బరువుపై ‘నిద్రే’ బ్రహ్మాస్త్రం – గాఢ నిద్రతోనే స్థూలకాయానికి చెక్

good Sleep - Weightloss
  • నడకే కాదు కండలతోనే కొవ్వు ఖతం
  • పేగులు బాగుంటేనే ఆరోగ్యం
  • జన్యువులను జయించవచ్చు
  • రెయిన్ బో డైట్ మ్యాజిక్

సహనం వందే, హైదరాబాద్:

బరువు తగ్గడం అనేది ఒక యుద్ధంలా మారిపోయింది. ‘మా ఇంట్లో అందరూ లావే.. నా జన్యువులే ఇంత’ అంటూ చాలామంది ముందే చేతులెత్తేస్తున్నారు. కానీ జన్యువులు మన తలరాతను శాసించలేవని ప్రపంచ ప్రఖ్యాత మేయో క్లినిక్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఆడమ్ పెర్ల్‌మాన్ చెబుతున్నారు. తిండి మానేయడం కాదు… సరైన పద్ధతిలో జీవనశైలిని మార్చుకుంటేనే మెటబాలిజం (జీవక్రియ) పుంజుకుంటుంది. కఠినమైన డైటింగ్ కంటే శరీర అంతర్గత వ్యవస్థను అర్థం చేసుకోవడమే అసలైన రహస్యం.

Adam Perlaman

జన్యువులను జయించవచ్చు…
చాలామందికి ఒక అపోహ ఉంది. తమ స్నేహితులు ఎంత తిన్నా బరువు పెరగరని… తాము మాత్రం నీళ్లు తాగినా లావవుతామని బాధపడుతుంటారు. దీనికి జన్యువులు కొంత కారణమే అయినా అవే అంతిమం కాదు. సరైన అలవాట్లతో ఆ జన్యువుల ప్రభావాన్ని తారుమారు చేయవచ్చు. శరీర తత్వాన్ని బట్టి చేసే చిన్న చిన్న మార్పులు మెటబాలిజం వేగాన్ని పెంచుతాయి. జన్యువుల పేరు చెప్పి బద్ధకంగా ఉండటం కంటే వాటిని సవాలు చేయడమే మేలు.

కండరమే కొవ్వుకు శత్రువు
బరువు తగ్గాలంటే గంటల తరబడి కేవలం నడక లేదా పరుగు మాత్రమే సరిపోదు. శరీరంలో కండరాల శాతం పెంచుకోవడం చాలా ముఖ్యం. కండరాలు ఎంత బలంగా ఉంటే మనం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా శరీరం అంత ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ సహజంగానే కండరాల సాంద్రత తగ్గుతుంది. అందుకే బరువులు ఎత్తే వ్యాయామాలు (స్ట్రెంత్ ట్రైనింగ్) చేయడం వల్ల జీవక్రియ వేగంగా మారుతుంది.

పేగుల్లోనే అసలు కథ
మన జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులు (మైక్రోబయోమ్) మనం ఎంత బరువు ఉండాలో నిర్ణయిస్తాయి. పేగుల్లో ఉండే ‘అకెర్మాన్సియా మ్యూసినిఫిలా’ వంటి మంచి బ్యాక్టీరియా మనం తినే పీచు పదార్థాలను ఆహారంగా తీసుకుని ఆకలిని నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తుంది. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల ఈ బ్యాక్టీరియా చనిపోయి బరువు పెరుగుతాం. పేగులను ఆరోగ్యంగా ఉంచుకుంటే బరువు తగ్గడం నల్లేరుపై నడకే.

రెయిన్ బో డైట్ మ్యాజిక్
ఆరోగ్యం బాగుండాలంటే ప్లేటులో అన్ని రంగుల ఆహారం ఉండాలి. దీనినే ‘రెయిన్ బో డైట్’ అంటారు. అంటే రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. ఇందులో ఉండే విభిన్న రకాల ఫైబర్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఇంధనంగా మారుతుంది. డైటింగ్ పేరుతో తిండి మానేస్తే శరీరం కొరత (స్కేర్సిటీ) మోడ్‌లోకి వెళ్లిపోయి ఉన్న కొవ్వును అస్సలు కరిగించదు. అందుకే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ముఖ్యం.

నిద్రతోనే కొవ్వు కరుగు
నిద్ర సరిగా లేకపోతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా ‘సోషల్ జెట్ లాగ్’ అంటే వారమంతా ఒక సమయానికి, వీకెండ్‌లో మరో సమయానికి నిద్రపోవడం ఆరోగ్యానికి పెద్ద ముప్పు. శని, ఆదివారాలు ఆలస్యంగా పడుకోవడం వల్ల పేగుల్లోని బ్యాక్టీరియా పనితీరు దెబ్బతింటుంది. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్ర ఉంటేనే శరీరం కొవ్వును సమర్థవంతంగా కరిగించగలుగుతుంది.

మెటబాలిజం బూస్టర్లు
బరువు తగ్గడానికి షార్ట్ కట్లు వెతకడం మానేయాలి. గదిని చీకటిగా ఉంచుకుని పడుకోవడం, పడుకునే ముందు గది ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి చిన్న చిట్కాలు నిద్ర నాణ్యతను పెంచుతాయి. ఈ జీవనశైలి మార్పులు పాటిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. మందులు, ఇంజెక్షన్ల కంటే సహజమైన పద్ధతులే శాశ్వత పరిష్కారం చూపిస్తాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *