శివాజీకి చెంపచెళ్లు – బూతు పురాణంపై మహిళ కమిషన్ కొరడా

Shivaji Comments on Women Dressing
  • నటుడికి నోటీసులు… 27న విచారణ
  • తమ ముందు హాజరు కావాలని ఆదేశం
  • గతంలో బిగ్ బాస్ షోలోనూ వెకిలి చేష్టలు
  • వాళ్ల వస్త్రధారణపై ఈయనకెందుకు ఆరాటం
  • హీరోయిన్ల డ్రెస్సింగ్ దర్శకుడు చేతుల్లోనే కదా
  • వాళ్లను కామెంట్ చేయలేక వీళ్ళపై ప్రతాపం
  • అగ్గిమీద గుగ్గిలమైన యాంకర్ అనసూయ

సహనం వందే, హైదరాబాద్:

ఒకప్పుడు సినీ నటుడిగా వెలిగి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం తహతహలాడుతున్న శివాజీకి ఊహించని దెబ్బ తగిలింది. సినిమా ఫంక్షన్లలో తన మార్కు మేధావి మాటలు చెప్పబోయి అడ్డంగా బుక్కయ్యారు. సంస్కారం గురించి నీతులు చెబుతూనే మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రచ్చ లేపుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుండటంతో శివాజీ ఇరకాటంలో పడ్డారు.

ధండోరా ఈవెంట్లో నోటి దురద…
శివాజీ ప్రధాన పాత్రలో వస్తున్న ధండోరా సినిమా వేడుక వేదికగా వివాదం మొదలైంది. అక్కడ సినిమా గురించి మాట్లాడటం మానేసి హీరోయిన్ల దుస్తులపై శివాజీ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఈ స్వయం ప్రకటిత మేధావి డిసైడ్ చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. స్త్రీ అంటే ప్రకృతి అని చెబుతూనే అత్యంత అసభ్య పదజాలంతో దూషించడం ఆయన ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. ఈ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.

బుద్ధ భవన్ కు రావాల్సిందే
మహిళా కమిషన్ చట్టం 1998 ప్రకారం సెక్షన్ 16(1)(బి) కింద శివాజీపై కేసు నమోదైంది. ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు బుద్ధ భవన్ లోని కమిషన్ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. తానేం మాట్లాడారో… ఎందుకు మాట్లాడారో అక్కడ వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. విచారణ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ స్టేషన్ కు కూడా సమాచారం అందించారు. కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని… చట్టప్రకారం విచారణ ఎదుర్కోవాలని కమిషన్ స్పష్టం చేస్తోంది.

బిగ్ బాస్ లోనూ చిల్లరితనం…
మహిళలపై ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం శివాజీకి కొత్తేమీ కాదు. బిగ్ బాస్ 7 సీజన్ లో కూడా తోటి కంటెస్టెంట్లతో ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా ఉండేది. శోభ, రతిక, ప్రియాంక వంటి వారిని టార్గెట్ చేస్తూ అప్పట్లో నోరు పారేసుకున్నారు. తన మాట వినకపోతే పగులుతాయంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడిన చరిత్ర ఆయనది. ఎదుటివారు తప్పు పడితే నీకంత సీన్ లేదమ్మా అంటూ హేళన చేయడం ఆయనకు అలవాటుగా మారింది. అప్పట్లోనే ప్రేక్షకుల నుంచి ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా హీరోయిన్ల డ్రెస్ ఎలా ఉండాలనేది దర్శకులు మాత్రమే నిర్ణయిస్తారు. నటిమణులు దర్శకులు చెప్పినట్లు మాత్రమే చేస్తారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం శివాజీకి లేదా? డైరెక్టర్లను కామెంట్ చేసే దమ్ము లేక తారల మీద నోటి దురుసు ప్రదర్శించాడు.

గరుడ పురాణం అంటూ పిచ్చికూతలు…
సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న శివాజీకి మీడియాలో తన పేరు వినిపించాలనే పిచ్చి ఎక్కువే. అందుకే సందర్భం ఉన్నా లేకున్నా వివాదాస్పద అంశాల్లో వేలు పెడుతుంటారు. గతంలో గరుడ పురాణం అంటూ ఒక కట్టుకథను అల్లి రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూశారు. కానీ జనం ఆయన్ని నమ్మలేదు. ఇప్పుడు మళ్లీ నటుడిగా గుర్తింపు పొందాలని తాపత్రయపడుతున్నారు. సినిమా ప్రమోషన్ కోసం మహిళల మనోభావాలను దెబ్బతీయడం దిగజారుడు తనమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అనసూయ ఫైర్
శివాజీ వ్యాఖ్యలపై పాపులర్ యాంకర్ అనసూయ తీవ్రంగా స్పందించారు. ఎవరు ఏ బట్టలు వేసుకోవాలో చెప్పడానికి శివాజీ ఎవరని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో శివాజీ ఇన్ సెక్యూరిటీతో బాధపడుతున్నారని ఎద్దేవా చేసింది. మనకు నచ్చిన ఆహారం తింటాం… మనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాం అని కుండబద్ధలు కొట్టారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. శివాజీ లాంటి వారు సంస్కారం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. డిసెంబర్ 27న శివాజీ ఇచ్చే వివరణపై మహిళా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *