49,000 కోట్ల భారీ స్కామ్‌ – పెరల్ ఆగ్రో టెక్ మోసం

  • 5 కోట్ల మంది నుంచి పెట్టుబడుల సేకరణ
  • ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కూడా బాధితులే
  • మాజీ డైరెక్టర్‌ గుర్నామ్ సింగ్‌ అరెస్టు

సహనం వందే, లక్నో: దేశంలో అత్యంత పెద్ద కుంభకోణాల్లో ఇదొకటి.‌ పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఏసీఎల్‌) సంస్థ ఏకంగా రూ. 49 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడటంతో దేశం యావత్తూ నిర్ఘాంత పోయింది. మధ్యతరగతి ప్రజలను, అనేకమంది చిన్నచిన్న పెట్టుబడిదారులను మోసం చేయడంతో ఆయా వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజల నుంచి, చిన్నచిన్న పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో శుక్రవారం పెరల్ ఆగ్రో టెక్ మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణం ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌తో సహా మొత్తం పది రాష్ట్రాలనూ ఉలిక్కిపడేలా చేసింది.

గుర్నామ్ సింగ్‌, మాజీ డైరెక్టర్

బాండ్ రసీదులతోనే సేకరణ…
ఆ సంస్థ ఆర్‌బీఐ వద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా నమోదు చేసుకోకుండానే బాండ్ రసీదులు జారీ చేసి ప్రజల నుంచి రూ. 49,000 కోట్లకు పైగా సేకరించింది. ఈ సంస్థ హామీ ఇచ్చినట్లుగా పెట్టుబడిదారులకు భూమిని కేటాయించడంలో లేదా వారి డబ్బును తిరిగి ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) 2018లోనే పెరల్ ఆగ్రో టెక్ సంస్థపై, దాని చీఫ్ నిర్మల్ సింగ్ భంగూపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. గుర్నామ్ సింగ్ అరెస్టుతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

దేశాన్ని ఊపేసిన ఆర్థిక మోసాలు…
ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన ఆర్థిక మోసాలు సామాన్య ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శారదా గ్రూప్ చిట్‌ఫండ్ స్కామ్ ద్వారా లక్షలాది మంది చిన్న పెట్టుబడిదారులు తమ పొదుపు మొత్తాన్ని కోల్పోయారు. అలాగే 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో జరిగిన కుంభకోణంలో ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీ సుమారు రూ. 13,000 కోట్లు మోసపూరితమైన లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఓయూ) ద్వారా కొల్లగొట్టాడు. ఈ మోసం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసింది. మరోవైపు రాజకీయ పార్టీల నిధుల సేకరణ కోసం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో నిధుల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తాయి. ఇటీవల హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆధారంగా ఆదానీ గ్రూప్‌పై షేర్ల మార్కెట్ మానిప్యులేషన్ ఆరోపణలు రావడంతో భారత ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అలజడి రేగింది.

శాస్త్ర పరిజ్ఞానంతో టెక్ మోసాలు…
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మోసాలు కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరుగుతున్న క్యూఆర్ కోడ్ స్కామ్‌లు, ఫిషింగ్ లింక్‌లు, నకిలీ యాప్‌ల వల్ల రూ. వేల కోట్ల మోసాలు జరుగుతున్నాయి. దీనికితోడు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే వ్యక్తుల ఫొటోలు, వివరాలను సేకరించి డీప్‌ఫేక్ సాంకేతికతతో నకిలీ వీడియోలు, ఆడియోలు సృష్టించి వారి బంధువుల నుంచి డబ్బు అడిగే మోసాలు కూడా ఇప్పుడు పెరిగాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *