- నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై చర్యలు
- కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో షాక్
- లక్ష్యానికి దూరంలో ప్రైవేటు సంస్థల పనితీరు
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తుంటే కొన్ని కంపెనీలు మాత్రం మొద్దునిద్ర పోతున్నాయి. క్షేత్రస్థాయిలో సాగు పెంచకుండా కాలయాపన చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నాయి. ఇలాంటి సంస్థల పట్ల ఉదాసీనత పనికిరాదని భావించిన సర్కారు తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. సాగులో పురోగతి చూపని కంపెనీల జోన్లను రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కఠిన చర్యలకు ఉపక్రమించారు.
నిబంధనల ఉల్లంఘనపై కొరడా…
ఆయిల్ పామ్ సాగులో కంపెనీల నిర్లక్ష్యంపై వ్యవసాయశాఖ సీరియస్ అయింది. తెలంగాణ ఆయిల్ పామ్ చట్టం ప్రకారం కంపెనీలు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న 36 నెలల్లోపు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. క్షేత్రస్థాయిలో నర్సరీల అభివృద్ధి, సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కానీ కొన్ని సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేశాయి. ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినప్పటికీ కంపెనీల తీరులో మార్పు రాలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన లోహియా ఎడిబుల్ ఆయిల్స్, మ్యాట్రిక్స్ పామ్ ఆయిల్, కేఎన్ బయోసైన్సెస్ వంటి సంస్థల జోన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఆయిల్ ఫెడ్ కు కేటాయింపు
వైఫల్యం చెందిన ప్రైవేటు కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న ఫ్యాక్టరీ జోన్లను ప్రభుత్వం తెలంగాణ ఆయిల్ ఫెడ్ కు బదలాయించింది. కరీంనగర్ జిల్లాలో లోహియా ఎడిబుల్ ఆయిల్స్ కు 44527 ఎకరాల సాగు లక్ష్యాన్ని ఇస్తే ఆ సంస్థ కేవలం 6721 ఎకరాల్లో మాత్రమే సాగు చేపట్టింది. ఈ దారుణమైన పనితీరును గమనించిన సర్కారు ఆ జిల్లా జోన్ బాధ్యతలను ఆయిల్ ఫెడ్ కు అప్పగించింది. ప్రభుత్వ సంస్థ అయితే రైతులకు నమ్మకం ఉంటుందని భావించి ఈ మార్పు చేశారు. ఇకపై ఈ ప్రాంతాల్లో రైతుల సంక్షేమం, ప్రాసెసింగ్ బాధ్యతలను ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షించనుంది.
లక్ష్యానికి ఆమడ దూరంలో కంపెనీలు
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాట్రిక్స్ పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ తీరు మరీ దారుణంగా ఉంది. అక్కడ 30,552 ఎకరాల విస్తీర్ణం కేటాయిస్తే కేవలం 1606 ఎకరాలకే పరిమితమయ్యారు. అలాగే హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేఎన్ బయోసైన్సెస్ సంస్థకు 14000 ఎకరాల బాధ్యత అప్పగిస్తే ఆ కంపెనీ 2136 ఎకరాలను మాత్రమే సాగులోకి తెచ్చింది. ఇలాంటి సంస్థల వల్ల సాగు విస్తరణ కుంటుపడుతోందని ప్రభుత్వం గుర్తించింది. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం కాగితాలకే పరిమితమైన ఈ జోన్లను తక్షణమే రద్దు చేసి ఆయిల్ ఫెడ్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
రైతు సంక్షేమమే పరమావధి
రైతులకు సమయానికి గెలల కొనుగోలు, స్థిరమైన ధర కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కంపెనీలు మిల్లులు ఏర్పాటు చేయకపోతే రైతులు గెలలు అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే సమర్థవంతమైన సంస్థలకే బాధ్యతలు ఉండాలని సెక్రటరీని మంత్రి ఆదేశించారు. అందుకే సాగు వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని ప్రభుత్వ సంస్థకు అప్పగించే ప్రక్రియ వేగవంతం చేశారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేసే ఏ సంస్థనైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఈ చర్యల ద్వారా గట్టి సంకేతం పంపింది.
గణాంకాల్లో ఆయిల్ పామ్ సాగు
రాష్ట్రంలో మొత్తం 2.82 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 98976 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. సాగు చేస్తున్న 53709 మంది రైతులకు ప్రభుత్వం 297.88 కోట్ల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. వంటనూనెల దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ పథకం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.