పండ్ల రసంతో పుండ్ల శరీరం – తెలియకుండానే షుగర్ ఎటాక్

Fruit Juice Sugar attacks
  • జ్యూస్ గ్లాసులో క్యాలరీల బాంబు!
  • ద్రవ రూపంలో విషం.. ఇన్సులిన్ డేంజర్ బెల్స్
  • జీవన క్రియకు చెక్… పిల్లల ఆరోగ్యం ఫసక్

సహనం వందే, హైదరాబాద్:

ఉదయాన్నే ఒక గ్లాసు పండ్ల రసం తాగితే ఆరోగ్యం వస్తుందని నమ్ముతున్నారా? అయితే మీరు క్యాలరీల ఉచ్చులో చిక్కుకున్నట్లే. పండ్ల రసాలు, స్మూతీలు ఆరోగ్యకరమనే అపోహ మనల్ని ముంచుతోంది. ఇవి మన శరీరంలోకి నిశ్శబ్దంగా కొవ్వును చేరవేసే బాంబుల్లా పనిచేస్తున్నాయి. ఆరోగ్యకరమైన ముసుగులో మనం తీసుకునే ఈ పానీయాలు మెటబాలిజంను దెబ్బతీస్తూ ప్రాణాంతకంగా మారుతున్నాయి.

Fruit Juices

పండ్ల రసాల్లో చక్కెర ముప్పు
పండ్లను నేరుగా తినకుండా రసాలుగా మార్చినప్పుడు అందులోని పీచు పదార్థం పూర్తిగా నశిస్తుంది. కేవలం చక్కెర, క్యాలరీలు మాత్రమే మిగులుతాయి. 250 మి.లీ. ఆరెంజ్ జ్యూస్‌లో 110 క్యాలరీలు, 20 గ్రాముల కంటే అధికంగా చక్కెర ఉంటుంది. ఇది 3 చపాతీలు తినడంతో సమానం. కానీ ఇది కడుపు నిండిన భావనను అస్సలు కలిగించదు. ఫలితంగా మనం తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకుంటాం.

స్మూతీల మాయాజాలం
స్మూతీలను ఆరోగ్యానికి నిలయంగా భావించడం ఒక పెద్ద పొరపాటు. ఒక ప్యాక్ చేసిన స్మూతీలో 200 నుండి 400 క్యాలరీలు ఉంటాయి. ఇందులో చక్కెర శాతం 30 గ్రాముల వరకు ఉంటుంది. ఇది ఒక పూర్తి భోజనంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన వైద్య నిపుణురాలు డాక్టర్ సత్య వందన ఈ పానీయాల ఎంపికపై ఆందోళన వ్యక్తం చేశారు. మన తాగే అలవాట్లు జీవక్రియను గణనీయంగా మార్చేస్తాయని ఆమె వివరించారు.

దెబ్బతింటున్న జీవక్రియ
ద్రవ రూపంలో ఉండే క్యాలరీలు శరీరంలోకి చాలా త్వరగా చేరుతాయి. దీనివల్ల మన మెటబాలిజం నెమ్మదిస్తుంది. ప్రోటీన్ షేక్స్, ఎనర్జీ డ్రింక్స్ ద్వారా అందే క్యాలరీలు రహస్యంగా శరీరంలో పేరుకుపోతాయి. ఇది శరీరం కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన లేబుల్ ఉన్న పానీయాలే మనకు తెలియకుండా భారీ మొత్తంలో క్యాలరీలను అంటగడుతున్నాయి.

ఇన్సులిన్ ముప్పు
తీపి పానీయాలు రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి. ఇలా ఇన్సులిన్ ఒక్కసారిగా పెరగడం మధుమేహానికి దారితీస్తుంది. గ్యాస్ ఉన్న పానీయాలు, ఖరీదైన కాఫీ డ్రింక్స్ తాగడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ. ఒక సాధారణ శీతల పానీయంలో 140 క్యాలరీలు, 39 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇవి ప్యాంక్రియాస్‌పై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి.

Sugar attacks due to Fruit Juices

పిల్లలకు ప్రమాదం
తల్లిదండ్రులు తమ పిల్లలకు పండ్ల రసాలు ఇస్తూ ఆరోగ్యంగా ఉన్నారని భ్రమిస్తున్నారు. కానీ దీనివల్ల చిన్న వయసులోనే ఊబకాయం, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ప్యాక్ చేసిన జ్యూస్‌లలో చక్కెర, ప్రిజర్వేటివ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. రసాల కంటే పండ్లను నేరుగా ఇవ్వడమే ఉత్తమమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

నిపుణుల హెచ్చరిక
పానీయాల ప్యాకెట్ల వెనుక ఉండే వివరాలను ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. డాక్టర్ సత్య వందన సూచన ప్రకారం పండ్లను రసంలా కాకుండా నేరుగా తినాలి. ఎనర్జీ డ్రింక్స్, ఫ్యాన్సీ కాఫీలను పరిమితం చేయాలి. నీరు మాత్రమే అత్యంత సురక్షితమైన పానీయం. మీరు తాగే ప్రతి చుక్క మీ ఆరోగ్యాన్ని శాసిస్తుందని గుర్తుంచుకోవాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *