- పాత డేటాతోనే డిజిటల్ పునర్జన్మ
- మెటా ఏఐ గుప్పిట్లో ఆత్మలు
- సోషల్ మీడియాలో యాక్టివ్
- చనిపోయినా ఆడియో, వీడియో మెసేజ్
- కొత్త ఒరవడికి ఫేస్‌బుక్ శ్రీకారం
సహనం వందే, హైదరాబాద్:
ఏఐ యుగంలో మరణం ఇక అంతిమ సత్యం కాదు. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ మనిషి భౌతిక ఉనికి ముగిసినా… వారి డిజిటల్ ఉనికిని శాశ్వతం చేసే వింతైన సాంకేతికతను సిద్ధం చేస్తోంది. ఏఐ సాయంతో వారి జ్ఞాపకాలను… వారి సంభాషణలను ఒక వ్యాపార వస్తువుగా మార్చే ఈ ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నైతిక, మానవ హక్కుల చర్చను రేకెత్తిస్తోంది.

ఫేస్‌బుక్ ఖాతా కంటిన్యూ…
మనిషి హృదయ స్పందన ఆగిపోయినా ఫేస్‌బుక్ ఖాతా మాత్రం ఆగదు. చనిపోయాక కూడా వారి తరపున పోస్ట్‌లు పెడుతూ స్నేహితులతో ముచ్చటించే ఒక డిజిటల్ ఆత్మను మెటా సిద్ధం చేస్తోంది. ఇది వినడానికి వింతగా ఉన్నా మనిషి జ్ఞాపకాలను అల్గారిథమ్‌లుగా మార్చి వ్యాపారం చేయడంలో మార్క్ జుకర్‌బర్గ్ ఒక అడుగు ముందే ఉన్నారు.
ఆన్‌లైన్ వారసత్వం
మెటా కంపెనీ 2025 డిసెంబర్‌లో ఒక వినూత్న పేటెంట్‌ను తన సొంతం చేసుకుంది. ఒక యూజర్ మరణించినా లేదా ఆన్‌లైన్‌లో అందుబాటులో లేకపోయినా వారి తరపున ఏఐ స్పందిస్తుంది. 2023లో దరఖాస్తు చేసిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి డిజిటల్ ముద్రలు మాత్రం కంపెనీ సర్వర్లలో భద్రంగా ఉంటాయి.
డేటా ఆధారంగా మనిషి సృష్టి…
మీరు గతంలో చేసిన మెసేజ్‌లు, పోస్ట్‌లను ఏఐ లోతుగా అధ్యయనం చేస్తుంది. మీరు వాడే భాష, సంభాషించే శైలిని ఇది అచ్చుగుద్దినట్లు కాపీ చేస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కోసం ఈ టూల్‌ను రూపొందించారు. మీ తరపున కామెంట్లు పెట్టడం మాత్రమే కాదు… ఇతరులు పంపే మెసేజ్‌లకు మీలాగే సమాధానం ఇవ్వడం దీని ప్రత్యేకత. డేటా ఆధారంగా ఒక మనిషిని తిరిగి సృష్టించడమే ఈ టెక్నాలజీ అసలు లక్ష్యం.
శవంపై వ్యాపారం
చనిపోయిన వారిని డిజిటల్ రూపంలో బతికించే వీటిని గ్రీఫ్‌బాట్స్ అని పిలుస్తారు. దీని వెనుక పెద్ద వ్యాపార కోణం ఉంది. మనిషిని కోల్పోయిన బాధలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ సేవలను విక్రయించవచ్చు. ఏఐ ఎథిసిస్ట్‌లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చనిపోయిన వారు తిరిగి వస్తున్నారనే భ్రమలో బతకడం వల్ల మనుషులు మానసిక ప్రశాంతతను కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. ఇది ఒక రకమైన డిజిటల్ బానిసత్వానికి దారితీస్తుంది.
డిజిటల్ ఆత్మల కేకలు
కేవలం టెక్స్ట్ రిప్లైలతోనే ఈ టెక్నాలజీ ఆగదు. భవిష్యత్తులో వారి ఆడియో, వీడియోను కూడా ఇది సృష్టిస్తుంది. అంటే మరణం తర్వాత కూడా వారి గొంతును ఇతరులు వినవచ్చు. ఇది వినడానికి బాగున్నా దీనివల్ల ప్రైవసీకి భారీ గండి పడుతుంది. చనిపోయిన వారి ఖాతాను ఏఐ ఎలా వాడుతుందో ఎవరికీ తెలియదు. బాధ్యతారాహిత్యంగా వాడే డేటా వల్ల పరువు నష్టం కలిగే ప్రమాదం కూడా పొంచి ఉంది. మనిషి మరణం తర్వాత వారి ఆన్‌లైన్ హక్కులు ఎవరికి చెందుతాయనే దానిపై స్పష్టత లేదు.