- రిటైర్డ్ ఐఏఎస్ వీఎన్ విష్ణు మార్గదర్శనం
- పదేళ్లలో 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఎంపిక
- తాజాగా ఏపీ గ్రూప్-1లో శిష్యుల జైత్రయాత్ర
- 11 మంది ఎంపిక అయినట్లు వెల్లడి
- ‘మీ సేవ’ రూపకర్త… కొత్త తరానికి మెంటార్
- రూపాయి ఆశించకుండా ఉచితంగా శిక్షణ
సహనం వందే, అమరావతి/హైదరాబాద్:
కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల ఆర్భాటం లేదు. లక్షల ఫీజుల వసూళ్లు అసలే లేవు. కేవలం ఆశయ బలం ఉంటే చాలు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎన్ విష్ణు నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ పరీక్షల్లో 31 మంది అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తే.. అందులో ఏకంగా 11 మంది గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నిస్వార్థ సేవకు దక్కిన అసలైన గౌరవం ఇది.

విజయ కేతనం ఎగురవేసిన శిష్యులు
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత తెలంగాణలో ఐఏఎస్ సేవలు అందించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా… ఆ తర్వాత వివిధ హోదాల్లో స్థాయిలో పనిచేశారు. మీ సేవల రూపకర్త ఆయనే వీఎన్ విష్ణు. ఆయన ఐఏఎస్ అవడం ఒక ఎత్తు అయితే… తన చేతుల్లో అనేక మందిని తీర్చిదిద్దుతున్నారు. దశాబ్ద కాలంగా ఆయన మెంటారుగా వ్యవహరించి ఏకంగా 50 మందిని సివిల్ సర్వెంట్లుగా తీర్చిదిద్దటం ఆయన పట్టుదలకు నిదర్శనం. తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల్లో విష్ణు శిష్యులు సత్తా చాటారు. యాదర్షం సురేష్ అత్యున్నతమైన డెప్యూటీ కలెక్టర్ పదవికి ఎంపికయ్యారు. కృష్ణవేణి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ టాక్స్ హోదా దక్కించుకున్నారు. శివనాగ గౌరి, ఓంకార వెంకట నాగేశ్వరరావు, మధుచరణ్ ముగ్గురూ డీఎస్పీ ఉద్యోగాలకు ఎంపికై సత్తా చాటారు. వైష్ణవి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ టాక్స్ గా ఎంపికయ్యారు.
దశాబ్ద కాలంగా నిరంతర సేవ
విష్ణు ఈ ప్రయాణాన్ని నిన్న మొన్న ప్రారంభించలేదు. 2013 నుంచి ఆయన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 పరీక్షలకు ఆయన మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ప్రతి ఏడాది కనీసం సరాసరి ఐదుగురు అభ్యర్థులు తుది జాబితాలో నిలుస్తున్నారు. రూపాయి ఆశించకుండా ఉచితంగా శిక్షణ ఇవ్వడమే ఆయన ప్రత్యేకత. పేద విద్యార్థులకు ఆయన ఓ నిశ్శబ్ద విప్లవంలా మారారు.
మానవత్వమే అసలైన పెట్టుబడి
నేటి రోజుల్లో విద్య అనేది ఒక వ్యాపారంగా మారింది. అలాంటి సమయంలో విష్ణు చేస్తున్న కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఎలాంటి ఫీజులు తీసుకోకుండా అభ్యర్థులను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దడం సామాన్యమైన విషయం కాదు. తన సమయాన్ని, జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం ధారపోస్తున్నారు. శిష్యుల విజయం కంటే గురువుకు దక్కే పెద్ద బహుమతి ఏముంటుంది?
ప్రభుత్వ సర్వీసులో కొత్త వెలుగులు
ఎంపికైన అభ్యర్థులంతా మధ్యతరగతి, సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వారే. సరైన గైడెన్స్ ఉంటే సివిల్స్ లాంటి కఠినమైన పరీక్షలను కూడా ఎదుర్కోవచ్చని వీరు నిరూపించారు. రేపు బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే చిత్తశుద్ధితో పనిచేస్తామని వారు చెబుతున్నారు. విష్ణు అందించిన స్ఫూర్తితో సమాజ సేవలో ముందుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ విజయాలు భవిష్యత్తు అభ్యర్థులకు కొండంత ఆశను కల్పిస్తున్నాయి.