- ఇమేజ్ క్లీనింగ్ ప్రయత్నం… కోట్లలో లాభం
- కూతురు పారిస్ జాక్సన్ ఆగ్రహం
సహనం వందే, హైదరాబాద్:
మైఖేల్ జాక్సన్ అంటే కేవలం పేరు కాదు ఒక ప్రపంచ స్థాయి బ్రాండ్. చనిపోయిన పదిహేడేళ్ల తర్వాత కూడా ఆయన సంపాదనలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఆయన జీవిత కథ వెండితెరపైకి వస్తోంది. అయితే ఇది సాధారణ బయోపిక్ కాదు. జాక్సన్ చుట్టూ ఉన్న నల్లని మచ్చలను తుడిచేసి ఆయనను మళ్ళీ దేవుడిగా చూపే భారీ వ్యాపార వ్యూహం.
కోట్ల రూపాయల సానిటైజేషన్
ఈ సినిమా కోసం జాక్సన్ ఎస్టేట్ ఏకంగా 1250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో జాక్సన్ మేనల్లుడు జాఫర్ ఇందులో నటిస్తున్నారు. అయితే 1994 నాటి ఒక ఒప్పందం సినిమాను ఇబ్బందుల్లో నెట్టింది. లైంగిక వేధింపుల ఆరోపణలను తెరపై చూపకూడదనే నిబంధన వల్ల పాత ఫుటేజీని తీసేయాల్సి వచ్చింది. దీనివల్ల 1980ల నాటికే సినిమాను ముగించాలని నిర్ణయించారు. దీనికోసం అదనంగా 22 రోజుల షూటింగ్ నిర్వహించి మరో 200 నుండి 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

ఎస్టేట్ మాస్టర్ ప్లాన్
జాక్సన్ ఎస్టేట్ ఎగ్జిక్యూటర్ జాన్ బ్రాంకా ఈ సినిమా వెనుక అసలు సూత్రధారి. జాక్సన్ చనిపోయేనాటికి 3700 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నారు. ఏఈజీ లైవ్ సంస్థకు 330 కోట్లు చెల్లించాల్సి ఉంది. అప్పట్లో దిస్ ఈజ్ ఇట్ అనే డాక్యుమెంటరీతో 2200 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఎస్టేట్ గట్టెక్కింది. ఇప్పుడు ఈ సినిమాతో జాక్సన్ ప్రతిష్టను పెంచి కొత్త తరం ప్రేక్షకులను ఆకర్షించాలని ప్లాన్ చేశారు. సినిమా క్లిక్ అయితే ఎస్టేట్‌కు 330 కోట్ల రూపాయలకు పైగా అదనపు లాభాలు వచ్చే అవకాశం ఉంది.
వ్యాపార సామ్రాజ్యం విస్తరణ
జాక్సన్ చనిపోయిన నాటి నుండి ఇప్పటివరకు ఎస్టేట్ మొత్తం 29 వేల కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. ఇందుకోసం నెవర్ లాండ్ రాంచ్ ను 180 కోట్లకు అమ్మేశారు. ఏటీవీ కేటలాగ్ ను 6250 కోట్లకు, మ్యూజిక్ రైట్స్ సగ భాగాన్ని సోనీ సంస్థకు 5000 కోట్ల రూపాయలకు విక్రయించారు. 2025లోనే వివిధ ప్రదర్శనల ద్వారా 875 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలయ్యాక జాక్సన్ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగి ఆదాయం వందల కోట్లు పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కుటుంబంలో అసమ్మతి మంటలు
సినిమా బయట ఎంత హంగామా చేస్తున్నా జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా హాలీవుడ్ మాయాజాలమని ఆమె మండిపడుతున్నారు. ఎగ్జిక్యూటర్లు తమ ప్రయోజనం కోసం వాస్తవాలను దాచి అబద్ధాలను అమ్ముతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తీసుకున్న నిర్ణయాలపై ఆమె కోర్టులో పోరాడుతున్నారు. తనకు రావాల్సిన 540 కోట్ల రూపాయల ప్రయోజనాల గురించి కూడా వివాదం నడుస్తోంది. తన తండ్రి పాత్రను కేవలం ఒక ఇన్ఫోమెర్షియల్ లాగా మార్చేశారని ఆమె వాదిస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం 4100 కోట్ల రూపాయలు వసూలు చేస్తేనే లాభాల్లోకి వస్తుంది. లయన్స్‌గేట్ సంస్థ మాత్రం 5800 కోట్ల రూపాయల కలెక్షన్లను ఆశిస్తోంది. అప్పుడే సినిమా రెండో భాగాన్ని తీసే అవకాశం ఉంది. బోహేమియన్ రాప్సోడి లాంటి మ్యూజిక్ బయోపిక్ 7500 కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో మైఖేల్ సినిమాపై కూడా ట్రేడ్ అనలిస్టులు ధీమాగా ఉన్నారు. మొదటి వారాంతంలోనే మన దేశీ కరెన్సీలో దాదాపు 540 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని లెక్కలు వేస్తున్నారు.
భవిష్యత్తుపై ప్రభావం
సంగీతం అనేది అంతర్జాతీయ భాష కాబట్టి విదేశీ మార్కెట్లలో ఈ సినిమా భారీ హిట్టవుతుందని అంచనా. ఇప్పటికే బెర్లిన్ ప్రీమియర్ లో ఫ్యాన్స్ నీరాజనాలు పలికారు. వివాదాల జోలికి వెళ్ళకుండా కేవలం పాటలు, డ్యాన్స్ మీద దృష్టి పెట్టడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. ఇది సక్సెస్ అయితే జాక్సన్ మ్యూజిక్ కేటలాగ్ విలువ రెట్టింపు అవుతుంది. తద్వారా రాబోయే కాలంలో జాక్సన్ ఎస్టేట్ ఏటా 800 కోట్ల రూపాయలకు పైగా స్థిరమైన ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.