- జంతువుల నుంచే 60 శాతం కొత్త వ్యాధులు
- ప్రాణాలను హరిస్తున్న జూనోటిక్ వ్యాధులు
- ప్రపంచ ఆరోగ్యానికి పెనుముప్పుగా జంతువు
- అడ్డుకట్టకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు
- ఏకతాటిపై ఆరు అంతర్జాతీయ సంస్థలు
సహనం వందే, హైదరాబాద్:
మనం ప్రేమగా పెంచుకునే కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ప్రేమగా దగ్గరకు తీసుకునే ఈ జీవుల నుంచి ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మన చుట్టూ ఉన్న జంతువులే రోగాలను మోసుకొచ్చే వాహకాలుగా మారుతున్నాయి. ప్రకృతిని కాపాడుకోకపోతే మానవాళి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ ఆరోగ్య సంక్షోభం వెనుక ఉన్న భయంకర నిజాలివే.
నిశ్శబ్దంగా విస్తరిస్తున్న మహమ్మారి
మనుషులకు సోకే ఇన్ఫెక్షన్లలో 60 శాతం జంతువుల నుంచే వస్తున్నాయి. మనం రోజూ చూసే జంతువుల నుంచే కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. కొత్తగా వచ్చే వ్యాధులలో 75 శాతం అడవి లేదా పెంపుడు జంతువుల ద్వారానే విస్తరిస్తున్నాయి. జంతువులతో మనకు ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఒక పెద్ద ముప్పుగా మారింది. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు, ప్రపంచవ్యాప్త గండం.

ప్రాణాలు తీస్తున్న జంతు జబ్బులు…
ఏవియన్ ఇన్ఫ్లుఎంజా, రేబీస్ వంటి వ్యాధులు నిత్యం భయపెడుతున్నాయి. పశువుల నుంచి సోకే హైడాటిడోసిస్ లేదా ఎచినోకోకోసిస్ వంటి జబ్బులు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. జంతువుల ద్వారా శరీరంలోకి చేరుతున్న బ్యాక్టీరియా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌ను కలిగిస్తోంది. దీనివల్ల ఏటా 12.7 లక్షల మంది నేరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఇన్ఫెక్షన్లతో పరోక్షంగా చనిపోతున్న వారి సంఖ్య 50 లక్షలకు చేరుకుంటోంది.
కలుషిత ఆహారంతో పెరిగిన ప్రమాదం
మనం తీసుకునే ఆహారం కూడా మృత్యుపాశంగా మారుతోంది. కలుషిత ఆహారం వల్ల ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది చనిపోతున్నారు. కేవలం అమెరికా ఖండాల్లోనే 78 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జంతువుల ఆరోగ్యానికీ, మన ఆరోగ్యానికీ మధ్య ఉన్న విడదీయలేని బంధాన్ని మనం విస్మరిస్తున్నాం. దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య ప్రమాదం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.
ఏకతాటిపై అంతర్జాతీయ కూటమి
ఈ ముప్పును గుర్తించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఎఫ్ఏఓ, డబ్ల్యూఓఏహెచ్, పీఏహెచ్ఓ, యూఎన్ఈపీ వంటి అంతర్జాతీయ సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. క్వాడ్రిపార్టైట్ అలయన్స్ పేరుతో ఈ సంస్థలు జాయింట్ డిక్లరేషన్‌పై సంతకాలు చేశాయి. జంతువులు, మనుషులు, పర్యావరణం, మొక్కల ఆరోగ్యం ముడిపడి ఉన్నాయని గుర్తించాయి. ఐఐసీఏ, ఓఐఆర్ఎస్ఏ వంటి సంస్థలు కూడా ఈ ఉమ్మడి పోరాటంలో భాగస్వాములయ్యాయి.
అమలులో ఒకే ఆరోగ్యం విధానం
పీఏహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ జార్బాస్ బార్బోసా ఈ విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. 5 ఏళ్లుగా ఈ ఒకే ఆరోగ్యం విధానాన్ని వారు అమలు చేస్తున్నారు. పాన్-అమెరికన్ సెంటర్ ఫర్ వెటర్నరీ పబ్లిక్ హెల్త్ ద్వారా వ్యాధులను పర్యవేక్షిస్తున్నారు. పౌల్ట్రీలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా, న్యూ వరల్డ్ స్క్రూవర్మ్ సమస్యల పరిష్కారంలో ఈ వ్యూహం అద్భుతంగా పనిచేస్తోందని ఎఫ్ఏఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ రెనె ఒరెల్లానా హాల్కైయర్ స్పష్టం చేశారు.
నిధుల కరువుతో పటిష్టతకు అడ్డంకులు
జంతు ఆరోగ్య వ్యవస్థలే వ్యాధి నిరోధకతలో మొదటి వరుసలో ఉంటాయి. కానీ డాక్టర్ ఫ్రాన్సిస్కో డి అలెసియో ఆవేదన ప్రకారం ఈ వ్యవస్థలకు నిధుల కొరత తీవ్రంగా ఉంది. ప్రజారోగ్య ప్రణాళికల్లో జంతు ఆరోగ్యాన్ని కూడా కలిపి నిధులు కేటాయించాలని ఆయన కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణే ఆరోగ్య భద్రతకు పునాది అని యూఎన్ఈపీ డైరెక్టర్ జువాన్ బెల్లో అంటున్నారు.