- బెంగళూరు లేదా హైదరాబాద్ సిటీలపై చూపు
- దేశ రాజధానికి తగినట్టుగా ఈ నగరాలు బెస్ట్
- గ్యాస్ ఛాంబర్లుగా మారిన ఢిల్లీ వీధులు
- గాలిలేని చోట బతకడం ఎలాగన్న విమర్శలు
- సౌత్ తరలివస్తున్న నార్త్ ఇండియన్లు
- ప్రశాంతమైన జీవితం కోసం దక్షిణాదికి వలస
- నాణ్యమైన బతుకు కోసం నగరాల పోరాటం
సహనం వందే, బెంగళూరు:
భారతదేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఒకప్పుడు వైభవం చాటిన దేశ రాజధాని… నేడు భయం, విషపూరిత గాలికి చిరునామాగా మారింది. బెంగళూరులో నివసిస్తున్న ఒక ఢిల్లీ యువతి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాజధానిగా ఢిల్లీ అర్హతను ఆమె ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.

వైరల్ వార్.. రాజకీయ జోరు
ఢిల్లీలో గాలి పీల్చడమే ఒక సాహసంలా మారిపోయింది. ప్రతి ఏటా శీతాకాలం వస్తే చాలు రాజధాని నగరం గ్యాస్ ఛాంబర్‌గా మారుతోంది. బెంగళూరుకు చెందిన సదరు యువతి తన వీడియోలో ఇదే విషయాన్ని ఎండగట్టింది. కాలుష్యం ఒక్కటే కాదు.. మహిళల భద్రత విషయంలో కూడా ఢిల్లీ అట్టడుగున ఉందని ఆమె విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా ఎందుకు కొనసాగించాలని ఆమె అడిగిన ప్రశ్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఈ వీడియో కొన్ని లక్షల మందిని ఆలోచింపజేస్తోంది.
భద్రత లేని చోట బతుకు ఎలా?
ఢిల్లీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భయం. మహిళల భద్రత విషయంలో దేశ రాజధాని రికార్డులు ఏమాత్రం బాగోలేవు. అర్ధరాత్రి పూట ఒంటరిగా తిరగడం దేవుడెరుగు.. పట్టపగలు కూడా బయటకు వెళ్లాలంటే గజగజ వణకాల్సిన పరిస్థితి ఉంది. ఒక పక్క గాలిలో విషం ఉంటే.. మరోపక్క వీధుల్లో నేరస్తుల భయం పొంచి ఉంది. అందుకే చాలామంది ఢిల్లీని వదిలి బెంగళూరు లేదా ఇతర దక్షిణాది నగరాలకు తరలిపోతున్నారు. ఈ వలసలు కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాదు.. ప్రాణాలను కాపాడుకోవడం కోసం కూడా జరుగుతున్నాయి.
రాజధాని మార్పుపై చర్చ
ఇన్నాళ్లూ ఢిల్లీ చుట్టూనే దేశ రాజకీయాలు తిరిగాయి. కానీ ఇప్పుడు ఆ పీఠాన్ని మార్చాలనే డిమాండ్ సోషల్ మీడియాలో జోరందుకుంది. ఇండోనేషియా వంటి దేశాలు కూడా కాలుష్యం కారణంగా తమ రాజధానిని మార్చాలని నిర్ణయించుకున్నాయి. మరి భారత్ లో ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని నగరం అనేది దేశానికి ప్రతిబింబంలా ఉండాలి. కానీ ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కి ఉండటం వల్ల దేశ ప్రతిష్ట మసకబారుతోంది. దక్షిణాది నగరాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
వాయు కాలుష్యం.. మరణాల భయం
ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ తరచుగా 400 మార్కును దాటుతోంది. అంటే ఇక్కడ గాలి పీల్చడం అంటే రోజుకు 10 నుండి 20 సిగరెట్లు తాగడంతో సమానం. ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీ ప్రజలు బలైపోతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు.. అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని మేధావులు మండిపడుతున్నారు. పాలకులు ఏసీ గదుల్లో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరాల మధ్య పోటీ
ఈ వివాదం ఇప్పుడు ఉత్తరాది వర్సెస్ దక్షిణాది నగరాలుగా మారుతోంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, పచ్చదనం విషయంలో దక్షిణాది నగరాలు ముందున్నాయి. అయితే మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని నగరాల్లోనూ సమస్యలు ఉన్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఉంటే ఢిల్లీలో కాలుష్యం ఉంది. కానీ ప్రాణాల మీదకు వచ్చే కాలుష్యం కంటే ట్రాఫిక్ నయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మార్పు కోసం నిరీక్షణ
దేశ రాజధానిగా ఉండాలంటే కేవలం భవనాలు ఉంటే సరిపోదు.. అక్కడ నివసించే ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యం. ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే ఢిల్లీ వైభవం శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని, రక్షణను ఇవ్వలేని నగరం రాజధానిగా కొనసాగడం అనవసరమని యువత భావిస్తోంది. ఈ వైరల్ సామాన్యుల గొంతుకగా మారింది. పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఢిల్లీని కాపాడతారో లేదో వేచి చూడాలి.