- యుద్ధంపై చర్చలకు ఇస్లామాబాద్ వేదిక
- ఉగ్రవాద దేశంలో శాంతి జపం ఒక ప్రహసనం
- పాక్ ముసుగులో అమెరికా ప్రమాదకర క్రీడ
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రాక
- చైనా వ్యూహంలో అమెరికా బందీ
- భారతదేశాన్ని అవమానించే విధంగా చర్యలు
సహనం వందే, హైదరాబాద్:
ఉగ్రవాదానికి ఊపిరిపోస్తూ ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్తాన్ ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య మధ్యవర్తిగా అవతరించడం అంతర్జాతీయ దౌత్య చరిత్రలోనే అతిపెద్ద ప్రహసనం. వేల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు బలిగొన్న యుద్ధాన్ని ఆపే నెపంతో ఇస్లామాబాద్‌ను శాంతి కేంద్రంగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం అమెరికా తన స్వార్థం కోసం భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశాల ప్రయోజనాలను పక్కన పెట్టి చేస్తున్న ప్రమాదకర ప్రయోగం.
ఉగ్ర నిలయంలో దౌత్య వేడుక
ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్‌ను దాచిన అబోటాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఇస్లామాబాద్‌లో ఇప్పుడు అమెరికా అధికారులు తిష్టవేశారు. జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్ వంటి అగ్రనేతలు సెరీనా హోటల్‌లో విందులు ఆరగిస్తూ ఇరాన్‌తో సంధికి సిద్ధమవుతున్నారు. 2011 తర్వాత తొలిసారిగా అమెరికా ఇంతటి ప్రాధాన్యతను పాక్‌కు ఇవ్వడం, గతంలో ట్రంప్ అన్న అబద్ధాల కోరు దేశం అనే మాటలను తుంగలో తొక్కడమే. ఈ పరిణామం దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించే కుట్రగా కనిపిస్తోంది.

ఖనిజాల కోసం బేరసారాలు
పాకిస్థాన్‌లో ఉన్న సుమారు 250 లక్షల కోట్ల రూపాయల విలువైన అరుదైన ఖనిజ నిధులపై అమెరికా కన్ను పడింది. అందుకే భారత్‌తో గతేడాది జరిగిన ఘర్షణలో పాక్‌ను రక్షించేలా ట్రంప్ వ్యవహరించారు. షెహబాజ్ షరీఫ్ గత ఏడాది అక్టోబర్ 13న ట్రంప్‌తో జరిపిన భేటీ తర్వాత పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్‌ను ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని ట్రంప్ కీర్తించడం వెనుక అసలు రహస్యం ఈ వ్యాపార ఒప్పందాలే. శాంతి పేరుతో జరుగుతున్న ఈ చర్చల వెనుక ఉన్నది కేవలం ఖనిజ దోపిడీ మాత్రమే.
చైనా పన్నిన పద్మవ్యూహం
ఈ మొత్తం డ్రామా వెనుక చైనా మాస్టర్ ప్లాన్ ఉంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బీజింగ్‌లో వాంగ్ యీతో జరిపిన మంతనాలే ఇరాన్‌ను టేబుల్ మీదకు తెచ్చాయి. చైనా-పాక్ ఆర్థిక కారిడార్‌ను రక్షించుకోవడానికి, ఇరాన్ ద్వారా భారత్ చేపట్టిన ప్రాజెక్టులను దెబ్బకొట్టడానికి ఇది ఒక ఎత్తుగడ. చైనా పన్నిన ఈ వలలో అమెరికా చిక్కుకోవడం ఆసియాలో భద్రతా సమతుల్యతను దెబ్బతీస్తుంది.
ఇరాన్, పాక్ లోపాయికారీ సంబంధాలు…
900 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు భారత్‌కు తలనొప్పిగా మారాయి. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇబ్బందులు ఎదురవుతుంటే పాక్ నౌకలకు మాత్రం ఇరాన్ స్వేచ్ఛనిచ్చింది. సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం ఉన్నప్పటికీ పాక్ ఇప్పుడు ఇరాన్, అమెరికా మధ్య వారధిగా మారి తన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఇది ప్రాంతీయంగా భారత్ ఒంటరి అయ్యే పరిస్థితిని కలిగిస్తోంది.
ఇజ్రాయెల్ దాడులు… పాక్ కపటత్వం
లెబనాన్ మీద ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 180 మంది మరణించగా దానిని అడ్డుపెట్టుకుని షెహబాజ్ షరీఫ్ ముస్లిం ప్రపంచంలో హీరోగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు అమెరికాతో దోస్తీ చేస్తూనే మరోవైపు ఇజ్రాయెల్ వ్యతిరేక సెంట్రిమెంట్‌ను వాడుకోవడం పాక్ ద్వంద్వ నీతికి నిదర్శనం. ఈ చర్చల వల్ల శాంతి వస్తుందన్న గ్యారెంటీ లేదు కానీ పాకిస్థాన్‌కు మాత్రం అమెరికా నుంచి భారీగా డాలర్లు అందే అవకాశం ఉంది. ఇది తిరిగి ఉగ్రవాదానికి పెట్టుబడిగా మారే ప్రమాదం ఉంది.
ఢిల్లీకి హెచ్చరిక గంటలు
ప్రస్తుతం ఇస్లామాబాద్‌ను కోటలా మార్చిన భద్రతా బలగాల పహారా చూస్తుంటే అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఎంతటి దిగజారుడుకైనా సిద్ధపడిందని అర్థమవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరితే ఆ క్రెడిట్ మొత్తం పాకిస్థాన్‌కు దక్కుతుంది. ఇది భారత్ దౌత్య విజయాలను నీరుగార్చేలా ఉంది.