కెమెరా గుండెలో బుల్లెట్ గాయం – మీడియా వాహనంపై మృత్యు పంజరం

Israel attacks on press
  • జర్నలిస్టుల గొంతు నొక్కిన ఇజ్రాయెల్
  • లెబనాన్ వీధుల్లో రక్తం రాసిన కథ
  • ఒక మహిళా జర్నలిస్టు సహా ముగ్గురి హతం
  • అల్-మయాదీన్ ఫాతిమా ఆఖరి శ్వాస

సహనం వందే, లెబనాన్:

లోకం నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు మేల్కొని ఉండాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు అక్కడ నిలబడాలి. వాళ్లే జర్నలిస్టులు. కెమెరా పట్టుకున్న చేతులు, నిజాన్ని మోసే భుజాలు ఈరోజు కుప్పకూలుతున్నాయి. ఇది కేవలం బాంబుల యుద్ధం కాదు… బయటకు రాకూడని నిజాలపై జరుగుతున్న దమనకాండ. అక్షరం సాక్షిగా జరుగుతున్న అన్యాయమిది.

లెబనాన్ రక్తపు చారలు…
యుద్ధ క్షేత్రంలో చావు ఎప్పుడూ వెంటే ఉంటుంది. కానీ కెమెరా పట్టుకున్న చేతులు, ప్రెస్ అని రాసి ఉన్న అంగీలు రక్షణ కవచాలు అనుకుంటాం. అది భ్రమ అని లెబనాన్ రక్తపు చారలు చెబుతున్నాయి. వార్తను ప్రపంచానికి చేరవేయాలనుకున్న ముగ్గురు జర్నలిస్టులు ఇప్పుడు తామే ఒక విషాద వార్తగా మారిపోయారు. ఇది కేవలం మరణం కాదు… నిజాన్ని పాతిపెట్టే ప్రయత్నం.

Journalist Fatima Fatouni

మరణం వెంటాడింది
ఫాతిమా ఫ్టౌనీ ఒక కలం యోధురాలు. ఆమె అల్-మయాదీన్ ప్రతినిధిగా లెబనాన్‌లో వార్తలు సేకరిస్తోంది. ఈ నెల 28న ఆమె ప్రయాణిస్తున్న మీడియా వాహనంపై మొదటి దాడి జరిగింది. ఆమె ప్రాణభయంతో కారు దిగి పరుగెత్తింది. కానీ విధి వదిలిపెట్టలేదు. రెండోసారి జరిగిన దాడి ఆమెను బలి తీసుకుంది. ఆమె ధరించిన ప్రెస్ జాకెట్ ఆమెను కాపాడలేకపోయింది.

వరుస శవయాత్రలు
ఈ దాడిలో ఫాతిమా ఒక్కరే చనిపోలేదు. ఆమె సోదరుడు, ఫ్రీలాన్స్ కెమెరామెన్ మొహమ్మద్ ఫ్టౌనీ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వారితో పాటు సీనియర్ జర్నలిస్టు అలీ షోయబ్ కూడా మరణించాడు. వీరంతా నిరాయుధులు. కేవలం వార్తను ప్రపంచానికి చూపించాలనుకున్నారు. ఇజ్రాయెల్ దళాలు ఒకరిని లక్ష్యం చేసుకున్నామని చెబుతున్నా మిగిలిన వారి మరణాలకు సమాధానం లేదు.

నిజం నిర్బంధం
కేవలం దాడులే కాదు అణచివేత కూడా మొదలైంది. లెబనాన్‌లో చిత్రీకరణ చేస్తున్న సీఎన్‌ఎన్ జర్నలిస్టును ఇజ్రాయెల్ దళాలు నిర్బంధించాయి. ఆ జర్నలిస్టు చేతిలో ఆయుధం లేదు… కేవలం కెమెరా మాత్రమే ఉంది. నిజాన్ని రికార్డ్ చేయడం నేరమా అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇది జర్నలిజంపై జరుగుతున్న అతిపెద్ద దాడి.

చెదిరిన సరిహద్దులు
యుద్ధంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. జర్నలిస్టులను తాకకూడదనేది ఒక నైతిక ఒప్పందం. కానీ ఇప్పుడు ఆ హద్దులు చెరిగిపోతున్నాయి. జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగానే లక్ష్యం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు… గొంతు నొక్కే ప్రయత్నం. రిస్క్ తీసుకోవడం వేరు… టార్గెట్ కావడం వేరు.

సామాజిక సంక్షోభం
జర్నలిస్టులు లేకపోతే ప్రపంచానికి ఏమీ తెలియదు. ఇక్కడ ఒక ప్రాణం పోతే ఒక కథ కూడా చనిపోతుంది. అకృత్యాలు బయటకు రావు. జవాబుదారీతనం అదృశ్యమవుతుంది. ఒక జర్నలిస్టును చంపడం అంటే సమాజం కళ్లను పొడవడమే. నిజం అనేది ఒక ఆప్షన్ మాత్రమే అయిపోయే ప్రమాదం పొంచి ఉంది.

హెచ్చరిక గంట.‌‌..
ఈరోజు లెబనాన్‌లో జరుగుతున్నది రేపు ఎక్కడైనా జరగొచ్చు. నిజం చెప్పే వాళ్లకు రక్షణ లేని లోకంలో మనం ఉన్నాం. శక్తివంతులు దాచాలనుకునే విషయాలను బయటపెట్టడమే జర్నలిజం. ఆ పని చేస్తున్నందుకు ప్రాణాలు పోవడం నాగరికతకే సిగ్గుచేటు. ఇది ఒక హెచ్చరిక… మేల్కోకపోతే నిజం ఎప్పటికీ నిశ్శబ్దమైపోతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *