- సరిహద్దు సెగ: క్రికెట్ ముసుగులో కోట్ల వేట
- పగతో నిండుతున్న వ్యాపారస్తుల పర్సులు
- క్రీడ కాదు వ్యాపారం… భావోద్వేగాల బజారు
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ పోరు ఆరంభం కాకముందే వ్యాపార సామ్రాజ్యంలో ప్రకటనల యుద్ధం మొదలైంది. ఇది కేవలం 22 గజాల పిచ్ మీద జరిగే ఆట కాదు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పగను పెట్టుబడిగా మార్చుకుంటున్న మహా వ్యాపార కుతంత్రం. దేశభక్తి ముసుగులో కార్పొరేట్ సంస్థలు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయి.
కరచాలనం లేని క్రీడా దౌత్యం
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగే మ్యాచ్‌కు ముందు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. టాస్ సమయంలో లేదా మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా అన్న ప్రశ్నకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. 24 గంటలు ఆగాలని చెప్పడం ద్వారా ఆయన సందిగ్ధతను కొనసాగించారు. పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
అడ్వర్టైజ్‌మెంట్లతో 2000 కోట్ల లాభం
ఈ ఒక్క మ్యాచ్ ద్వారా బ్రాడ్‌కాస్టర్లు, ప్రకటన సంస్థలు దాదాపు 2000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాయి. సాధారణ మ్యాచ్‌లతో పోలిస్తే ఈ పోరుకు 10 సెకన్ల ప్రకటన స్లాట్ ధర 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కేవలం ఒక రోజులో వచ్చే ఈ భారీ లాభం కోసం కార్పొరేట్ సంస్థలు మ్యాచ్‌ను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాయి. ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను క్యాష్ చేసుకోవడానికి ఇవే సంస్థలు అడ్వర్టైజ్‌మెంట్లను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఇక్కడ గెలుపోటముల కంటే కంపెనీల బ్యాలెన్స్ షీట్లే ముఖ్యం.
విద్వేషమే పెట్టుబడిగా వాణిజ్య మార్కెట్
దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ శక్తులకు వరంగా మారాయి. ఎప్పుడైతే మ్యాచ్ చుట్టూ వివాదాలు పెరుగుతాయో, అప్పుడే వ్యూయర్‌షిప్ రికార్డు స్థాయిలో ఉంటుంది. ఈ హైప్ వల్ల వచ్చే రేటింగ్స్ ద్వారా కార్పొరేట్ కంపెనీలు సామాన్యుల జేబుల నుంచి సొమ్మును కొల్లగొడుతున్నాయి. వర్షం పడి ఆట రద్దయ్యే అవకాశం ఉన్నా, రిజర్వ్ డేల పేరుతో మ్యాచ్ జరిగేలా చేయడం వెనుక ఉన్నది కేవలం వాణిజ్య ప్రయోజనాలే. ఇక్కడ క్రీడా స్ఫూర్తి కంటే కాసుల వేటకే పెద్దపీట వేస్తున్నారు.
మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ వివాదం
గత సెప్టెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ తర్వాత ఇరు దేశాల మధ్య వివాదం ముదిరింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటంతోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను వ్యతిరేకించాలనేది మన క్రికెటర్ల ఆలోచన. అప్పటి నుంచి ఆటగాళ్ల మధ్య కరచాలనం కనుమరుగైంది. ఇప్పుడు కొలంబోలో కూడా అదే వాతావరణం పునరావృతం అవుతుందని అంటున్నారు.
వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ అప్‌డేట్
భారత జట్టు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకుని జట్టులో చేరారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందిన ఆయన ఆదివారం నాటి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని సూర్యకుమార్ ధృవీకరించారు. కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో కుల్దీప్ యాదవ్ కంటే అదనపు బ్యాటింగ్ నైపుణ్యం ఉన్న సుందర్‌కే తుది జట్టులో అవకాశం దక్కేలా ఉంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సుందర్… పాక్‌తో పోరులో కీలక పాత్ర పోషించనున్నారు.
అభిషేక్ శర్మ… జట్టు కూర్పు
యువ ఆటగాడు అభిషేక్ శర్మ తుది జట్టులో ఉంటారా అన్న ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అభిమానులు కోరుకుంటే ఆయనను ఆడిస్తామని చమత్కరించారు. అయితే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాత్రం తమ జట్టు వ్యూహాలు తమకు ఉన్నాయని… మైదానంలో చూద్దామని ధీమా వ్యక్తం చేశారు.
