- ఆగని ఆపరేషన్ల దందా… ప్రాణాలతో ఆటలు
- కోట్ల కోసం ఆసుపత్రుల కక్కుర్తి పనులు
- హైదరాబాద్‌లోనూ కార్పొరేట్ ఆస్పత్రుల వల
- అమెరికా ప్లాస్టిక్ సర్జన్ల సంఘం ఆగ్రహం
సహనం వందే, హైదరాబాద్:
లింగ మార్పిడి పేరుతో జరుగుతున్న భారీ దందాను అమెరికా ప్లాస్టిక్ సర్జన్ల సంఘం ఎండగట్టింది. 19 ఏళ్ల లోపు పిల్లలకు ఇలాంటి సర్జరీలు చేయడం అత్యంత ప్రమాదకరమని తేల్చి చెప్పింది. సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండానే వేల కోట్లు గడించడానికి ఆసుపత్రులు చేస్తున్న ప్రయత్నాలపై విరుచుకుపడింది. ఈ నిర్ణయంతో వైద్య రంగంలో పెద్ద చర్చ మొదలైంది.

అసలేమిటి ఈ సర్జరీ
జెండర్ అఫర్మింగ్ సర్జరీ అంటే ఒక వ్యక్తి పుట్టుకతో వచ్చిన లింగాన్ని మార్చుకోవడం. ఉదాహరణకు ఒక అబ్బాయి తాను అమ్మాయిగా మారాలని కోరుకుంటే శస్త్రచికిత్స ద్వారా రొమ్ములను అమర్చడం లేదా జననేంద్రియాలను మార్చడం చేస్తారు. అలాగే అమ్మాయిగా పుట్టిన వారు అబ్బాయిగా మారేందుకు రొమ్ములను తొలగించడం (టాప్ సర్జరీ)… గడ్డం రావడం కోసం హార్మోన్లు వాడటం వంటివి చేస్తారు. చిన్న వయసులో ఇలా శరీర భాగాలను కోయడం వల్ల వారు భవిష్యత్తులో పిల్లల్ని కనే శక్తిని శాశ్వతంగా కోల్పోతారు.
వ్యాపారమే పరమావధి
ప్రస్తుతం ఈ లింగ మార్పిడి అనేది ఒక భారీ మాఫియాగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్కెట్ విలువ అక్షరాలా 24,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. వచ్చే 10 ఏళ్లలో ఇది 63,000 కోట్లకు చేరుతుందని అంచనా. ఒక్కో సర్జరీకి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సుమారు 15 లక్షల నుండి 40 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కేవలం ఆదాయం కోసమే చిన్న పిల్లలకు కూడా ఇష్టానుసారంగా హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తూ… ఆపరేషన్లు చేస్తున్నారని సర్జన్ల సంఘం తీవ్రంగా ఆక్షేపించింది.
హైదరాబాద్‌లోనూ భారీ దందా
భాగ్యనగరంలో లింగ మార్పిడి సర్జరీల వ్యాపారం ఏటా 15 శాతం మేర పెరుగుతోంది. ఇక్కడ ఒక్కో ఆపరేషన్‌కు 3 లక్షల నుండి 8 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. విదేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు తక్కువ కావడంతో ఇతర దేశాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. నగరంలోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి మరీ ఈ దందాను సాగిస్తున్నాయి. ప్రతి నెలా సగటున 20 నుండి 30 మంది ఇలాంటి చికిత్సల కోసం హైదరాబాద్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇందులో 18 ఏళ్ల లోపు వారు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో పెరుగుతున్న బాధితులు
గణాంకాలు పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అమెరికాలో 2017లో సుమారు 15,000 మంది సర్జరీలు చేయించుకోగా… 2020 నాటికి ఆ సంఖ్య 30,000 దాటింది. ఇందులో మైనర్ల సంఖ్య కూడా భారీగానే ఉంది. కేవలం రొమ్ముల తొలగింపు సర్జరీల ద్వారానే ఆసుపత్రులు ఏటా 1,200 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నాయి. ఏటా ఈ బాధితుల సంఖ్య 20 శాతం మేర పెరుగుతుండటం గమనార్హం.
నిపుణుల ఆవేదన…
ఈ వ్యవహారంపై వైద్య రంగంలోని ప్రముఖులతో నిర్వహించిన ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. 19 ఏళ్ల లోపు పిల్లల శరీరాలు పూర్తిగా ఎదగవని… ఆ వయసులో చేసే మార్పులు ప్రాణాంతకమని వారు పేర్కొన్నారు. మానసిక గందరగోళంలో ఉన్న పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వకుండా సర్జరీలు చేయడం నేరమని నిపుణులు స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో ఇలాంటి ఆపరేషన్లు విఫలమై బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎందుకు చేయించుకుంటున్నారు?
చిన్న వయసులో హార్మోన్ల ప్రభావం వల్ల లేదా సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలామంది తమ అవయవాలపై అసంతృప్తి చెందుతుంటారు. దీనినే వైద్య భాషలో జెండర్ డిస్ఫోరియా అంటారు. అయితే ఇలాంటి భావనలు వయసు పెరిగే కొద్దీ వాటంతట అవే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆసుపత్రులు మాత్రం ఇలాంటి పిల్లల్ని టార్గెట్ చేసి వారిని తప్పుదోవ పట్టించి సర్జరీ టేబుల్ వరకు తీసుకెళ్తున్నాయని సర్జన్ల సంఘం ఆరోపించింది.