ఐటీ ఆఫీసుల్లో ఆధునిక బానిసలు – డిజిటల్ కూలీలుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు

India's IT employees
  • టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోల్లో జీతాల వెతలు
  • ఆ పెద్ద కంపెనీల్లో నెల వేతనం 30 వేల లోపే
  • పదేళ్ల కిందటి జీతాలు చెల్లిస్తున్న దుస్థితి
  • కొత్త వారితో చాకిరి చేయించుకుంటూ దోపిడీ

సహనం వందే, హైదరాబాద్/బెంగళూరు:

మెరిసే గాజు భవనాలు… అత్యాధునిక క్యాంపస్‌లు… బిలియన్ డాలర్ల లాభాలు.. ఇదీ భారత ఐటీ రంగం ప్రపంచానికి చూపిస్తున్న ముఖచిత్రం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఒక తరం యువత నిశ్శబ్దంగా నలిగిపోతోంది. 2026లోనూ 2013 నాటి వేతనాలనే ఆఫర్ చేస్తూ కార్పొరేట్ దిగ్గజాలు సాగిస్తున్న ఈ ఆర్ధిక ఉగ్రవాదాన్ని విశ్లేషకులు ఆధునిక బానిసత్వంగా అభివర్ణిస్తున్నారు.

TCS employees

దశాబ్ద కాలపు దోపిడీ
ప్రపంచం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వైపు దూసుకుపోతుంటే… భారత ఐటీ కంపెనీల వేతనాల గ్రాఫ్ మాత్రం పాతాళంలోనే ఆగిపోయింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు ఏటా తమ బ్యాలెన్స్ షీట్లలో వేల కోట్ల లాభాలను చూపిస్తున్నా క్షేత్రస్థాయిలో పని చేసే ఫ్రెషర్ల జీవితాల్లో మాత్రం చీకటే మిగిలింది. 2014లో తన సీనియర్ పొందిన అదే 3.5 లక్షల ప్యాకేజీని 2026లో తనకు ఆఫర్ చేయడం అంటే అది తన ప్రతిభను గౌరవించడం కాదు… తన పేదరికాన్ని అవహేళన చేయడమేనని హైదరాబాద్‌కు చెందిన ఒక ఫ్రెషర్ ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన పన్నెండేళ్లలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకినా ప్యాకేజీలు మాత్రం కేవలం 3.8 లక్షల వద్దే స్తంభించిపోవడం ఒక వ్యవస్థీకృత సామాజిక నేరంగా మారుతోంది.

మెట్రో నగరాలు… మధ్యతరగతి నరకం
హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి నగరాల్లో నెలకు వచ్చే 27,000 నుండి 29,000 రూపాయలతో బతకడం ఒక అసాధ్యమైన ఫీటుగా మారింది. ఇక్కడ అద్దె దోపిడీ ఏ స్థాయిలో ఉందంటే వచ్చే జీతంలో 40 నుండి 50 శాతం కేవలం ఒక చిన్న గది అద్దెకే సరిపోతోంది. దీనికి తోడు టాప్ కంపెనీ అనే బ్రాండ్ భ్రమలో యువతను తక్కువ వేతనాలకు లొంగదీసుకుంటూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. కనీసం క్యాబ్ ఎక్కే స్తోమత లేక, నాణ్యమైన ఆహారం తీసుకోలేక అత్యంత దారుణమైన జీవన ప్రమాణాల మధ్య ఫ్రెషర్లు డిజిటల్ కూలీలుగా మిగిలిపోతున్నారు.

సీఈవోల విలాసం… శ్రామికుల కష్టం
ఒకవైపు కంపెనీల సీఈవోల వేతనాలు వందల కోట్లకు చేరుతుంటే… మరోవైపు అదే కంపెనీని నడిపించే కింది స్థాయి ఉద్యోగికి కనీస వేతనం కూడా పెరగకపోవడం కార్పొరేట్ అరాచకత్వానికి పరాకాష్ట. దేవపర్ణ ముఖోపాధ్యాయ వంటి విశ్లేషకులు దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. నాయకత్వ స్థాయి వేతనాలకూ, ఫ్రెషర్ల ప్యాకేజీలకూ మధ్య ఉన్న అగాధం అమానవీయంగా తయారైంది. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఈ వేతన వివక్షపై అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పదేపదే తప్పించుకుంటున్నాయి.

సరఫరా ఎక్కువైతే శ్రమ చౌకనా?
రిక్యూటర్ అంకుల్ అగర్వాల్ వంటి వారు చెబుతున్న విశ్లేషణ ప్రకారం… ఇంజనీరింగ్ పట్టభద్రుల సంఖ్య పెరగడాన్ని కంపెనీలు సాకుగా చూపుతున్నాయి. నిరుద్యోగం ఎక్కువగా ఉంది కాబట్టి తాము ఎంత తక్కువ ఇచ్చినా పని చేసేవారు దొరుకుతారనే అహంకార ధోరణిలో కార్పొరేట్ శక్తులు ఉన్నాయి. ఇది కేవలం డిమాండ్-సప్లై సూత్రం కాదు… యువత ఆత్మగౌరవాన్ని బజారున పెట్టే కుట్ర. 2013 నాటి వేతనాలతో 2026లో బతుకులీడ్చడం అంటే అది ఆర్థిక ఆత్మహత్యకు సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రగులుతున్న అసంతృప్తి…
స్నేహ లాంటి లక్షలాది మంది యువతీ యువకులు తాము చేస్తున్న ప్రాజెక్టుల విలువ బిలియన్ డాలర్లని తెలుసుకుని గర్వపడుతున్నా తమ బ్యాంకు బ్యాలెన్స్ చూసి నిరాశకు లోనవుతున్నారు. ఐటీ రంగం ఫ్యూచర్ రెడీ అని డబ్బా కొట్టుకుంటున్నా దాని మూలాలు మాత్రం పాతకాలపు భూస్వామ్య దోపిడీ వ్యవస్థలోనే ఉన్నాయి. ఈ నిశ్శబ్ద సంక్షోభంపై ప్రభుత్వం, సమాజం స్పందించకపోతే దేశపు మేధోశక్తి కునారిల్లిపోయే ప్రమాదం పొంచి ఉంది. భయంకరమైన దోపిడీ ఇప్పుడు ఐటీ ఆఫీసుల ఏసీ గదుల్లో నిశ్శబ్దంగా జరుగుతోంది. ఈ ఆధునిక బానిసత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *