‘జీరో’లోనే జీవితం – ఓషో బోధనల వెనుక అసలు రహస్యం

OSHO Teachings
  • ‘జీరో’లోనే జీవితం – శూన్యమే నిజమైన జ్ఞానం
  • అహంకారాన్ని వీడితేనే అసలైన ఆనందం
  • పోటీ ప్రపంచంలో యంత్రంలా మారుతున్నాం
  • ఇతరులతో పోల్చుకోవడం వల్లే ఇన్ని కష్టాలు
  • అవగాహనతోనే అజ్ఞానం నుంచి విముక్తి
  • 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు

సహనం వందే, హైదరాబాద్:

నేడు మనిషి పరుగుల ప్రపంచంలో పడి తనను తాను మర్చిపోతున్నాడు. సమాజం నేర్పిన అహంకారం, అసూయల మధ్య నలిగిపోతున్నాడు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు ఓషో బోధనలు మనిషిని మేల్కొలిపేలా ఉన్నాయి. ఓషో దృష్టిలో అసలైన జీవితం అంటే ఏమిటో చూద్దాం.

OSHO guruvu

అహంకారం ఒక ముసుగు…
మనిషి తనలోని లోపాలను దాచుకోవడానికి ధరించే ముసుగే అహంకారమని ఓషో చెప్పారు. పక్షులు, జంతువులకు అహంకారం ఉండదు. ఇది కేవలం మనిషి సృష్టించుకున్న ఒక జబ్బు. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలి… పేరు సంపాదించాలి అని సమాజం నూరిపోయడం వల్లే ఈ అహంకారం పెరుగుతుంది. ఇది ఒక భారమైన శిఖరంలా మారి చివరకు మనల్ని మనమే అణచివేస్తుంది.

పోటీ పడటం ఆపాలి…
మరొకరితో పోల్చుకోవడం వల్లనే అహంకారం పుడుతుంది. మనకంటే ఎవరైనా పైన ఉంటే దుఃఖం, కింద ఉంటే ఆనందం కలగడం సహజమైపోయింది. ఎంత సాధించినా ఎవరో ఒకరు మనకంటే ముందు ఉంటూనే ఉంటారు. సంపదలో కాకపోయినా అందంలోనో… తెలివిలోనో మరొకరు పైచేయి సాధిస్తారు. ఈ నిరంతర పోటీ మనిషిని పిచ్చివాడిని చేస్తుంది. అందుకే ఈ పోటీ ప్రపంచం నుంచి బయటకు రావాలని ఓషో బోధించారు.

శూన్యమే అసలైన జ్ఞానం…
జ్ఞానోదయం అంటే మనలోని అహంకారాన్ని పూర్తిగా తొలగించుకోవడమే. మనం ఏమీ కాదు అని తెలుసుకోవడమే అసలైన శూన్యం. బుద్ధుడు దీనినే నిర్వాణం అని పిలిచాడు. మన లోపలికి మనం ఎంత లోతుగా వెళ్తే అంత ఖాళీగా అనిపిస్తుంది. ఆ శూన్య స్థితిలో అహంకారం మాయమై అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. దీనిని సాధించడానికి ధ్యానం ఒక్కటే సరైన మార్గం.

యంత్రంలా మారిన మనిషి
నేటి కార్పొరేట్ ప్రపంచం మనిషిని ఒక యంత్రంలా మార్చేస్తోంది. కంపెనీలకు కేవలం పనితనం మాత్రమే కావాలి. దీనివల్ల మనిషి తనలోని సృజనాత్మకతను కోల్పోతున్నాడు. ఎప్పుడైతే మనం వీటిని గుర్తిస్తామో అప్పుడు ఈ యాంత్రిక జీవనం నుంచి బయటపడవచ్చు. లేకపోతే సమాజం చెప్పినట్లు ఆడుతూ మనిషి తనను తాను నాశనం చేసుకుంటాడు.

సోషల్ మీడియా మాయాజాలం
మనం చేస్తున్న పనిపై స్పష్టత లేకపోవడం వల్లే సోషల్ మీడియాకు బానిసలవుతున్నాం. మనం ఫోన్లతోనే జీవిస్తున్నాం. కంపెనీలు మన మెదడును హ్యాక్ చేస్తున్నాయి. అనవసరమైన వస్తువులు కొనడం, వాటిని సోషల్ మీడియాలో చూపించి గొప్పలు చెప్పుకోవడం ఒక వ్యసనంగా మారింది. దీనివల్ల ఒకరిపై ఒకరికి అసూయ పెరిగి మనిషి సంతోషానికి దూరం అవుతున్నాడు.

మనం మారితేనే మార్పు
ప్రతి మనిషి తన గురించి తాను తెలుసుకోవాలి. అహంకారం, అసూయలను వదిలేసి మనసుకి నచ్చిన పని చేయాలి. అప్పుడే జీవితంలో ఆనందం లభిస్తుంది. మనిషి తన పట్ల తాను అవగాహన పెంచుకుంటేనే ఈ ప్రపంచం ఒక మంచి ప్రదేశంగా మారుతుంది. 2026 నూతన సంవత్సరంలో ఓషో బోధనలు మానవాళికి ఎంతో అవసరం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *