మస్క్‌కే మస్కా – టెస్లా అధినేతనే మోసం చేసిన ఉద్యోగులు

Elon Musk
  • రెజ్యూమెల్లో ఉన్నవి లేనట్టుగా అబద్ధాలు
  • నైపుణ్యం లేకపోయినా కొందరి నటన
  • అలా అతని వద్ద ఉద్యోగం సంపాదించిన వైనం
  • పశ్చాత్తాపంతో రూటు మార్చిన ఎలాన్ మస్క్
  • ప్రాక్టికల్ పనిమంతుల ఎంపికపైనే కేంద్రీకరణ

సహనం వందే, హైదరాబాద్:

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కే ఊహించని షాక్ తగిలింది. అంగారకుడిపైకి మనుషులను పంపే అంతటి మేధావి సైతం కొందరు అభ్యర్థుల చేతిలో మోసపోయారు. ఉద్యోగ వేటలో కొందరు వాడే మాయాజాలాన్ని చూసి ఆయన విస్తుపోయారు. కేవలం కాగితాల మీద ఉన్న రంగు రంగుల అబద్ధాలను చూసి తాను కూడా బోల్తా పడ్డానని మస్క్ స్వయంగా ఒప్పుకున్నారు.

పిక్సీ డస్ట్ మాయ
కొందరు అభ్యర్థులు తమ రెజ్యూమెలలో లేని నైపుణ్యాలను ఉన్నట్లుగా చూపిస్తున్నారు. దీన్నే మస్క్ పిక్సీ డస్ట్ అని పిలిచారు. చూడటానికి ఈ దరఖాస్తులు అద్భుతంగా కనిపిస్తాయి. కానీ వాస్తవంలో వారికి ఆ పని గురించి కనీస అవగాహన ఉండదు. ఇలాంటి మెరుపులను చూసి తాను చాలాసార్లు తప్పుడు వ్యక్తులను ఎంచుకున్నానని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఏలే ఆయనకే ఈ తిప్పలు తప్పలేదు.

నైపుణ్యం లేని నటన
చాలా మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలలో గొప్పగా నటించేస్తున్నారు. ఇతరులు చేసిన ఘనతలను తామే చేసినట్లు చెప్పుకుంటున్నారు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో అనుభవం ఉన్నట్లుగా నమ్మిస్తున్నారు. ఇలాంటి నకిలీ ప్రతిభావంతుల వల్ల కంపెనీల ఉత్పాదకత దెబ్బతింటోంది. కేవలం మాటల గారడీతో ఉద్యోగాలు సంపాదించే వారి సంఖ్య పెరుగుతోందని మస్క్ హెచ్చరించారు.

ఖరీదైన పొరపాటు
ఒక తప్పుడు వ్యక్తిని కీలక పదవిలో నియమించడం వల్ల కంపెనీకి భారీ నష్టం జరుగుతుంది. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థల్లో ఇలాంటి పొరపాట్లు జరిగినట్లు మస్క్ సూచించారు. సరైన అభ్యర్థిని గుర్తించడం మస్క్ కు కూడా సవాలుగా మారింది. ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల కోట్లాది రూపాయల సమయం, వనరులు వృధా అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

వడపోతలో మార్పులు
ఇప్పుడు మస్క్ తన కంపెనీలలో ఎంపిక ప్రక్రియను మార్చేశారు. కేవలం రెజ్యూమెలను చూడటం మానేశారు. అభ్యర్థి గతంలో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన సమస్య ఏమిటి? దాన్ని ఎలా పరిష్కరించారు? అనే ప్రశ్నతోనే అసలు రంగు బయటపడుతుందని ఆయన నమ్ముతున్నారు. అబద్ధం చెప్పే వారు సమస్య లోతును వివరించలేరని మస్క్ గుర్తించారు. అందుకే ఇప్పుడు ప్రాక్టికల్ పరీక్షలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

టెక్ రంగంలో గుబులు
మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. కేవలం డిగ్రీలు, ఆకర్షణీయమైన రెజ్యూమెలు ఉన్నంత మాత్రాన ఉద్యోగాలు రావని ఆయన తేల్చి చెప్పారు. సుమారు 70 శాతం మంది అభ్యర్థులు తమ రెజ్యూమెలలో చిన్నపాటి మార్పులు లేదా అబద్ధాలు చేరుస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఉద్యోగాల ఎంపిక మరింత కఠినం కానుంది.

ప్రతిభకే పట్టం
ఉద్యోగం పొందాలంటే నిజాయితీ ఉండాలని మస్క్ సూచిస్తున్నారు. లేని నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల ఏదో ఒక రోజు అభాసుపాలు కాక తప్పదని హెచ్చరించారు. నిజమైన ప్రతిభ ఉన్నవారిని గుర్తించేందుకు ఇప్పుడు ఏఐ వంటి అధునాతన సాంకేతికతను వాడుతున్నారు. అబద్ధపు రెజ్యూమెల కాలం చెల్లిందని.. ఇకపై చేతలకే ప్రాధాన్యత ఉంటుందని మస్క్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *