జడ్జిపై కేజ్రీ’ఫైర్’ – ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ సంచలన వాదన

Arvind Kejriwal Comments on Delhi High Court Judge
  • న్యాయమూర్తి కాషాయపు మరకపై క్లారిటీ
  • జస్టిస్ స్వర్ణకాంత శర్మ వైదొలగాలని డిమాండ్
  • ఆమె ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధంపై అభ్యంతరం
  • కాషాయ వేదికలపై 4 సార్లు కనిపించారని ఫైర్
  • ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఢిల్లీ కోర్టు హాల్

సహనం వందే, ఢిల్లీ:

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని న్యాయస్థానంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. తనపై ఉన్న కేసును కేవలం రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూనే ఏకంగా న్యాయమూర్తి నిష్పాక్షికతను సవాల్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న సంస్థల కార్యక్రమాలకు న్యాయమూర్తి హాజరయ్యారని ఆరోపిస్తూ ఆయన నేరుగా కోర్టులోనే ధ్వజమెత్తడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

న్యాయమూర్తిపై కేజ్రీవాల్ అటాక్
లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసు నుంచి తప్పుకోవాలని ఆయన కోరారు. ఆమె గతంలో అద్వివక్త పరిషత్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమాలకు 4 సార్లు హాజరయ్యారని ఆయన గుర్తు చేశారు. ఈ సంస్థకు ఆర్‌ఎస్‌ఎస్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తమ రాజకీయ ప్రత్యర్థుల భావజాలం ఉన్న సంస్థలతో సంబంధం ఉన్న వారు ఈ కేసు విచారించకూడదని ఆయన వాదించారు.

Arvind Kejriwal and  Justice Swarnakantha Sarma

రాజకీయ కేసుగా అభివర్ణన
మద్యం పాలసీ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. రాజకీయంగా తమను దెబ్బతీయడానికే ఈ కేసులను సృష్టించారని ఆయన ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా తమ ప్రత్యర్థుల భావజాలానికి మద్దతునిచ్చే వేదికలపై కనిపించిన వారు విచారణ జరపడం తగదని ఆయన వాదించారు. అందుకే జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసు నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిష్పాక్షికమైన విచారణ తమ ప్రాథమిక హక్కు అని ఆయన కోర్టులో పేర్కొన్నారు.

అనుమానాలు… అభ్యంతరాలు
న్యాయమూర్తి ఈ కేసును విచారిస్తే తమకు తటస్థమైన తీర్పు వస్తుందనే నమ్మకం లేదని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిర్దిష్ట సిద్ధాంతం కలిగిన లాయర్ల బాడీ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. 4 సార్లు హాజరు కావడం అంటే అది కేవలం యాదృచ్చికం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల విచారణలో పారదర్శకత లోపించే ప్రమాదం ఉందని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు. ఈ అంశంపై ఆయన కోర్టులో ఎక్కడా తగ్గకుండా తన వాదనను వినిపించారు.

న్యాయస్థానంలో ఉత్కంఠ పోరు
అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా రంగంలోకి దిగి చేసిన ఈ వ్యాఖ్యలు కోర్టు హాల్‌లో నిశ్శబ్దాన్ని నింపాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి న్యాయమూర్తి నేపథ్యాన్ని, ఆమె హాజరైన కార్యక్రమాలను ఎత్తిచూపడం అత్యంత సాహసోపేతమైన చర్యగా భావిస్తున్నారు. ఈ పరిణామాల తర్వాత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అజెండాపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కూడా దుమారం రేపుతున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *