- ఫిర్యాదు చేయడానికి బాధితుల ఆందోళన
- కాషాయ దళాల గురి ముస్లింలు, క్రిస్టియన్లే
- పాలకుల అండతో రెచ్చిపోతున్న ఉన్మాదులు
- చట్టాల పేరిట చర్చిలపై పెరిగిన దాడులు
- వ్యవస్థల్లోనూ వేళ్లూనుకున్న మత పక్షపాతం
సహనం వందే, న్యూఢిల్లీ:
భారతదేశం లౌకిక రాజ్యమని రాజ్యాంగం చెబుతున్నా నేడు పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది. అధికారం అండతో పెచ్చరిల్లుతున్న రాజకీయ మతవాదం దేశ ఐక్యతను దెబ్బతీస్తోంది. ముస్లింలను శత్రువులుగా చూపిస్తూ… క్రిస్టియన్లను మత మార్పిడి దొంగలుగా చిత్రీకరిస్తూ సాగుతున్న ఈ హింసాకాండ వెనుక బలమైన రాజకీయ ఎజెండా ఉందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి.
పెరిగిన భయం…
దేశంలో మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ మైనారిటీల కమిషన్ లెక్కల ప్రకారం 2024లో మొత్తం 1390 ఫిర్యాదులు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి 30 శాతం తగ్గినట్టు కనిపిస్తున్నా… ఇది శాంతికి సంకేతం కాదు. పాలకుల అండతో దాడులు జరుగుతుంటే పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యం కూడా మైనారిటీలు చేయడం లేదు. కేసు పెడితే మళ్ళీ తమపైనే దాడులు జరుగుతాయనే భయం వారిని వెంటాడుతోంది. అధికారిక గణాంకాలు వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించడం లేదు.

ముస్లింలే ప్రధాన లక్ష్యం…
హిందూత్వ ఎజెండాలో భాగంగా ముస్లింలను ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. గడిచిన కొద్ది ఏళ్లుగా లవ్ జిహాద్ పేరుతో విద్వేష ప్రచారాలు పెరిగాయి. గోహత్య పేరుతో అభాగ్యులను వీధుల్లో కొట్టి చంపే లించింగ్ సంస్కృతి విస్తరించింది. రాజకీయ లబ్ధి కోసమే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మైనారిటీల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ముస్లింలవే మొదటి స్థానంలో ఉన్నాయి. రెండో స్థానంలో సిక్కులు ఉండటం గమనార్హం. ప్రభుత్వం ఈ దాడులను ఖండించకపోగా పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే విమర్శలు బలంగా ఉన్నాయి.
క్రిస్టియన్లపై కత్తిగట్టిన శక్తులు
సంఖ్యాపరంగా క్రిస్టియన్లు మూడో స్థానంలో ఉన్నా వారిపై హింస మాత్రం అడ్డూఅదుపు లేకుండా పెరిగింది. 2014లో కేవలం 147 గా ఉన్న దాడుల సంఖ్య 2025 నవంబర్ నాటికి ఏకంగా 706కి చేరింది. అంటే గత పదేళ్లలో 5048 దాడులు జరిగాయి. ఫిర్యాదుల శాతం 6.8 మాత్రమే ఉన్నా క్షేత్రస్థాయిలో హింస మాత్రం ఆకాశాన్నంటుతోంది. క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, చర్చిల మీద దాడులు నిత్యకృత్యం అయ్యాయి. రాజకీయ మతవాదులు వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నారు.
నల్ల చట్టాల దుష్ప్రభావం
మత మార్పిడి నిరోధక చట్టాల పేరుతో 12 రాష్ట్రాల్లో మైనారిటీలను వేధిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను ఈ చట్టాలు కాలరాస్తున్నాయి. క్రిస్టియన్ పాస్టర్ల మీద భౌతిక దాడులు చేయడం, వారిని జైలుకు పంపడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. చర్చిలలో ప్రార్థనలు చేసుకుంటున్న వారిని బలవంతంగా బయటకు లాగి కొడుతున్నారు. మత మార్పిడి చేస్తున్నారనే నెపంతో అరాచక శక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఈ హింసను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయి.
వ్యవస్థల్లోనూ పక్షపాత వైఖరి
స్టేటస్ ఆఫ్ పోలిసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025 ఆందోళనకర విషయాలను వెల్లడించింది. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థలోనే మతపరమైన పక్షపాతం పెరిగింది. ముస్లింల కంటే క్రిస్టియన్లకు న్యాయం అందడం కష్టమని పోలీసులు భావిస్తున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీసులు మైనారిటీల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. ఫిర్యాదుదారులనే నిందితులుగా మార్చే పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా మారింది.