- రాత్రివేళల్లోనూ ఆడ ఉద్యోగులకు అండ
- క్యాబ్ లో అత్యాధునిక రక్షణ చర్యలు
- దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల సేవలు ప్రారంభం
సహనం వందే, న్యూఢిల్లీ:
మహిళల భద్రత కోసం టెక్నాలజీ తోడైతే అద్భుతాలు జరుగుతాయని గుర్గావ్ ఉదంతం నిరూపించింది. రాత్రివేళల్లో ఒంటరిగా ప్రయాణించే ఆడబిడ్డలకు తోడుగా నిలుస్తున్న మహిళా క్యాబ్ సర్వీసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భయం నీడ నుంచి బయటకు వచ్చి ఆత్మవిశ్వాసంతో ప్రయాణించేలా చేస్తున్న ఈ కొత్త ఒరవడి సామాజిక మార్పుకు నాంది పలుకుతోంది. మహిళా సాధికారతకు ఇదొక గొప్ప ఉదాహరణ.

గుర్గావ్ మహిళ భావోద్వేగం
గుర్గావ్‌కు చెందిన ఒక మహిళ రాత్రివేళ క్యాబ్ బుక్ చేయగా ఒక మహిళా డ్రైవర్ రావడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఈ అద్భుత క్షణాన్ని ఆమె తన మొబైల్‌లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. కేవలం మహిళల కోసమే పనిచేస్తున్న ఈ క్యాబ్ చూసి ఆమె ఎంతో ఆనందపడింది. ప్రతి అమ్మాయికి ఇలాంటి భరోసా కావాలని ఆమె మనసారా కోరుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
డ్రైవర్‌తో ఆసక్తికర సంభాషణ
సదరు మహిళ డ్రైవర్‌తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంది. ఈ సర్వీసు కేవలం పగలు మాత్రమే కాకుండా 24 గంటలు అందుబాటులో ఉంటుందని డ్రైవర్ వెల్లడించారు. ఎప్పుడు బుక్ చేసినా మహిళా డ్రైవరే వస్తారని ఆమె స్పష్టం చేశారు. కేవలం మహిళలనే ఎక్కించుకోవడం వల్ల ప్రయాణికులకు కూడా పూర్తి భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఇది మహిళల ఉపాధికి కూడా కొత్త మార్గాలను చూపుతోంది. ఫెర్రీ రైడ్ (Fery Ride) అనే యాప్ లో క్యాబ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ గుర్గావ్ ల మధ్య మహిళా క్యాబ్ లు నడుస్తున్నాయి.
టెక్నాలజీతో పక్కా భద్రత
ప్రయాణికుల రక్షణ కోసం ఈ క్యాబ్‌లలో అత్యాధునిక వసతులు కల్పించారు. ప్రతి వాహనంలో కెమెరాలను అమర్చడంతో పాటు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంది. మొబైల్ కనెక్టివిటీ ద్వారా క్యాబ్ కదలికలను ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్ పర్యవేక్షిస్తుంది. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేలా వ్యవస్థను రూపొందించారు. టెక్నాలజీని ఇలా సరైన పద్ధతిలో వాడుకోవడం వల్ల మహిళల్లో ధైర్యం పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా విస్తరణ దిశగా
ఈ మహిళా క్యాబ్ సర్వీసు ఒక్క నగరానికే పరిమితం కాలేదు. ఇది ఇప్పటికే భారతదేశవ్యాప్తంగా పలు నగరాల్లో తన సేవలను అందిస్తోంది. ఇందులో క్యాబ్ సదుపాయంతో పాటు స్కూటర్ ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇంకా చిన్న పట్టణాలకు ఈ సేవలు అందలేదని కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో దేశంలోని ప్రతి మూలకు ఈ భరోసా చేరాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
నెటిజన్ల మనసు గెలిచిన ముందడుగు
మహిళలు ఇతర మహిళలకు తోడుగా నిలవడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వాలు చేసే చట్టాల కంటే ఇలాంటి క్షేత్రస్థాయి మార్పులే అసలైన భద్రతను ఇస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆడపిల్లల స్వేచ్ఛకు గొడుగు పడుతున్న ఇలాంటి స్టార్టప్స్‌ను అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
సామాజిక మార్పుకు సంకేతం
మహిళా డ్రైవర్ల రాక కేవలం ప్రయాణ సౌకర్యమే కాదు ఒక సామాజిక విప్లవం. మగవారు మాత్రమే డ్రైవింగ్ చేయాలన్న మూస పద్ధతులను ఇవి చెరిపివేస్తున్నాయి. రాత్రిపూట ప్రయాణం అంటే భయపడే కాలం పోయి ధైర్యంగా అడుగు వేసే కాలం వచ్చింది. మహిళా సాధికారత అంటే కేవలం చదువు.. ఉద్యోగమే కాదు సురక్షితమైన ప్రయాణం కూడా అని ఈ వ్యవస్థ చాటిచెబుతోంది.