భగవద్గీత మత గ్రంథం కాదు – మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Bhagavadgita and Yoga
  • యోగాను మతంతో ముడిపెట్టడం తగదు
  • ఇవి విశ్వవ్యాప్త భారతీయ జీవన సూత్రాలు
  • ఆధ్యాత్మికతను మత కోణంలో చూడొద్దు
  • కేంద్ర హోంశాఖకు ఝలక్ ఇచ్చిన కోర్టు

సహనం వందే, చెన్నై:

భగవద్గీత అంటే కేవలం పూజ గదిలో ఉండే పుస్తకం కాదు. అది మానసిక ఒత్తిడిని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే జీవన సంహిత. యోగా అనేది ఒక వ్యాయామం కాదు… అది ప్రపంచానికి భారత్ అందించిన ఆరోగ్య వరం. మద్రాస్ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు మన సంస్కృతిని, ఆరోగ్యాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించింది. భారతీయ మూలాలను మతంతో ముడిపెట్టి చూడొద్దని కోర్టు స్పష్టం చేసింది.

గీత… ఒక మానసిక చికిత్స
భగవద్గీతను
కేవలం ఒక మతానికే పరిమితం చేయలేమని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అది ఒక నైతిక శాస్త్రం. అది మతాలకు అతీతమైనది. భారతీయ నాగరికతలో భాగమని జస్టిస్ జీఆర్ స్వామినాథన్ స్పష్టం చేశారు. మనిషి ఎదుర్కొనే అనేక మానసిక సమస్యలకు గీతలో పరిష్కారాలు ఉన్నాయి. దీనిని బోధించడం వల్ల ఏ సంస్థకూ మతపరమైన ముద్ర వేయలేం. విదేశీ నిధుల నియంత్రణ చట్టం కింద కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది.

యోగా.. విశ్వవ్యాప్త ఆరోగ్య సూత్రం
యోగాను మతపరమైన కోణంలో చూడటం అమానుషమని కోర్టు అభివర్ణించింది. యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యం కోసం చేసే సాధన. ఇది విశ్వవ్యాప్తమైనది. ఒక మతానికో, వర్గానికో సంబంధించింది కాదు. హఠయోగం వంటి పురాతన విద్యలను నేర్పడం నేరం కాదు. వీటిని నేర్పే సంస్థలను మత సంస్థలుగా పిలవడం ఏంటని కోర్టు నిలదీసింది. వేదాంతం మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన తత్వశాస్త్రమని కొనియాడింది.

కేంద్ర హోంశాఖకు గట్టి షాక్…
కోయంబత్తూరుకు చెందిన అర్ష విద్యా పరంపర ట్రస్ట్ విదేశీ నిధుల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఆ సంస్థ యోగా, వేదాంతం బోధిస్తోందని, అది మతపరమైన సంస్థ అని కేంద్ర హోంశాఖ దరఖాస్తును తిరస్కరించింది. ఈ నిర్ణయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం అనుమానంతో దరఖాస్తులను ఆపడం సరికాదని తేల్చి చెప్పింది. 9 లక్షల రూపాయల విరాళం విషయంలో ట్రస్ట్ ఇప్పటికే జరిమానా కట్టిందని గుర్తు చేసింది. అదే కారణంతో నిధులు ఆపడం సమంజసం కాదని ఆదేశించింది.

ఆధ్యాత్మికత వేరు… మతం వేరు
ఆధ్యాత్మికతను, మతాన్ని ఒకే గాటన కట్టవద్దని కోర్టు హితవు పలికింది. భారతీయ మూలాలను కాపాడుకునే ప్రయత్నం మత ప్రచారం ఎలా అవుతుందని ప్రశ్నించింది. 2021లో చేసుకున్న దరఖాస్తుపై 2024 అక్టోబర్‌లో చర్యలు తీసుకోవడం ఏంటని నిలదీసింది. పారదర్శకమైన పాలన సుపరిపాలనకు ప్రాథమిక సూత్రమని గుర్తు చేసింది. తక్షణమే ఈ దరఖాస్తును పరిశీలించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సంస్కృత విద్య, యోగా ప్రచారం చేసే వారికి ఈ తీర్పు ఊరటనిచ్చింది.

ఆరోగ్య భారతావనికి కోర్టు మద్దతు
మన ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్ పనులను కోర్టు ప్రశంసించింది. సంప్రదాయ విద్యను కాపాడుకోవడం జాతి గౌరవమని పేర్కొంది. భౌతిక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా, వేదాంతం ఎంతో అవసరమని అభిప్రాయపడింది. మతపరమైన అడ్డంకులు సృష్టించి ఈ ఆరోగ్య విద్యను అడ్డుకోవద్దని పరోక్షంగా హెచ్చరించింది. ఈ తీర్పు కేవలం ఒక ట్రస్ట్ విజయమే కాదు… భారతీయ విజ్ఞానానికి దక్కిన గౌరవంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *