- యూనివర్సిటీల్లో అగ్రవర్ణ విద్యార్థుల దాడులు
- ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు
- యూజీసీ నిబంధనలపై అగ్రవర్ణ అభ్యంతరం
- విద్యా వికాసంపై బలహీన వర్గాల కేంద్రీకరణ
సహనం వందే, హైదరాబాద్:
ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష కోరలు చాస్తోంది. విజ్ఞానం నేర్చుకోవాల్సిన క్యాంపస్‌లు ఇప్పుడు అంటరానితనం, వివక్షకు వేదికలుగా మారుతున్నాయి. ఐదేళ్లలో ఈ అరాచకాలు 118 శాతం పెరగడం దేశ విద్యా వ్యవస్థకే మచ్చగా నిలుస్తోంది. బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారా లేక దాడులు పెరిగాయా అనే చర్చ ఇప్పుడు రాజకీయంగా వేడెక్కుతోంది.

రికార్డు స్థాయిలో ఫిర్యాదులు
విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గడచిన 5 ఏళ్లలో పరిస్థితి దారుణంగా మారింది. 2019-20 విద్యా సంవత్సరంలో కేవలం 173 ఫిర్యాదులు నమోదైతే… 2023-24 నాటికి ఆ సంఖ్య 378కి చేరింది. యూజీసీ లెక్కల ప్రకారం ఇది 118 శాతం పెరుగుదల. చదువుకున్న చోటే ఇలాంటి వివక్ష ఎదురుకావడం విచారకరం.
పరిష్కారంలో వేగం
ఫిర్యాదులు పెరుగుతున్నా విద్యా సంస్థలు వాటి పరిష్కారంలో వేగంగా స్పందిస్తున్నాయి. గత 5 ఏళ్లలో మొత్తం 1160 ఫిర్యాదులు రాగా అందులో 1052 కేసులను పరిష్కరించారు. అంటే సుమారు 90.6 శాతం పరిష్కార రేటు నమోదైంది. ఆన్‌లైన్ పోర్టల్స్ అందుబాటులోకి రావడంతో విద్యార్థులు భయం విడనాడి తమపై జరుగుతున్న అన్యాయాలను ఫిర్యాదు చేస్తున్నారు.
కొత్త నిబంధనల రగడ
వివక్షను అరికట్టేందుకు యూజీసీ 2026 పేరుతో కొత్త నిబంధనలు తెచ్చింది. ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వాన్ని పెంచడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ నిబంధనలపై అగ్రవర్ణాల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనంగా మారుతోంది.
కేంద్ర మంత్రి భరోసా
కొత్త నిబంధనలపై రేగుతున్న దుమారానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెక్ పెట్టారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని ఎవరూ దుర్వినియోగం చేయలేరని హామీ ఇచ్చారు. వివక్ష లేని విద్యా వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని కుండబద్దలు కొట్టారు. ఇది క్యాంపస్‌లలో చర్చనీయాంశంగా మారింది.
పెరుగుతున్న రిజర్వుడు విద్యార్థులు…
అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నత విద్య వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఓబీసీ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. 2017-18 లో 1.28 కోట్లుగా ఉన్న ఓబీసీ విద్యార్థుల సంఖ్య 2021-22 నాటికి 1.63 కోట్లకు చేరింది. ఎస్టీ విద్యార్థుల నమోదు కూడా 41 శాతం పెరిగి 19 లక్షల నుండి 27 లక్షలకు చేరుకోవడం విశేషం.
నిలకడగా ఎస్సీ విద్యార్థుల వృద్ధి
ఎస్సీ విద్యార్థులు కూడా చదువుల్లో ముందంజలో ఉన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో వీరి నమోదు 67.62 లక్షలు దాటింది. కరోనా విపత్తు సమయంలోనూ ఈ వృద్ధి ఆగకపోవడం గమనార్హం. వివక్ష ఫిర్యాదులు పెరుగుతున్నా… అణగారిన వర్గాల విద్యార్థులు పట్టుదలతో క్యాంపస్‌లలో అడుగుపెడుతున్నారు. అక్షరమే ఆయుధంగా వివక్షపై పోరాడుతున్నారు.