కాలిపోతున్న నగరాలు..రాలిపోతున్న ప్రాణాలు – మొన్న ఢిల్లీ… నిన్న హైదరాబాద్.. నేడు విశాఖ

Visakha Steel Plant Fire Accident
  • పట్టణాల్లో అభివృద్ధి వెనుక మృత్యుఘోష
  • పెరుగుతున్న అగ్నిప్రమాదాలు… వరదలు
  • ప్రాణాలు తీస్తున్న పట్టణ ప్రణాళికలు
  • రాజకీయాల కోసం నిబంధనల ఉల్లంఘన
  • భద్రత గాలికి వదిలేసిన వ్యవస్థలు

సహనం వందే, హైదరాబాద్:

నిత్యం అభివృద్ధి అంటున్న పాలకులు నగరాలను మృత్యుకూపాలుగా మారుస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు అగ్ని కీలల్లో సజీవదహనమవుతున్న కార్మికులు, అకాల వర్షాలకు నీట మునుగుతున్న రాజధానులు చూస్తుంటే మనం అభివృద్ధి వైపు వెళ్తున్నామా లేదా మృత్యువు అంచున బతుకుతున్నామా అన్న అనుమానం కలుగుతోంది. నగరాల విస్తరణలో ప్లానింగ్ లేని లోపం రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను తుంగలో తొక్కడం వల్ల సామాన్యుడి ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది.

స్టీల్ ప్లాంట్ విషాదం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో ల్యాడల్ నుండి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలడం వల్ల మరుగుతున్న ద్రవం కార్మికులపై పడింది. ఈ దుర్ఘటనలో పలువురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ప్రాణనష్టాన్ని ఆపలేకపోయారు. భారీ పరిశ్రమల్లో ఉండాల్సిన భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేశారనే వాదనకు ఈ ప్రమాదం అద్దం పడుతోంది.

హైదరాబాద్‌కు ముప్పు
రాజధాని హైదరాబాద్‌లోనూ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంలో అనేకమంది చనిపోయారు. ఆ మధ్య కూకట్‌పల్లిలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. తరచూ జరుగుతున్న ఇలాంటి అగ్నిప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నగరాల్లోని ఫ్యాక్టరీలు, నివాస గృహాల్లో అగ్నిమాపక యంత్రాలు వెళ్లడానికి కూడా వీల్లేని విధంగా ఇరుకైన దారులు, నిబంధనలకు విరుద్ధమైన కట్టడాలు ఉండటమే ఈ మృత్యువులకు ప్రధాన కారణం. మరీ దారుణం ఏంటంటే మంగళవారం కురిసిన వర్షం సమయంలో కరెంటు తీగలు తాకి ఇద్దరు మరణించడం ఎవరి నిర్లక్ష్యం?

ఢిల్లీలో సామాన్యుడి బలి
దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు సామాన్య ప్రజలు సజీవదహనమయ్యారు. అంతేకాదు వర్షం పడితే చాలు నగరం మునిగిపోతోంది. బేస్‌మెంట్లలో నీరు చేరి ప్రాణాలు పోతున్నా అధికారుల్లో చలనం లేదు. నివాస గృహాల్లో కరెంటు తీగలు ఒకదానికొకటి అల్లుకుని ప్రమాదకరంగా మారుతున్నాయి. అగ్నిప్రమాదం జరిగితే రక్షించడానికి అగ్నిమాపక యంత్రాలు గంటల కొద్దీ వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది.

నిర్లక్ష్యపు పునాదులు
అనధికారిక కట్టడాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఏ నిబంధనలు లేకుండా అనుమతులు లేకుండా కడుతున్న బహుళ అంతస్తుల భవనాలు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేని చోట అండర్ గ్రౌండ్ బేస్‌మెంట్లు కట్టి అద్దెలకు ఇవ్వడం వల్ల వర్షపు నీరు చేరి మనుషులు చనిపోతున్నారు. బిల్డర్ల బాధ్యతారాహిత్యం ఒక ఎత్తు అయితే అధికారుల చీకటి ఒప్పందాలు మరో ఎత్తు. అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరిస్తామన్న రాజకీయ హామీలు చట్టాలను మరింత బలహీనపరుస్తున్నాయి.

నగరాల ఉక్కిరిబిక్కిరి
ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో వరదలు వస్తే పరిస్థితులు నరకప్రాయంగా ఉంటున్నాయి. ముంబైలో స్లమ్స్‌లో సదుపాయాలు లేక వర్షాలకు నగరం మునిగి ట్రాఫిక్ స్తంభించి ప్రజలు అల్లాడిపోతున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకుండా ఢిల్లీని పడావు పెట్టారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య వల్ల కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. ఎయిర్‌పోర్టుకు ఎప్పుడు చేరుకుంటామో కూడా తెలియని పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కష్టాలను ప్రస్తావిస్తూ పట్టణాల దుస్థితిని ఎండగట్టారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు
రాజకీయాల్లో ఓటు బ్యాంకు కోసం అక్రమ కట్టడాలను పట్టించుకోకపోవడం పెద్ద తప్పు. డెవలప్‌మెంట్ అంటే కేవలం బిల్డింగులు కట్టడం కాదు. అవి సురక్షితంగా ఉన్నాయో లేదో చూడటం అని పాలకులు గుర్తించాలి. టెక్నాలజీ పెరిగినా స్మార్ట్ సిటీలు కేవలం వైఫైలు, సీసీ కెమెరాలకే పరిమితమయ్యాయి. అసలైన డ్రైనేజీ, అగ్నిమాపక వ్యవస్థల వంటి పునాదులను మరిచిపోవడం వల్ల దేశ ప్రగతి కుంటుపడుతోంది. కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పట్టణాలు నివాస యోగ్యంగా ఉండవు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *