- రక్తంతో రాతలు… జర్నలిస్టుల హత్యలు
- విలేకరుల హత్యల్లో ప్రపంచంలో నెంబర్ వన్
- అధికారుల అండతోనే కలంపై దాడులు
- దర్యాప్తు సంస్థల నిర్వీర్యం… వ్యవస్థల పతనం
- అవినీతిలో 91వ స్థానంతో దిగజారిన ప్రతిష్ట
సహనం వందే, న్యూఢిల్లీ:
భారతదేశంలో కలం పట్టిన యోధులపై కత్తులు వేలాడుతున్నాయి. అవినీతి తిమింగలాల గుట్టు రట్టు చేస్తే ప్రాణాలే పోయే ప్రమాదకర స్థితి నెలకొంది. పారదర్శకత మచ్చుకైనా కనిపించని చోట ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్-2025’ వెల్లడించిన చేదు నిజాలు దేశ పాలనలోని లోపాలను ఎండగడుతున్నాయి. ఇది కేవలం వ్యవస్థాగత వైఫల్యం కాదు… భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి.

రక్తంతో తడిసిన కలం
నిజం చెప్పే గొంతును నొక్కడమే పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2012 నుండి ప్రపంచవ్యాప్తంగా 829 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వీరిలో అత్యధికులు భారత్ వంటి తక్కువ పారదర్శకత ఉన్న దేశాల వారే కావడం గమనార్హం. జర్నలిస్టుల రక్తం మీద అక్రమ సామ్రాజ్యాలు నిర్మితమవుతున్నాయి. విలేకరులను చంపడం ద్వారా తమ అవినీతి బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎప్‌స్టీన్ వంటి వారి విలాసవంతమైన చీకటి ప్రపంచాల వెనుక ఇలాంటి అణచివేతలే పునాదులుగా ఉన్నాయి.
అవినీతిలో అగ్రస్థానం…
అవినీతి సూచీలో భారత్ గతి తప్పింది. మొత్తం 182 దేశాలలో మనకు 91వ స్థానం దక్కింది. అంటే మనకంటే 90 దేశాలు పాలనలో మెరుగ్గా ఉన్నాయి. 100 మార్కులకు గాను కేవలం 40 పాయింట్లే వచ్చాయి. 50 లోపు స్కోరు రావడం అంటే ఆ దేశంలో అవినీతి కోరలు చాచిందని అర్థం. ఇది దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై మసకబారుస్తోంది. కేవలం అంకెలే కాదు మన వ్యవస్థల వైఫల్యానికి ఇది నిదర్శనం.
పాలకుల కనుసన్నల్లో దర్యాప్తు సంస్థలు
స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు పాలకుల కనుసన్నల్లో మెలుగుతున్నాయి. న్యాయవ్యవస్థతోపాటు దర్యాప్తు సంస్థలు తమ స్వయంప్రతిపత్తిని కోల్పోయాయి. అధికారులే నేరస్తులకు అండగా నిలుస్తూ రక్షణ కవచాలుగా మారుతున్నారు. ప్రజల ఆగ్రహాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్య నియంత్రణలు విఫలమవడంతో అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. ఇది భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసేలా ఉంది.
అగ్రరాజ్యాల్లోనూ కంపు
అవినీతి సెగ కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. అమెరికా 29వ స్థానం, బ్రిటన్ 20వ స్థానాల్లో ఉన్నాయి. అక్కడ కూడా పౌర స్వేచ్ఛ మచ్చుకైనా లేదు. పెద్ద దేశాల పరిస్థితే ఇలా ఉంటే భారత్ వంటి దేశాల గతి ఆందోళనకరం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువల పతనం కనిపిస్తోంది. పారదర్శకత లోపించడం వల్ల సామాన్యుడి ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది.
మున్సిపల్ అధికారుల ముఠాలు
అక్రమాల గొలుసు నగర ప్రణాళికాశాఖ అధికారుల నుండి మొదలవుతోంది. పాలకుల అండతో వీరు అక్రమ సామ్రాజ్యాలను నడుపుతున్నారు. సామాన్యుడికి అందాల్సిన నిధులు దళారుల జేబుల్లోకి మళ్లుతున్నాయి. 90 శాతం జర్నలిస్టుల హత్యలు అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లోనే జరుగుతున్నాయి. ఈ లెక్కలే మన దేశంలోని భయానక వాతావరణానికి అద్దం పడుతున్నాయి. భయం నీడలో జర్నలిజం కొనసాగడం ప్రజాస్వామ్యానికి చేటు.
వ్యవస్థల ప్రక్షాళన జరగాలి…
ఇప్పటికైనా వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులకు తక్షణ రక్షణ కల్పించి సంస్థలకు స్వేచ్ఛనివ్వాలి. పాలకుల మాటల్లో కాకుండా చేతల్లో పారదర్శకత కనిపించాలి. లేదంటే అవినీతి రొంపిలో దేశం మరింత కూరుకుపోవడం ఖాయం.