డాక్టర్ల డిమాండ్లపై కి’రణ్’ మాదల – వైద్య ఆరోగ్యశాఖ తీరుపై మండిపాటు

Dr.Kiran Madala press Note
  • ఏళ్లు గడుస్తున్నా అందని బకాయిలు
  • సకాలంలో రాని డీఏలతో ఆర్థిక భారం
  • పెన్షన్ క్రెడిట్లలోనూ తప్పని జాప్యం
  • క్లెయిమ్స్ కాగితాలకే పరిమితం

సహనం వందే, హైదరాబాద్:

రాష్ట్రంలో ప్రాణాలు కాపాడే డాక్టర్లు తమ డిమాండ్లపై రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. బకాయిల కోసం విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వైద్యుల గోడును పట్టించుకోని సర్కారు తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అందని ఎరియర్స్
తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాదల తమ న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తారు. యూజీసీ పీఆర్సీ బకాయిలు 2016 నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం 2024లో జీవో ఇచ్చి 36 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పినా అది ఆచరణలో అమలు కావడం లేదు. ఇప్పటివరకు సభ్యులు 21 బిల్లులు సమర్పించినా కేవలం మూడు నాలుగు వాయిదాలు మాత్రమే ఖాతాల్లో పడ్డాయి. మిగిలిన బకాయిల కోసం వైద్యులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

డీఏ బకాయిల సెగ
వైద్యులకు రావాల్సిన కరువు భత్యం (డీఏ) బకాయిలు గగనమయ్యాయని కిరణ్ మాదల పేర్కొన్నారు. 2022 నుంచి నాలుగు విడతలకు సంబంధించిన డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో ఉద్యోగికి సుమారు 2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం బాకీ పడింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ బకాయిలు అందక వైద్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వడంలో జాప్యం చేయడంపై అసోసియేషన్ అసహనం వ్యక్తం చేస్తోంది.

పెన్షన్ క్రెడిట్ల గందరగోళం
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద జమ కావాల్సిన నిధుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని కిరణ్ మాదల గుర్తించారు. చాలా మంది వైద్యుల ఖాతాల్లో కేవలం 70 శాతం మాత్రమే నిధులు జమ అయ్యాయి. ముఖ్యంగా 2024 సంవత్సరానికి సంబంధించి 2020 కంటే ముందు ఉన్న బకాయిలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో క్రెడిట్ కాలేదు. రిటైర్మెంట్ తర్వాత తమ భవిష్యత్తు ఏంటన్న ఆందోళనలో వైద్య నిపుణులు ఉన్నారని కిరణ్ మాదల వివరించారు.

ఆగిన విత్‌డ్రాయల్స్
అత్యవసర అవసరాల కోసం జీపీఎఫ్ లేదా సీపీఎస్ నుంచి నగదు ఉపసంహరణ చేసుకునే వెసులుబాటు ఉన్నా అది కాగితాలకే పరిమితమైందని డాక్టర్ కిరణ్ మాదల ఆరోపించారు. చాలా కాలంగా పార్ట్ విత్‌డ్రాయల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యక్తిగత అవసరాలు, ఆరోగ్య సమస్యల కోసం తమ సొంత డబ్బును తీసుకుందామన్నా ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. వెంటనే ఈ విత్‌డ్రాయల్స్ క్లియర్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.

సంస్కరణలు ఏవీ?
ప్రభుత్వం ప్రతి నెలా 700 కోట్ల రూపాయలు బకాయిల కోసం విడుదల చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వైద్యుల సమస్యలను పరిష్కరించడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి కిరణ్ మాదల నేతృత్వంలో వినతులు పంపినా ఫలితం కనిపించడం లేదు. కేవలం హామీలతోనే కాలం గడుపుతున్నారని వైద్యులు ఆవేదన చెందుతున్నారు.

పెరిగిన పని ఒత్తిడి
ఒకవైపు ఆస్పత్రుల్లో రోగుల రద్దీ పెరుగుతుంటే మరోవైపు సౌకర్యాల లేమి వైద్యులను వేధిస్తోందని అసోసియేషన్ తెలిపింది. రావాల్సిన సొమ్ము సకాలంలో అందక వైద్యులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది నేరుగా రోగులకు అందించే సేవలపై ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్ కిరణ్ మాదల హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఆయన కోరుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *