- గేట్స్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ స్వాగతం
- ఏపీతో చర్చలు… సోషల్ మీడియాలో విమర్శ
- దీనిపై ‘ఇండియా టుడే’లో ప్రత్యేక కథనం
సహనం వందే, అమరావతి:
ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఇప్పుడు పెను రాజకీయ దుమారానికి దారితీసింది. ఒకవైపు ప్రభుత్వం సాంకేతిక సహకారం కోరుతుంటే మరోవైపు గేట్స్ గతాన్ని తవ్వుతూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఎప్‌స్టీన్‌తో గేట్స్‌కు ఉన్న సంబంధాలే ఇప్పుడు ఏపీలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

విమానాశ్రయంలో ఘనస్వాగతం
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సోమవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్వయంగా వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్‌ను కలవడం సంతోషంగా ఉందని లోకేష్ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ పనితీరును గేట్స్ పరిశీలించారు.
పాత పరిచయం కొత్త విజన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1997 నాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఐటీ రంగానికి పునాది వేసేందుకు గేట్స్‌తో చర్చలు జరిపినట్లు చెప్పారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం కోసం మళ్ళీ ఆయన సహకారం కోరుతున్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో వినూత్న మార్పులు తీసుకురావడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశం. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని బాబు ధీమా వ్యక్తం చేశారు.
ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం
బిల్ గేట్స్ రాకను సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన 35 లక్షల పేజీల ఎప్‌స్టీన్ ఫైల్స్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. కరుడు గట్టిన నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గేట్స్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. రష్యన్ అమ్మాయిలతో గేట్స్ గడిపిన సమయంలో డ్రగ్స్ సరఫరా చేశానని ఎప్‌స్టీన్ ఒక నోట్‌లో రాశాడు. ఈ ఆరోపణలు ఇప్పుడు గేట్స్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.
లాబ్ ఎలుకల్లా భారతీయులు
భారతదేశాన్ని ఒక ప్రయోగశాలగా బిల్ గేట్స్ వాడుకుంటున్నారని నెటిజన్ వీణా జైన్ ఆరోపించారు. భారతీయులను లాబ్ ఎలుకల్లా చూస్తున్నారని ఆమె విమర్శించారు. మధ్యప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ నాయకుడు అనూప్ ధోటే కూడా గేట్స్‌ను విమర్శించారు. ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని ప్రభుత్వ పెద్దలు కలవడాన్ని వారు తప్పుపడుతున్నారు. గేట్స్ తన ఉత్పత్తులను పరీక్షించడానికి భారత్‌ను వేదికగా చేసుకుంటున్నారని విమర్శకులు మండిపడుతున్నారు.
భవిష్యత్తుపై నీలినీడలు
న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్ట్ సమిట్‌లో పాల్గొనేందుకు గేట్స్ వచ్చారు. 2014లో మైక్రోసాఫ్ట్ బాధ్యతల నుంచి తప్పుకున్నా ఆయన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం విమర్శలను పట్టించుకోకుండా గేట్స్‌తో పెట్టుబడులపై చర్చిస్తోంది. అగ్రరాజ్యంలో ప్రకంపనలు సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్ సెగ ఇప్పుడు అమరావతి వీధుల్లో ప్రతిధ్వనిస్తోంది.