కాక రేపుతున్న కాక్రోచ్ పార్టీ – సీజేఐ వ్యాఖ్యలతో తిరుగుబాటు

Abhijith cockroach janata party
  • యువతకు ఘోర అవమానం
  • ఇంటర్నెట్‌లో తీవ్ర ఆగ్రహం
  • పుట్టుకొచ్చిన సరికొత్త పార్టీ
  • లక్షల మంది మద్దతు
  • హాట్ టాపిక్‌గా అభిజీత్

సహనం వందే, హైదరాబాద్:

న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠం నుండి వచ్చిన ఒక వివాదాస్పద వ్యాఖ్య దేశంలో అపూర్వమైన రాజకీయ విప్లవానికి దారితీసింది. నిరుద్యోగ యువతను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై డిజిటల్ ప్రపంచం తిరగబడింది. అవమానాన్నే అస్త్రంగా మార్చుకుని ఒక విద్యార్థి ప్రారంభించిన ఈ సామాజిక పోరాటం… ఇప్పుడు దేశవ్యాప్తంగా సాంప్రదాయ రాజకీయ పునాదులను కదిలిస్తూ సరికొత్త సంచలనంగా మారింది.

అవమానం నుండి పుట్టిన ఆక్రోశం
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విచారణలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు లేక, సమాజంలో గుర్తింపు లేని కొందరు యువకులు బొద్దింకల్లా, పరాన్నజీవుల్లా మారుతున్నారని ఆయన అన్నారు. వాళ్లే మీడియాగా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి అందరిపై దాడులు చేస్తున్నారన్న వ్యాఖ్యలు యువతలో కార్చిచ్చు రగిల్చాయి. దేశంలో నిరుద్యోగం, కెరీర్ టెన్షన్లు, పేపర్ లీకేజీల గోలతో ఇప్పటికే విసిగిపోయిన యువతకు ఈ మాటలు తీవ్ర గాయాన్ని చేశాయి. ఈ ఘోర అవమానాన్ని ఒక రాజకీయ ఆయుధంగా మార్చాలని యువత నిర్ణయించుకుంది.

Cockroach Janta Party - Abhijith

అమెరికా చదువు నుండి అంతర్జాల పోరుకు
ఈ సంచలన ఉద్యమం వెనుక 30 ఏళ్ల అభిజీత్ దిప్కే ఉన్నాడు. ఇతను అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ రిలేషన్స్ మాస్టర్స్ పూర్తి చేశాడు. కేవలం ఒక వారం క్రితం వరకు బోస్టన్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే సాధారణ విద్యార్థిగా ఉన్నాడు. ప్రస్తుతం ఇతనికి ఎలాంటి ఉద్యోగం లేదు. కానీ దేశంలో జరిగిన పరిణామాలు ఇతని ఆలోచనలను మార్చేశాయి. గతంలో 2020 నుండి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీమ్‌లో వాలంటీర్‌గా పనిచేసిన అనుభవం అభిజీత్‌కు ఉంది. దీంతో మీమ్స్ ద్వారా, డిజిటల్ క్యాంపెయిన్స్ ద్వారా యువతను ఎలా ఆకట్టుకోవాలో అతనికి ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది.

క్షణాల్లో విస్తరించిన బొద్దింకల సైన్యం
న్యాయమూర్తి వ్యాఖ్యలకు నిరసనగా మే 16న అభిజీత్ ఒక గూగుల్ ఫామ్ పెట్టి కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించాడు. సరదాగా మొదలైన ఈ జోక్ కేవలం 48 గంటల్లోనే 40 వేల మందిని ఆకర్షించింది. కేవలం 4 రోజుల్లోనే ఏకంగా 1.6 లక్షల మంది సభ్యులు ఇందులో చేరారు. ఇన్స్టాగ్రామ్‌లో దీని ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రే 20 లక్షలు దాటిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సాయంతో కేవలం కొన్ని గంటల్లోనే పార్టీ వెబ్‌సైట్, గుర్తు, ఒక అదిరిపోయే యాంథం సిద్ధమయ్యాయి.

బద్ధకస్తుల నిరుద్యోగుల సంచలన మేనిఫెస్టో
సమాజం తమను చూసే నెగెటివ్ యాంగిల్‌నే వాడుకుంటూ వాయిస్ ఆఫ్ ది లేజీ అండ్ అన్‌ఎంప్లాయిడ్ అని ట్యాగ్‌లైన్ పెట్టారు. నిరుద్యోగులు, బద్ధకస్తులు, రోజంతా ఇంటర్నెట్ లోనే గడిపేవారు ఈ పార్టీకి వంద శాతం అర్హులని ప్రకటించారు. ఇది కేవలం జోక్ లాగా కనిపిస్తున్నా దీని వెనుక ఒక బలమైన 5 పాయింట్ల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. న్యాయవ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని, రిటైర్ అయిన చీఫ్ జస్టిస్‌లకు రాజకీయ పదవులు లేదా రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. గాంధీ, అంబేద్కర్, నెహ్రూల సిద్ధాంతాలే తమకు స్ఫూర్తి అని ఈ పార్టీ స్పష్టం చేసింది.

సామాజిక ఉద్యమానికి పునాది…
అభిజీత్ మాట్లాడుతూ లక్ష మంది నమ్మి వచ్చాక ఇది జోక్ కాదని… త్వరలోనే ఢిల్లీ వచ్చి దీనిని ఒక సామాజిక ఉద్యమంగా మారుస్తానని ప్రకటించాడు. అవసరమైతే బీహార్ ఉపఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. ఇప్పుడు లీడర్ల సీరియస్ స్పీచ్‌లు వినలేక యువత ఈ మీమ్ కల్చర్, పొలిటికల్ సెటైర్‌ను ఒక కొత్త ఆయుధంగా మార్చుకుంది. తమ ఆగ్రహాన్ని నవ్వుతూనే పాలకులకు తెలిసేలా చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు. నిన్నటి వరకు జోక్‌గా ఉన్నది రేపు ఒక పెద్ద సామాజిక మార్పుకు కారణం కావచ్చు. డిజిటల్ ప్రపంచంలో పుట్టిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తులో రోడ్ల మీదకు వచ్చి నిజమైన రాజకీయ పార్టీగా మారుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *