యుద్ధ నివాళిపై ఒలింపిక్స్‌ వివక్ష – ఇటలీ వింటర్ ఆటల్లో మంటలు

Winter Olympics at Italy
  • వీరుల స్మరణ ఉక్రెయిన్ అథ్లెట్‌పై వేటు
  • చనిపోయిన క్రీడాకారులను గౌరవిస్తే పాపమా?
  • హెల్మెట్‌పై యుద్ధవీరుల చిత్రాలే నేరమైంది

సహనం వందే, ఉక్రెయిన్:

ఇటలీలో జరుగుతున్న శీతాకాల ఒలింపిక్స్‌ లో మానవత్వం కంటే నిబంధనలే మిన్న అని క్రీడల నిర్వాహకులు మరోసారి నిరూపించారు. రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన క్రీడాకారుల చిత్రాలను హెల్మెట్‌పై ధరించినందుకు ఉక్రెయిన్ అథ్లెట్ వ్లాడిస్లావ్ హెరాస్కెవిచ్‌పై వేటు వేశారు. ఇది కేవలం అనర్హత కాదు… దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల స్మృతిపై జరిగిన దాడి. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదనే సాకుతో పాలకుల అమానవీయత బట్టబయలైంది.

Olympic Helmet Issue

హెల్మెట్‌పై అమరుల నివాళి
ఉక్రెయిన్ స్కెలిటన్ అథ్లెట్ వ్లాడిస్లావ్ హెరాస్కెవిచ్ తన హెల్మెట్‌పై యుద్ధంలో మరణించిన తోటి క్రీడాకారుల చిత్రాలను ముద్రించుకున్నాడు. ఇది రాజకీయం కాదని… కేవలం స్మరణ మాత్రమేనని అతను వాదించాడు. కానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దీనిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించింది. రాజకీయ అంశాలపై నిషేధం ఉందంటూ అతనిని పోటీ నుండి తప్పించడం సంచలనం సృష్టించింది. ఒక దేశం ఉనికి కోసం జరుగుతున్న పోరాటాన్ని గౌరవించకపోవడం ఒలింపిక్ పతనానికి నిదర్శనం.

విఫలమైన సంధి ప్రయత్నాలు
పోటీకి కొన్ని నిమిషాల ముందు ఇటలీలోని కోర్టినా డి అంపెజ్జో ట్రాక్ వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు కిర్స్టీ కోవెంట్రీ అథ్లెట్‌తో చర్చలు జరిపారు. సయోధ్య కోసం జరిగిన ఈ ప్రయత్నం విఫలమై చివరకు వ్లాడిస్లావ్ హెరాస్కెవిచ్‌ పోటీకి అనర్హుడయ్యాడు. ఈ చర్చల ముగింపులో కిర్స్టీ కోవెంట్రీ తో పాటు అథ్లెట్ తండ్రి కూడా కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని కలచివేసింది. నిబంధనల ముసుగులో ఒక క్రీడాకారుడి ఆశయాన్ని అధికారులు సమాధి చేశారు.

జెలెన్ స్కీ ఘాటైన స్పందన
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వ్లాడిస్లావ్ హెరాస్కెవిచ్ ధైర్యాన్ని ఆయన కొనియాడారు. ఒలింపిక్ అధికారులు దురాక్రమణదారుల చేతుల్లో పావులుగా మారుతున్నారని ఆయన విమర్శించారు. మరణించిన అథ్లెట్ల చిత్రాలు గౌరవానికి చిహ్నమని జెలెన్ స్కీ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. రష్యా చేస్తున్న యుద్ధం వల్ల ఉక్రెయిన్ చెల్లిస్తున్న మూల్యాన్ని ఈ హెల్మెట్ ప్రపంచానికి గుర్తు చేస్తోందని ఆయన వక్కాణించారు. ఈ వివాదం ఇప్పుడు క్రీడా లోకాన్ని రెండుగా విభజించింది.

నిబంధనల పేరిట వివక్ష
ఒలింపిక్ కమిటీ తన రాజకీయ తటస్థతను కాపాడుకోవాలని చూస్తోంది. కానీ ఉక్రెయిన్ లాంటి యుద్ధ బాధితుల ఆవేదనను రాజకీయాలుగా చూడటం విడ్డూరం. రష్యా దాడుల వల్ల వందలాది మంది ఉక్రెయిన్ అథ్లెట్లు ప్రాణాలు కోల్పోయారు. వారిని స్మరించుకోవడం కూడా తప్పేనని అధికారులు చెప్పడం అమానవీయం. 262 మందికి పైగా ఉక్రెయిన్ క్రీడాకారులు ఈ యుద్ధంలో నేలకొరిగారని గణాంకాలు చెబుతున్నాయి. అధికారుల మొండితనం వల్ల ఒక ప్రతిభావంతుడైన అథ్లెట్ కెరీర్ ప్రమాదంలో పడింది.

ఒలింపిక్స్‌లో అతిపెద్ద సంక్షోభం
ఈ అనర్హత నిర్ణయం ఇటలీలో జరుగుతున్న గేమ్స్‌లో అతిపెద్ద సంక్షోభానికి దారితీసింది. మిలన్ వేదికగా సాగుతున్న ఐఓసీ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడాకారుల భావ ప్రకటనా స్వేచ్ఛను అణిచివేస్తున్నారని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. యుద్ధం వల్ల నలిగిపోతున్న దేశానికి బాసటగా ఉండాల్సింది పోయి శిక్షించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

క్రీడా స్ఫూర్తికి మాయని మచ్చ
వ్లాడిస్లావ్ హెరాస్కెవిచ్‌పై వేటు వేయడం ద్వారా ఒలింపిక్ కమిటీ తప్పుడు సంకేతాలు పంపింది. మానవ హక్కులు, ప్రాణ త్యాగాల కంటే నిబంధనలకే ప్రాధాన్యత ఇస్తామని తేల్చిచెప్పింది. ఇది భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడల విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉంది. క్రీడలు కేవలం పతకాల కోసం కాదని, అవి దేశాల ఆత్మగౌరవానికి ప్రతీకలని పాలకులు గుర్తించాలి. ఉక్రెయిన్ అథ్లెట్ తన పోటీని కోల్పోయినా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *