- 46 లక్షల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు
- 30 రకాల స్క్రీనింగ్… 99 రోజుల ప్రణాళిక
- హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషనే ప్రధాన లక్ష్యం
- మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభం
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అతిపెద్ద ఆరోగ్య యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఇంటికి దీపం ఇల్లాలు అన్న సూత్రంతో 46 లక్షల మంది మహిళల సమగ్ర ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా భారీ కార్యాచరణ సిద్ధమైంది. కేవలం రోగాల నిర్ధారణే కాకుండా నివారణా చర్యలతో కూడిన ఈ సరికొత్త హెల్త్ మోడల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

భారీ స్క్రీనింగ్ ప్లాన్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తోంది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. మొత్తం 46 లక్షల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఒక్కో మహిళకు 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.
నాలుగు దశల వ్యూహం
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ 99 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం 4 దశల్లో నిర్వహిస్తారు. తొలి దశ మార్చి 6 నుంచి 31 వరకు కొనసాగుతుంది. ఇందులో మాతా శిశు సంరక్షణ, కౌమార బాలికలు, వృద్ధుల ఆరోగ్యంపై దృష్టి పెడతారు. అలాగే అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పిల్లలకు రక్తహీనత పరీక్షలు చేస్తారు. ఆసుపత్రులలో పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వంటి పరిపాలన అంశాలను కూడా ఇదే దశలో పూర్తి చేయనున్నారు.
అసంక్రమిత వ్యాధులపై నిఘా
రెండో దశ ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు సాగుతుంది. ఈ 15 రోజుల్లో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల గుర్తింపుపై ఫోకస్ పెడతారు. సబ్ సెంటర్ల పరిధిలో విస్తృత స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. డే కేర్ క్యాన్సర్ సెంటర్లలో కీమోథెరపీ సేవలను మ్యాపింగ్ చేస్తారు. డయాలసిస్ రోగులకు వైరల్ ఇన్ఫెక్షన్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మెరుగైన రక్షణ లభిస్తుంది.
సీజనల్ వ్యాధుల కట్టడి
మూడో దశ ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. ప్రధానంగా అంటువ్యాధుల నియంత్రణపై యంత్రాంగం దృష్టి సారిస్తుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యంలో భాగంగా కొత్త కేసులను గుర్తిస్తారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వడదెబ్బ, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. అత్యవసర మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రజారోగ్య సన్నద్ధతలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పట్టణాల్లో వైద్య సేవలు
మే 16 నుంచి జూన్ 12 వరకు సాగే నాలుగో దశలో పట్టణ ప్రాంతాలపై దృష్టి సారిస్తారు. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మేడ్చల్ పరిధిలోని 145 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పాలిక్లినిక్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తారు. వీటిలో స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తారు. బస్తీల్లో మొబైల్ వాహనాల ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు చికిత్స అందిస్తారు. ఆహార కల్తీపై ప్రజలను చైతన్య పరిచేందుకు ఫుడ్ సేఫ్టీ మేళాలు కూడా నిర్వహించనున్నారు.
ఉన్నతాధికారుల సమీక్ష
సెక్రటేరియట్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్ హాజరయ్యారు. ఆసుపత్రులలో సాధారణ సేవలకు ఆటంకం కలగకుండా 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలని మంత్రి సూచించారు.