- మెదడుకు పట్టిన గూగుల్ బాబా తుప్పు
- జ్ఞాపకశక్తి అంతా ఔట్ సోర్సింగ్ పద్ధతే
- పుస్తక పఠనం మాయం… జ్ఞాపక శక్తి ఔట్
- రోబోల ముందు వెలవెలబోతున్న మేధ
- పడిపోతున్న ఏకాగ్రత.. పెరుగుతున్న వ్యసనం
- న్యూటన్… ఐన్ స్టీన్… తర్వాత ఎవరు?
- నేడు పాత ఆవిష్కరణలకు పాలిష్ పట్టడమే!
- బటన్ నొక్కే ఆపరేటర్లుగా మారుతున్న తరం
- యంత్రాల చేతిలో బొమ్మలుగా మిగలడమేనా!
సహనం వందే, హైదరాబాద్:
టెక్నాలజీ పెరిగితే మనిషి తెలివి పెరుగుతుందని అనుకున్నాం. కానీ సీన్ రివర్స్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక మనిషి తన ఆలోచనా శక్తిని కోల్పోతున్నాడు. ముఖ్యంగా జెన్ జెడ్ (1997-2012 మధ్య పుట్టిన వారు) తమ తల్లిదండ్రుల కంటే తక్కువ తెలివితేటలు కలిగి ఉన్నారని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మానవ మేధస్సు తిరోగమనంలో పయనిస్తోంది.

ఫ్లిన్ ఎఫెక్ట్ కు పాతర
గత 100 ఏళ్లుగా ప్రతి కొత్త తరం తన పాత తరం కంటే ఎక్కువ ఐక్యూ స్కోర్లను సాధించేది. దీనిని సైన్స్ భాషలో ‘ఫ్లిన్ ఎఫెక్ట్’ అంటారు. కానీ జెన్ జెడ్ తో ఈ ట్రెండ్ కి బ్రేక్ పడింది. న్యూరో సైంటిస్ట్ డాక్టర్ జారెడ్ కూనీ హార్వత్ విశ్లేషణ ప్రకారం.. జ్ఞాపకశక్తి, సమస్యల పరిష్కారం, ఏకాగ్రత వంటి విషయాల్లో నేటి తరం స్కోర్లు ఘోరంగా పడిపోయాయి. డిజిటల్ పరికరాల వాడకం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
మెదడు ఒక ప్రాసెసింగ్ టూల్ మాత్రమే
గతంలో మిలీనియల్స్ ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించేవారు. తద్వారా మెదడుకు పదును పెరిగేది. కానీ జెన్ జెడ్ మెదడును కేవలం ఒక ప్రాసెసింగ్ టూల్ లా వాడుతున్నారు. ఏదైనా కావాలంటే గూగుల్ సెర్చ్ లేదా ఏఐ మీద ఆధారపడుతున్నారు. దీనివల్ల మెదడులో సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే శక్తి తగ్గిపోయింది. జ్ఞాపకశక్తి లేకపోతే విశ్లేషణాత్మక ఆలోచన సాధ్యం కాదు. ఫలితంగా లోతైన విషయాలను అర్థం చేసుకోవడంలో నేటి యువత తడబడుతోంది.
పడిపోతున్న ఏకాగ్రత స్థాయి
నేటి తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అటెన్షన్ స్పాన్ తగ్గడం. సోషల్ మీడియాలో వచ్చే షార్ట్ వీడియోలు, నిరంతర నోటిఫికేషన్ల వల్ల దేనిమీదైనా 10 నిమిషాలు కూడా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీనివల్ల పుస్తక పఠనం కనుమరుగవుతోంది. 2018 తర్వాత అంతర్జాతీయ విద్యా పరీక్షల్లో (పీసా) గణితం, రీడింగ్ స్కోర్లు పడిపోవడం దీనికి నిదర్శనం. లోతైన విజ్ఞానం కంటే ఉపరితల సమాచారం పైనే వీరు ఎక్కువగా ఆధారపడుతున్నారు.
ఆవిష్కరణలు ఎక్కడ?
ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వంటి మేధావులు నిరంతర పరిశీలన, లోతైన ఆలోచనతో ప్రపంచాన్ని మార్చారు. కానీ గత 40 ఏళ్లలో శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తగ్గాయని నిపుణులు అంటున్నారు. మనం ఇప్పుడు చేస్తున్నవన్నీ పాత ఆవిష్కరణలకు పాలిష్ పట్టడమే. సొంతంగా ఆలోచించే శక్తి తగ్గిపోవడంతో కొత్త సిద్ధాంతాలు రావడం లేదు. అంతా టెక్నాలజీ చేసి పెడుతుంటే మనిషి కేవలం బటన్ నొక్కే ఆపరేటర్ లా మారిపోతున్నాడు.
భవిష్యత్తుకు పొంచి ఉన్న ముప్పు
జ్ఞాపకశక్తిని యంత్రాలకు ఔట్ సోర్సింగ్ ఇవ్వడం వల్ల మానవ సామాజిక వికాసం దెబ్బతింటోంది. ఏఐ చెప్పినదే వేదం అని నమ్మడం వల్ల సొంత విజ్ఞత మసకబారుతోంది. ఇది కేవలం పరీక్షల మార్కుల సమస్య కాదు. దేశాల విధాన నిర్ణయాలు, సామాజిక బాధ్యతల మీద కూడా ప్రభావం చూపుతుంది. మనిషి తన ఆలోచనా శక్తిని యంత్రాలకు తాకట్టు పెడితే భవిష్యత్తులో యంత్రాలే మనిషిని శాసించే ప్రమాదం ఉంది.
మేల్కోవాల్సిన సమయం
టెక్నాలజీని ఒక సాధనంగా మాత్రమే చూడాలి తప్ప దానికే బానిస కాకూడదు. డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి ప్రకృతిని పరిశీలించడం, పుస్తకాలు చదవడం వంటివి మెదడుకు తిరిగి పదును పెడతాయి. జెన్ జెడ్ తన మేధస్సును నిరూపించుకోవాలంటే స్క్రీన్ల నుంచి కళ్లు తిప్పి లోతైన ఆలోచన వైపు మళ్లాలి. లేదంటే రాబోయే తరాలు కేవలం యంత్రాల చేతిలో బొమ్మలుగా మిగిలిపోతాయి.