‘క్యాన్సరా’బాద్ – హైదరాబాద్ కు రొమ్ము గండం

Breast Cancer
  • రికార్డులు బద్దలు కొడుతున్న క్యాన్సర్ రక్కసి!
  • ఐసీఎంఆర్ నివేదికలో షాకింగ్ నిజాలు
  • జాతీయ సగటు లక్షకు 26.. మన దగ్గర 54
  • రొమ్ము క్యాన్సర్ రాజధానిగా భాగ్యనగరం
  • 30 ఏళ్ల యువతులకూ తప్పని ముప్పు
  • జంక్ ఫుడ్, బిర్యానీలే ముంచుతున్నాయి

సహనం వందే, హైదరాబాద్:

హైదరాబాద్ మహిళల ఆరోగ్యంపై ‘రొమ్ము’ రక్కసి పంజా విసురుతోంది. ఐసీఎంఆర్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ) విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసుల సగటు ఒక లక్షకు 26.6 ఉంటే… హైదరాబాద్‌లో మాత్రం అది ఏకంగా 54కి చేరింది. అంటే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే మన దగ్గర ముప్పు రెట్టింపు కంటే ఎక్కువే.

రిపోర్టుల్లోని నగ్న సత్యాలు…
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. గత పదేళ్లలో హైదరాబాద్ లో క్యాన్సర్ కేసుల నమోదు 20 శాతం పెరిగింది. దేశంలోని మెట్రో నగరాలైన ఢిల్లీ, బెంగళూరుల కంటే హైదరాబాదులోనే వ్యాప్తి రేటు అత్యధికంగా ఉంది. ప్రతి లక్ష మందిలో 54 మంది మహిళలు ఈ మహమ్మారి బారిన పడుతుండటం గమనార్హం. జాతీయ స్థాయి కంటే ఈ రేటు దాదాపు 100 శాతం ఎక్కువగా ఉండటం ఆరోగ్య వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది.

యువతపైనే రక్కసి గురి
గతంలో ఈ వ్యాధి 50 ఏళ్లు దాటిన వారికి వస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్లలోపు మహిళల్లోనే 48 శాతం కేసులు బయటపడుతున్నాయని ఐసీఎంఆర్ గణాంకాలు చెబుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, సంతానాన్ని వాయిదా వేయడం వంటి కారణాల వల్ల ఈ ముప్పు పెరుగుతోంది. 30 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బారిన పడుతుండటం నగర మహిళల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.

గణాంకాల్లో మరణాల మృదంగం
నగరంలో నమోదవుతున్న కేసుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది 3వ దశ దాటిన తర్వాతే ఆసుపత్రులకు వస్తున్నారు. దీనివల్ల మరణాల రేటు కూడా భారీగా ఉంటోంది. తొలి దశలో గుర్తిస్తే 95 శాతం ప్రాణాలు కాపాడే అవకాశం ఉన్నా అవగాహన లేక మహిళలు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి 22 మంది మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీనింగ్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం.

Physical Activity Vs  Breast Cancer

జంక్ ఫుడ్ సంస్కృతే అసలైన విలన్…
నగరంలో పెరిగిన జంక్ ఫుడ్ సంస్కృతి, ఎక్కడ చూసినా బిర్యానీ కేంద్రాలు వల్ల తలెత్తే ఊబకాయం రొమ్ము క్యాన్సర్ కు ఊతమిస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటోంది. నగరంలోని కలుషిత నీరు, ఆహారంలో కల్తీ కూడా క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్లాస్టిక్ పాత్రల వాడకం వల్ల జరిగే నష్టంపై ఐసీఎంఆర్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

స్క్రీనింగ్ లో సర్కారు మొద్దు నిద్ర
కేసులు ఇంతలా పెరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో కూడా సరిపడా మమ్మోగ్రఫీ యంత్రాలు లేవు. ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా ప్రజల ప్రాణాలు కాపాడే మౌలిక వసతులపై ఖర్చు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సర్కారు మేల్కొనకపోతే భాగ్యనగరం కాస్తా క్యాన్సర్ నగరంగా మారే ప్రమాదం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *