- పాత ముఖం స్థానంలో కొత్త రూపం
- చనిపోయిన వారి ముఖంతోనే సాధ్యం
- దాత చర్మం, కండరాలతోనే మనుగడ
- ఇది ప్లాస్టిక్ సర్జరీ కాదు.. పునర్జన్మ
- అభాగ్యులకు సరికొత్త ఆత్మగౌరవం
- ఏడాదిలో మార్పిడికి చేసేలా ఏర్పాట్లు
సహనం వందే, న్యూఢిల్లీ:
ముఖంపై యాసిడ్ పడినా… తుపాకీ గుండు దూసుకెళ్లినా లేదా అగ్నిప్రమాదంలో రూపం ఛిద్రమైనా ఇకపై చింతించాల్సిన పనిలేదు. పాత ముఖాన్ని తీసేసి మరో వ్యక్తి ముఖాన్ని అమర్చే అత్యంత సంక్లిష్టమైన ముఖ మార్పిడి (ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్సకు ఎయిమ్స్ ఢిల్లీ సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఇటువంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని చేపట్టింది.

పాత ముఖం పోతుందా?
ముఖం మార్పిడి కోసం ఎయిమ్స్ అనుమతులు పొందింది. రాబోయే ఏడాది లోపు మొదటి ముఖ మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ముఖ మార్పిడిలో పాత రూపం పూర్తిగా కనుమరుగవుతుంది. రోగికి దారుణంగా దెబ్బతిన్న చర్మం, పనిచేయని కండరాలను తొలగించి వారి స్థానంలో దాత నుండి సేకరించిన కొత్త ముఖాన్ని అమర్చుతారు. అంటే శస్త్రచికిత్స తర్వాత రోగి అద్దంలో చూసుకుంటే తన పాత పోలికలు కాకుండా దాత పోలికలతో కూడిన కొత్త రూపాన్ని చూస్తారు.
చనిపోయిన వారి ముఖంతోనే
ఈ ప్రక్రియలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల ముఖాన్ని సేకరిస్తారు. దాత చర్మం రంగు, వయస్సు, లింగం రోగితో సరిపోలడం చాలా కీలకం. డాక్టర్ మనీష్ సింఘాల్ వివరణ ప్రకారం… దాత ముఖాన్ని ఒక ముసుగులాగా తీసి గ్రహీత ముఖానికి అమర్చుతారు. ఇక్కడ అత్యంత క్లిష్టమైన విషయం ఏంటంటే దాత ముఖంలోని నరాలను రోగి ముఖంలోని నరాలతో కలపడం. అప్పుడే ఆ ముఖంలో కదలికలు వస్తాయి. ఈ సాహసానికి హార్వర్డ్ నిపుణుడు డాక్టర్ ఇంద్రనీల్ సిన్హా సాంకేతిక మద్దతు ఇస్తున్నారు.

16 గంటల మహా యజ్ఞం
శస్త్రచికిత్స గదిలో వైద్యులు దాదాపు 16 గంటల పాటు శ్రమించాల్సి ఉంటుంది. మైక్రోస్కోప్ సాయంతో 1 నుండి 2 మిల్లీమీటర్ల సన్నని రక్తనాళాలను, నరాలను అనుసంధానిస్తారు. రక్తం సరఫరా మొదలవ్వగానే కొత్త ముఖం మెరిసిపోతుంది. అయితే ఇది జరగడానికి రోగి రోగనిరోధక శక్తి అడ్డుపడుతుంది. అందుకే డాక్టర్ దీపాంకర్ భౌమిక్ నేతృత్వంలోని బృందం రోగికి ఇమ్యునోసప్రెసివ్ మందులు ఇచ్చి శరీరం ఆ కొత్త ముఖాన్ని తిరస్కరించకుండా జీవితాంతం పర్యవేక్షిస్తారు. విదేశాల్లో ఈ ఆపరేషన్ ఖరీదు కొన్ని కోట్లు ఉంటుంది. ఎయిమ్స్ బర్న్స్ విభాగం ఏటా 8,000కు పైగా సర్జరీలు చేస్తూ ఇప్పుడు ఈ ఖరీదైన చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తెస్తోంది.
ముఖం మారినా మనసు మారదు
పాత ముఖం పోయి కొత్త ముఖం వచ్చినప్పుడు రోగి మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది పెద్ద సవాల్. అందుకే ఆపరేషన్‌కు ముందే సైకియాట్రిస్టులు కౌన్సెలింగ్ ఇస్తారు. పాత రూపాన్ని వదిలేసి కొత్త రూపంతో బతకడానికి రోగి సిద్ధంగా ఉన్నప్పుడే సర్జరీ చేస్తారు. ముఖం మారినంత మాత్రాన వ్యక్తిత్వం మారదు. కానీ వారు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది.
విప్లవాత్మక మలుపు
భారత ప్రభుత్వ రంగంలో ఇలాంటి ముఖ మార్పిడికి ఏర్పాట్లు జరగడం విశేషం. ఒక ఏడాదిలోపు మొదటి సర్జరీ పూర్తి చేయాలని ఎయిమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దాత ముఖాన్ని సేకరించిన తర్వాత వారి భౌతిక కాయం వికృతంగా కాకుండా సిలికాన్ మాస్క్ అమర్చి గౌరవంగా అప్పగిస్తారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే, ప్రపంచ వైద్య చిత్రపటంలో భారత్ ఒక ధ్రువతారగా నిలుస్తుంది. ఇది కేవలం శాస్త్రం సాధించిన విజయం మాత్రమే కాదు, మానవత్వానికి దక్కిన గౌరవం.