- దక్షిణాదికి పొంచి ఉన్న డిలిమిటేషన్ ముప్పు
- రగులుతున్న ప్రాంతీయ ఉద్యమాల జ్వాలలు
- దక్షిణాన సంపద సృష్టి… ఉత్తరాన సీట్ల వృద్ధి
- ‘హిందూ’ పత్రికలో కాంగ్రెస్ నేత శశి ధరూర్ సంచలన వ్యాసం
సహనం వందే, హైదరాబాద్:
భారతదేశం ప్రస్తుతం ఒక విలక్షణమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా దూసుకుపోతుంటే… ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా పట్టు బిగిస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య పెరుగుతున్న సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు దేశ సమగ్రతకు సవాలుగా మారాయి. ఈ సున్నితమైన అంశంపై జాతీయ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ది హిందూలో కాంగ్రెస్ నేత శశి ధరూర్ రాసిన కథనం సంచలనం సృష్టిస్తుంది. ఆ స్టోరీలోని కొన్ని కీలకమైన విషయాలు ఇక్కడ చూడవచ్చు.
ముంచుకొస్తున్న డిలిమిటేషన్ గండం
శశి థరూర్ ది హిందూలో రాసిన వ్యాసంలో (Beyond the rhetoric of the north-south divide) అనేక విషయాలు చర్చించారు. వచ్చే జనాభా లెక్కల తర్వాత పార్లమెంటు సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది గొంతు నొక్కే ప్రమాదం ఉంది. సంపదను సృష్టించే దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇది దేశ సమాఖ్య వ్యవస్థకు పెద్ద దెబ్బ అని శశి థరూర్ హెచ్చరించారు. గతంలో యూఎస్‌ఎస్‌ఆర్, యుగోస్లేవియా వంటి దేశాలు ఇలాంటి ఆర్థిక, రాజకీయ అసమతుల్యత వల్లే ముక్కలయ్యాయని ఆయన గుర్తుచేశారు.

ఉత్తరాదిలో ఆఫ్రికాలోని జీవన చిత్రం…
భారతదేశ భౌగోళిక చిత్రం ఇప్పుడు రెండు భిన్నమైన ప్రాంతాలను తలపిస్తోంది. ఒకవైపు అభివృద్ధి చెందిన ద్వీపకల్ప రాష్ట్రాలు ఉంటే… మరోవైపు వెనుకబడిన గంగా మైదాన ప్రాంతాలు ఉన్నాయి. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల మానవాభివృద్ధి సూచీలు ఐరోపా దేశాలతో సమానంగా ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఆఫ్రికాలోని ఉప-సహారా ప్రాంతాల తరహాలో పేదరికంలో మగ్గుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల తలసరి ఆదాయం ఉత్తరాది రాష్ట్రాల కంటే కనీసం రెండు రెట్లు ఎక్కువగా ఉంది.
హైదరాబాద్ నగరంలో మురికి వాడలు…
ఆర్థికంగా బలంగా ఉన్నా దక్షిణాది రాష్ట్రాలు ఒక రకమైన సంక్షోభంలో ఉన్నాయి. సంపన్న రాష్ట్రాల్లో కూడా పేదరికం, అసమానతలు రాజ్యమేలుతున్నాయి. తమిళనాడు తలసరి ఆదాయం బీహార్ కంటే మూడు రెట్లు ఉన్నా… వ్యవసాయ కూలీల వేతనాల్లో ఆ తేడా 2 రెట్లు కూడా లేదు. హైదరాబాద్ వంటి నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీలున్నా… అదే నగరాల్లో మురికివాడలు దర్శనమిస్తున్నాయి. కేరళ మినహా మిగిలిన చోట్ల కుల వివక్ష, పితృస్వామ్యం, స్త్రీ ద్వేషం వంటి సామాజిక రుగ్మతలు ఇంకా బలంగానే ఉన్నాయి. ఆర్థిక వృద్ధిని సామాజిక ప్రగతిగా మార్చడంలో దక్షిణాది విఫలమైందని థరూర్ విమర్శించారు.
ఆదాయంలో 300 శాతం వ్యత్యాసం…
తమిళనాడులోని ధర్మపురి జిల్లా అక్షరాస్యత రేటు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సంపద కేవలం 3 లేదా 4 నగరాలకే పరిమితమైంది. హిందీ రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలు దక్షిణాదిలో ఒక కొత్త వర్గంగా మారుతున్నారు. వీరు ఇక్కడ పని చేస్తున్నా ఓటు హక్కు మాత్రం తమ సొంత రాష్ట్రాల్లోనే కలిగి ఉంటున్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదు. తలసరి ఆదాయంలో 300 శాతం వ్యత్యాసం ఉన్న ప్రస్తుత తరుణంలో మార్పులు అనివార్యం.
మెహ్రోత్రా ప్రతిపాదనల విశ్లేషణ
ప్రొఫెసర్ సంతోష్ మెహ్రోత్రా డెలిమిటేషన్ అంశంపై ఈ ఏడాది జనవరి 12వ తేదీన కొన్ని కీలక సూచనలు చేశారు. దీని ప్రకారం పెద్ద రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇచ్చినా… ప్రతి ఎంపీ ప్రాతినిధ్యం వహించే జనాభా నిష్పత్తిలో మార్పులు చేయాలి. జనాభా సంఖ్యకు, రాష్ట్ర సమానత్వానికి మధ్య సమతుల్యత పాటించాలి. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ ఆధిపత్యాన్ని అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. లేదంటే అభివృద్ధి చెందిన మైనారిటీ జనాభా… వెనుకబడిన మెజారిటీ జనాభాను పోషించాల్సి రావడం వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది.
కొత్త సామాజిక ఒప్పందం అవసరం
కేవలం ఢిల్లీ, రాష్ట్ర రాజధానుల మధ్య రాజకీయ బేరసారాలు జరిగితే సరిపోదు. సామాజిక సామరస్యం, మెరుగైన మానవ వనరులు, పారదర్శక ఆర్థిక వ్యవస్థలు ఏర్పడాలి. అభివృద్ధి అంటే కేవలం రాజధాని నగరాల్లో ఉండే యూనికార్న్ కంపెనీలు కాదు. అత్యంత వెనుకబడిన జిల్లాలోని అక్షరాస్యత రేటు, వ్యవసాయ కూలీ పొందే రోజువారీ వేతనం మాత్రమే నిజమైన అభివృద్ధిని నిర్ణయిస్తాయి. ఈ విషయంలో కేరళ మాత్రమే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ప్రజలందరికీ సంపద పంచే కొత్త సామాజిక ఒప్పందం కుదిరినప్పుడే భారత యూనియన్‌కు భవిష్యత్తు ఉంటుంది.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్