లేని రోగం పుట్టిస్తున్న ఏఐ – చిన్నపాటి లక్షణాలూ పెద్దవ్యాధులు

AI Vs Diseases
  • టెక్నాలజీతో పెరుగుతున్న భయం
  • ఏఐతో తప్పుదారి పట్టే రోగులు
  • అనవసరమైన చికిత్సల వెనుక ఆవేదన
  • డిజిటల్ ప్రపంచంలో ఆరోగ్య గందరగోళం

సహనం వందే, హైదరాబాద్:

డిజిటల్ ప్రపంచంలో ఆరోగ్య సమాచారం అరచేతిలోకి వచ్చింది. అయితే చిన్నపాటి లక్షణాలను కూడా సెర్చ్ చేసి రోగాలను అంటించుకుంటున్నాం. ఏఐ ఇస్తున్న తప్పుడు సంకేతాలు ప్రజలను మానసిక ఉచ్చులోకి నెడుతున్నాయి. వైద్యుల భరోసాను మించి టెక్నాలజీ భయాన్ని నమ్ముతున్న ఆధునిక మనిషికి ఇదే పెద్ద ప్రమాదం. రోగం లేకున్నా ఉన్నట్లు భ్రమపడుతున్న ఈ కొత్త అస్వస్థతపై లోతైన విశ్లేషణ ఇది.

చిన్న కణితి ఎముక క్యాన్సర్…
41 ఏళ్ల రిటోబన్ సేన్ బ్యాంక్ ఉద్యోగి. ఆయన అహ్మదాబాద్‌లో ఐఐఎం చదివారు. రిటోబన్ ఏడు నెలల క్రితం తన శరీరంలో ఒక చిన్న కణితిని గుర్తించారు. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉంది. ఈ భయం ఆయనను వదలలేదు. ఏఐ చాట్ జీపీటీని ఆశ్రయించారు. అందులో లక్షణాలు నమోదు చేశారు. అది ఎముకల క్యాన్సర్ అని తేల్చేసింది. ఆ మాట ఆయన ప్రాణాలను తోడేసింది.

అపనమ్మకపు ప్రయాణం
ముంబైలో ముగ్గురు క్యాన్సర్ నిపుణులను ఆయన సంప్రదించారు. అది వాపు మాత్రమేనని వైద్యులు చెప్పారు. బయాప్సీ అవసరం లేదని తేల్చి చెప్పారు. కానీ రిటోబన్ మనసు వినలేదు. వైద్యుల మాటల కంటే ఏఐ మాటలే ఆయనకు నిజమనిపించాయి. విమానంలో న్యూయార్క్ సిటీ దాకా వెళ్లారు. అక్కడ కూడా అదే ఫలితం వచ్చింది. వైద్య శాస్త్రం కంటే ఏఐ భయమే ఆయనను శాసించింది.

సైబర్‌కాండ్రియా పుట్టుక
ఒకప్పుడు స్వల్ప లక్షణాలకు పెద్ద జబ్బు ఉందని భ్రమపడేవారు ఉండేవారు. దీన్ని హైపోకాండ్రియా అనేవారు. ఇప్పుడు దానికి చాట్ జీపీటీ తోడైంది. ఫలితంగా వీరు సైబర్‌కాండ్రియా బాధితులుగా మారారు. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం లక్షణాలను సరిచూసుకోవడం వీరి నిత్యకృత్యం. అసలు జబ్బు కంటే భయమే వీరిని ఎక్కువగా వేధిస్తోంది. మానసిక ప్రశాంతతను మంటగలుపుతోంది.

ప్రమాదకరమైన స్వయం నిర్ధారణ
ఏఐతో ప్రజలు సొంతంగానే రోగాలను నిర్ధారించుకుంటున్నారు. చికిత్స ఆలస్యం అవుతోంది. అనవసరమైన మందులను వాడుతున్నారు. దీనివల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆందోళన తగ్గాల్సింది పోయి రెట్టింపు అవుతోంది. సొంత వైద్యం ప్రాణాల మీదకు తెస్తోంది. క్లినికల్ డయాగ్నోసిస్ పక్కదారి పడుతోంది.

వైద్య రంగంపై టెక్ భారం
వైద్యులు చూపే సాధారణ పరీక్షలను ప్రజలు నమ్మడం లేదు. రిటోబన్ లాంటి వారు సందేహాలతోనే బతుకుతున్నారు. వైద్యం కంటే ఏఐ ఇచ్చే ఫలితాలకే విలువ ఇస్తున్నారు. ఇది డాక్టర్లకు పెద్ద సవాలుగా మారుతోంది. నిపుణులు ఎంత చెప్పినా ప్రజలు తమ సెల్ఫ్ డయాగ్నోసిస్‌నే గట్టిగా నమ్ముతున్నారు. ఈ ధోరణి వైద్య వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతోంది.

ఆరోగ్య మాయాజాలం
రోగం లేకున్నా ఉన్నట్లు ఊహించుకోవడం కొత్త తరం మనిషికి శాపంగా మారింది. ఏఐ ఇచ్చిన ఫలితాలు రోగిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చికిత్సతో తగ్గే జబ్బుల కంటే ఏఐ పుట్టించిన భయాలే ప్రాణాంతకంగా మారుతున్నాయి. రిటోబన్ ఇప్పుడు నవ్వుకుంటున్నా ఆయన అనుభవించిన ఆందోళన మాత్రం అక్షర సత్యం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *