- ఉత్తరాది కార్మికులపై మంత్రి వ్యాఖ్యలు
- పానీపూరి అమ్మడానికి వచ్చారని కామెంట్స్
- టేబుళ్లు తుడవడానికి వస్తున్నారని వ్యాఖ్య
- మరోసారి ఉత్తరాది దక్షిణాది మధ్య కోల్డ్ వార్
- దక్షిణాదిపై వివక్షే ఈ వ్యాఖ్యలకు కారణం
సహనం వందే, తమిళనాడు:
దేశంలో ప్రాంతీయ చిచ్చు మళ్ళీ రాజుకుంది. ఉత్తరాది ప్రజలపై తమిళనాడు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఉపాధి కోసం వచ్చే శ్రామికులను కించపరచడం దేశ ఐక్యతకు గొడ్డలి పెట్టుగా మారింది. ఈ వివాదం వెనుక రాజకీయ వ్యూహాలు, ఆర్థిక వివక్ష కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

పానీపూరీ మంటలు
తమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఉత్తరాది వారు ఇక్కడికి కేవలం పానీపూరీ అమ్మడానికి, టేబుళ్లు తుడవడానికి మాత్రమే వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కూలీలుగా వచ్చేవారంతా ఆ ప్రాంతం వారేనంటూ తక్కువ చేసి మాట్లాడారు. ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉత్తరాది ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రి హోదాలో ఉండి శ్రమజీవులను అవమానించడం తగదని మేధావులు హెచ్చరిస్తున్నారు.
పాత వివాదాల పునరావృతం
డీఎంకే నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఎంపీ దయానిధి మారన్ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీ తప్ప ఇంగ్లీష్ రాకపోవడం వల్లే వారు దక్షిణాదికి కూలీలుగా వస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువు లేకపోతే బానిసలుగా మిగిలిపోతారని విమర్శించారు. మరో మంత్రి టీఆర్‌బీ రాజా సైతం ఉత్తరాది మహిళల గౌరవం విషయంలో వింత పోలికలు తెచ్చి వివాదం రేపారు.
నిధుల కేటాయింపులో వివక్ష
మంత్రుల ఆగ్రహం వెనుక నిధుల పంపిణీలో జరుగుతున్న అన్యాయం కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి లక్షల కోట్లు ఇస్తున్నా… తిరిగి వెనక్కు ఇవ్వడంలో మాత్రం మొండిచేయి ఎదురవుతోంది. దక్షిణాది నుంచి వెళ్లే ప్రతి 1 రూపాయికి కేంద్రం కేవలం 20 నుండి 30 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోంది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు 1 రూపాయి కంటే ఎక్కువ వాటా దక్కుతోంది. ఈ ఆర్థిక వివక్షే ప్రాంతీయ అహానికి కారణమవుతోంది.
ఎన్నికల వేళ రాజకీయ వ్యూహం
తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ స్థానాల ఎన్నికల నేపథ్యంలో ఈ గొడవ మరింత ముదిరింది. ఏప్రిల్ లేదా మే నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో డీఎంకే భాషా కార్డును వాడుకుంటోంది. స్థానిక ఓటర్లను ఆకర్షించేందుకు వలస కార్మికులను టార్గెట్ చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. దేశాన్ని ఏకం చేస్తామని చెబుతూనే మరోపక్క ఇలాంటి చీలిక వ్యాఖ్యలు చేయడం ద్వంద్వ నీతి అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఆవేదన నుండి ఆవేశం
ఉత్తరాది రాష్ట్రాల జనాభా పెరగడం వల్ల వారికి నిధులు ఎక్కువగా కేటాయించడం దక్షిణాదికి శాపంగా మారింది. జనాభా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించడం సరికాదని డీఎంకే వాదిస్తోంది. ఈ అసంతృప్తి వలస కార్మికులపై వివక్షగా మారుతోంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలపై భారం వేయడం వల్ల రాష్ట్రాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే ఈ ఉత్తర దక్షిణ లడాయి భవిష్యత్తులో దేశ సమగ్రతకే ముప్పుగా మారే అవకాశం ఉంది.