తల్లి పాలలో విషపు జాడలు – ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధనలో దారుణ నిజాలు

Uranium in Mothers' Milk in Bihar
  • బీహార్ తల్లిపాలలో యురేనియం జాడలు
  • అమృతమే విషం.. బిడ్డల ఆరోగ్యం ఆగమాగం
  • 70 శాతం మంది శిశువులకు ముప్పు!
  • కాలుష్య భూగర్భ జలాల వల్లే ఈ పరిస్థితి

సహనం వందే, బీహార్:

పిల్లలకు అమృతం వంటి తల్లి పాలే ఇప్పుడు విషంగా మారిపోయాయి. పసికందుల నోటిలోకి పాలు కాదు… నిశ్శబ్దంగా యురేనియం వంటి ప్రాణాంతక విషాన్ని చేరుస్తున్న అత్యంత భయంకరమైన నిజాన్ని ఒక కొత్త అధ్యయనం బట్టబయలు చేసింది. బీహార్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుంచి సేకరించిన తల్లి పాలలో యూరేనియం జాడలు కనిపించడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిందో… పౌరుల ప్రాథమిక ఆరోగ్య భద్రతకు ఎంత ముప్పు పొంచి ఉందో తెలియజేస్తోంది. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని, కలుషితం లేని వాతావరణాన్ని అందించడంలో పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆ అధ్యయనం తేటతెల్లం చేసింది.

70 శాతం మంది శిశువులకు ముప్పు!
పాట్నాలోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్, ఎయిమ్స్ న్యూఢిల్లీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధన దిగ్బ్రాంతి కలిగించింది. భోజ్‌పూర్, సమస్తిపూర్, నలందా వంటి ఆరు జిల్లాలకు చెందిన 40 మంది తల్లుల నుంచి పాలు సేకరించి విశ్లేషించగా అందరి నమూనాలలో యూరేనియం జాడలు నిర్ధారణ అయ్యాయి. కతిహార్, ఖగారియా జిల్లాల్లో అయితే లీటరుకు 5.25 మైక్రోగ్రాముల వరకు కాలుష్యం నమోదైంది. ఈ లెక్కల ప్రకారం ఈ ప్రాంతాల్లోని 70 శాతం మంది పాలిచ్చే శిశువులకు దీర్ఘకాలికంగా క్యాన్సర్ కాని ఇతర అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తమ నివేదికలో స్పష్టం చేశారు. తక్షణమే ఈ అంశాన్ని యుద్ధ ప్రాతిపదికన పరిగణలోకి తీసుకోకపోతే భవిష్యత్తు తరాలు తీవ్ర అనారోగ్య సమస్యలతో పుట్టే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీటిని నిర్లక్ష్యం చేసిన ఫలితం!
యురేనియం అనేది భారీ లోహం. ఇది రేడియోధార్మికతతో పాటు దాని రసాయన విషపూరిత లక్షణాల వల్ల శరీరానికి తీవ్ర హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పసిబిడ్డలలో ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలికంగా కాలుష్యం కొనసాగితే నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, బుద్ధిమాంద్యం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని ఎయిమ్స్ డాక్టర్ అశోక్ శర్మ హెచ్చరించారు. తల్లి పాలలోయురేనియం ప్రవేశించడానికి ప్రధాన కారణం కాలుష్యమైన భూగర్భ జలాలే అని శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రజలు తాగుతున్న నీటిని, పంటలకు వాడుతున్న నీటిని శుభ్రం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమే కారణమని తేలింది. ఇంతకుముందు పాట్నా, వైశాలి వంటి 11 జిల్లాల్లో భూగర్భ జలాలలో యురేనియం జాడలు ఉన్నట్టు తేలింది.

పాలు ఇవ్వడం ఆపమాకండి…
పరిశోధన ఫలితాలపై భయాందోళనలు నెలకొంటున్నప్పటికీ… డాక్టర్లు సూచించే వరకు పసిబిడ్డలకు తల్లిపాలు ఇవ్వడం ఆపకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విస్తృత స్థాయిలో తల్లిపాలు, తాగునీరు, పంటల్లో యురేనియం పర్యవేక్షణ చేపట్టాలి. ముఖ్యంగా కలుషితమైన భూగర్భ జలాలకు బదులుగా ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడానికి, మెరుగైన వడపోత (ఫిల్ట్రేషన్) వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి, ప్రత్యామ్నాయ సాగునీటి పద్ధతులను ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *