- దక్షిణాది రాష్ట్రాలను ముంచుతున్న ఢిల్లీ
- అభివృద్ధికి రివర్స్ గేర్… రేవంత్ రెడ్డి ఫైర్
- పన్నుల పేరుతో భారీ దోపిడీ అని మండిపాటు
సహనం వందే, హైదరాబాద్:
దక్షిణాది రాష్ట్రాల ఆదాయంతో ఉత్తరాదిని సాదుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గళమెత్తారు. మన రాష్ట్రం నుంచి వెళ్తున్న నిధుల్లో సగం కూడా తిరిగి రాకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు… దక్షిణాది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం పన్నుల పంపిణీలో అనుసరిస్తున్న అన్యాయమైన సూత్రాలు ఇప్పుడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఈ మేరకు ఆయన హైదరాబాదులో మాట్లాడారు.

అన్యాయం ఏ స్థాయిలో జరుగుతుందంటే?
కేంద్రానికి తెలంగాణ ఇస్తున్న ప్రతి రూపాయికి బదులుగా కేవలం 42 పైసలే వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలు బయటపెట్టారు. అంటే మనం 100 రూపాయలు ఇస్తే 58 రూపాయలను కేంద్రం ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తోంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు అవి ఇచ్చే దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నారు.
దక్షిణాది గొంతు విప్పకపోతే ప్రమాదం…
తెలంగాణ కంటే ఘోరంగా కర్ణాటకకు కేవలం 16 పైసలే అందుతుండటం తీవ్ర వివక్షకు అద్దం పడుతోంది. తమిళనాడుకు 26 పైసలు, కేరళకు 49 పైసలే తిరిగి వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 30 శాతం పైగా సహకరిస్తున్నా కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో మాత్రం 15 నుంచి 18 శాతమే దక్కుతోంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించకపోతే భవిష్యత్తులో దక్షిణాది ఆర్థికంగా కుప్పకూలే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ముఖ్యమంత్రులతో కలిసి పోరాడతాం…
లక్షల కోట్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకునే కేంద్ర మంత్రులు ఆ నిధులన్నీ మన పన్నుల నుంచే వచ్చాయని గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ముపై కేంద్రానికి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఇవ్వకుండా సబ్సిడీల పేరుతో మభ్యపెట్టడం ఆపాలని కోరారు. న్యాయమైన వాటా దక్కే వరకు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.
బీజేపీ మత ఎత్తుగడలు
పన్నుల వాటాపై చర్చ జరగకుండా ఉండేందుకే బీజేపీ మత రాజకీయాన్ని వాడుకుంటోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అసదుద్దీన్ ఓవైసీని ఒక రాజకీయ దిష్టిబొమ్మగా చూపిస్తూ హిందూ ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. అభివృద్ధి గురించి మాట్లాడమంటే ఓవైసీ పేరు జపించడం బీజేపీ నైతిక పతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒవైసీతో బీజేపీకి లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనపై దండయాత్ర
బీఆర్ఎస్ నేతలు పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సర్పంచ్ నుంచి మున్సిపాలిటీ వరకు అంతా కబ్జా చేసి ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడిగేందుకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. గంజాయి లేదా కోకైన్ మత్తులో ఉన్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లూటీకి అలవాటు పడిన నేతలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.