- బాపట్లలో భీభత్సం! భర్త కిరాతకత్వం!
- విభేదాల మాటున మర్డర్ ప్లాన్
సహనం వందే, బాపట్ల:
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపిన ఓ హంతకుడు చేసిన పని ఉలికిపాటుకు గురిచేసింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి హతమార్చిన భర్త వెంకటేశ్వర్లు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆ మృతదేహాన్ని తన బైకుపై పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ దృశ్యం చూసి పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక మనిషి ఇంత దారుణంగా వ్యవహరించడం సమాజంలో పెరిగిపోతున్న దిగజారుడుతనాన్ని కళ్లకు కడుతోంది.
విభేదాల మాటున కిరాతక ప్లాన్
బాపట్ల జిల్లా ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లాలోని యువతి మహాలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి, గొడవలు పెరిగాయి. దీంతో మహాలక్ష్మి తన తల్లిదండ్రుల ఇంట్లో వేరుగా ఉంటోంది. ఈ కుటుంబ కలహాల మాటునే భర్త వెంకటేశ్వర్లు కిరాతకమైన ప్రణాళిక రచించడం దారుణం. క్షణికావేశంలో చేసిన హత్యలా కాకుండా, ముందుగా ప్లాన్ చేసుకుని భార్యను హత్య చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
బంగారం ఆశ.. ప్రాణాలు బలి
వెంకటేశ్వర్లు భార్యను చంపడానికి ఎంచుకున్న మార్గం అత్యంత మోసపూరితమైనదిగా తేలింది. ఆదివారం ఉదయం అతను మాచవరం వెళ్లి, భార్యకు బంగారం ఇస్తానని నమ్మబలికాడు. తన భర్త మాటలు నమ్మిన మహాలక్ష్మి అతనితో కలిసి వచ్చింది. గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లిన వెంకటేశ్వర్లు, అక్కడ ఒక్కసారిగా గొంతు నులిమి హత్య చేశాడు. భార్య నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకొని, బంగారం ఆశ చూపించి మృత్యువు దగ్గరకు తీసుకెళ్లడం ఎంతటి కిరాతక చర్య. కుటుంబ గొడవలు పరిష్కరించుకోలేని వారు ఇలాంటి దారుణ హత్యలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఘాతుకుడిపై చట్టం పంజా
హత్య తర్వాత మృతదేహంతో బైకుపై స్టేషన్‌కు వచ్చిన వెంకటేశ్వర్లును సంతమాగులూరు పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. ఈ హత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి గతంలో వారి మధ్య ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయేమో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇలాంటి ధారుణానికి పాల్పడిన ఘాతుకుడిపై చట్టం పంజా విసిరి ఇద్దరు చిన్న పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తల్లిని కోల్పోయి, తండ్రి జైలుకు వెళ్లిన ఆ చిన్నారుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.