనలను కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. లొంగిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటు వైద్య సేవలు అందిస్తామని, చట్టపరిధిలో కేసులను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం ఏడుగురే మావోయిస్టు పార్టీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
తమ్మినేని అభిశంసన…
తమ్మినేని వీరభద్రాన్ని సీపీఎం కేంద్ర కమిటీ అభిశంసించింది. ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో తప్పుడు రాజకీయ దృక్పథాలను అనుసరించారని ఆక్షేపించింది. తమ్మినేని ఇకపై రాష్ట్ర సెక్రటేరియట్ కమిటీ సమావేశాల్లో కేవలం పరిశీలకుడిగా మాత్రమే ఉండాలి. రాష్ట్ర సెక్రటేరియట్ మార్గదర్శకత్వంలోనే ఆయన నడుచుకోవాలని ఆదేశించింది. ఇది ఆయన రాజకీయ ప్రభావాన్ని తగ్గించే చర్యగా కనిపిస్తోంది.
జీర్ణించుకోలేని వీరభద్రం అనుచరులు
అయితే తమ్మినేని వీరభద్రం అనుచరులు మాత్రం కేంద్ర కమిటీ నిర్ణయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆయన అనుచరులు అనేకమంది తమ్మినేని కేవలం రెస్టులో మాత్రమే ఉన్నారని… కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బుకాయిస్తున్నారు. అయితే ఆయన వ్యతిరేకులు మాత్రం ఒక ప్రశ్న వేస్తున్నారు. కేంద్ర కమిటీ అభిశంసించిందా లేదా? అభిశంషించి ఉంటే తమ్మినేనిని వెనుకేసుకుని రావాల్సిన అవసరం ఏంటి? అని నిలదీస్తున్నారు.
ఎంఏ బేబీ డైనమిజం…
సీపీఎం పార్టీ ఇప్పుడు కేరళ డైనమిక్ లీడర్ ఎంఏ బేబీ చేతిలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రక్షాళన ఉద్యమానికి తెరలేపినట్టు ఆ నాయకుడు తెలిపారు. కేరళ పార్టీ అత్యంత దూకుడుగా క్రమశిక్షణగా ఉంటుందని… అక్కడ శిక్షణ పొందిన ఎంఏ బేబీ స్టైలే వేరని అంటున్నారు. క్రమశిక్షణ లేకపోతే ఎంతటి పెద్ద నాయకుడైనా ఆయన సహించబోరని అంటున్నారు.
