- ఒక డాలర్ విలువ 89.48 రూపాయలు
- త్వరలో 100 రూపాయలకు చేరే ప్రమాదం
- అడ్డుకునేందుకు లక్షల కోట్లు బూడిదపాలు
- రిజర్వ్ బ్యాంక్ నిర్వాకంతో చిన్నాభిన్నం
- దేశంలోకి అడ్డగోలుగా దిగుమతులే కారణం
- వెనక్కు పారిపోతున్న విదేశీ పెట్టుబడులు
- భారత్ స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు వెనక్కి
- ఉచిత పథకాలతో ఆర్థిక క్రమశిక్షణ బలి
- సామాన్యుడికి కత్తెర… ఆర్థిక సంక్షోభమేనా?
సహనం వందే, ముంబై:
దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి రూపాయి విలువ రోజురోజుకూ పాతాళానికి పడిపోతోంది. ఒక్క అమెరికన్ డాలర్ విలువ ఏకంగా రూ. 89.48 దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు… దేశ ఆర్థిక శక్తికి అద్దం పట్టే చేదు నిజం. రూ. 90 అనే ముఖ్యమైన మార్క్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడూ మార్కెట్లోకి డాలర్లు అమ్మి రూపాయిని పైకి లేపే ప్రయత్నం చేసినా రెండు మూడు రోజులు కూడా నిలబడడం లేదు. మళ్లీ పాత స్థానానికి చేరుకుని పడిపోతోంది.

లక్షల కోట్ల రూపాయలు బూడిదపాలు!
రూపాయి పతనమవుతున్న ప్రతిసారీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యూహం పూర్తిగా విఫలమైంది. గత రెండేళ్లలో రూపాయి విలువ కాపాడేందుకు ఆర్బీఐ ఏకంగా రూ. 7.5 లక్షల కోట్లకు పైగా మార్కెట్లో ఖర్చు చేసింది. ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసినా రూ.76 నుంచి రూ. 89కి మరింత దిగజారిపోయింది. ఇంత డబ్బు వృథా అయినా ఫలితం సున్నా. దీనిని బట్టి చూస్తే రూపాయి పతనాన్ని అడ్డుకోవడంలో ఆర్బీఐ చేతులెత్తేసిందని అర్థమవుతుంది
దేశంలోకి అడ్డగోలుగా దిగుమతులు…
దేశంలో దిగుమతులు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోవడం రూపాయిపై ఒత్తిడిని మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో కార్లు, బైక్‌ల విక్రయాలు పెరిగాయి. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్ వంటి వాటి దిగుమతి ఆకాశాన్నంటింది. దాంతో పాటు బంగారం దిగుమతి కూడా రికార్డు స్థాయికి చేరింది. దీని ఫలితంగా దేశ వాణిజ్య లోటు ఈ ఏడాది భారీగా పెరిగింది. దేశం నుంచి డాలర్లు బయటికి పోతున్నాయి కానీ లోపలికి మాత్రం రావడం లేదు. దిగుమతులపై ఆధారపడటం తగ్గించకుండా ఏం చేసినా ప్రయోజనం సున్నా.
విదేశీ పెట్టుబడులు ఔట్…
రూపాయి బలహీనతకు మరో ప్రధాన కారణం విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు భారత్ స్టాక్ మార్కెట్ నుంచి డబ్బును వెనక్కి తీసుకుని అమెరికా మార్కెట్‌లోకి తరలిస్తున్నారు. భారత్ ఆర్థిక వృద్ధి మందగిస్తోందన్న భయం కూడా వారికి తోడైంది. గత రెండు నెలల్లోనే ఏకంగా 20 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ పెట్టుబడులు (ఎఫ్ఐఐ) బయటికి పోయాయి. ఇది రూపాయిని మరింత బక్కచిక్కెలా చేసింది. డాలర్లు విపరీతంగా దేశం దాటి వెళ్లడం రూపాయి విలువను క్షీణింపజేస్తోంది. దేశం నుంచి డాలర్లు ఈ స్థాయిలో బయటకు పోవడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కానీ, ఆర్బీఐ కానీ సరైన చర్యలు తీసుకోలేకపోతున్నాయి.
ఉచితాలతో ఆర్థిక క్రమశిక్షణ బలి!
రూపాయి పతనానికి వెనుక ఉన్న అతిపెద్ద కారణం ప్రభుత్వ రాజకీయ నిర్ణయాలే అని ఆర్థిక విశ్లేషకులు వేలెత్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించడానికి ప్రభుత్వం ఉచితాలు, పథకాలు పేరుతో ఖర్చులను భారీగా పెంచింది. ఉచిత రేషన్, ఉచిత బస్సు, ఉచిత కరెంటు వంటి పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా రాష్ట్రాల అప్పులపై పెను భారాన్ని మోపాయి. దీనితో ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతింది.
ఒక డాలరు 100 రూపాయలకు చేరేనా?
1991లో లైసెన్స్ రాజ్ కారణంగా ఒక డాలర్ కు 25 రూపాయలు దాటింది. 2013లో భారీ ఖర్చులు, అవినీతి కారణంగా రూ. 68 దాటింది. ఇప్పుడు మళ్లీ అదే తప్పిదాలు. రూపాయి ఒక్కసారి రూ. 90 మార్కు దాటితే ఆ పతనాన్ని ఆపడం దాదాపు అసాధ్యం అవుతుంది. ఇప్పుడు రూ. 100 దాటడానికి కూడా ఎక్కువ కాలం పట్టదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
సామాన్యుడికి కత్తెర… ఆర్థిక సంక్షోభమేనా?
రూపాయి విలువ పడిపోవడం అంటే సామాన్యుడి జేబుకు కత్తెర పడినట్లే. దేశం దిగుమతి చేసుకునే ప్రతీ వస్తువు ధర ఆకాశాన్ని అంటుతుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి కూరగాయలు, నూనె, బంగారం వంటి నిత్యావసరాల ధరలన్నీ భగ్గుమంటాయి. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఆర్బీఐ నిస్సహాయత చూస్తే దేశం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం దిశగా వేగంగా పయనిస్తోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.