అమెజాన్ ‘టైమ్’ సేల్ – వస్తు డెలివరీలో రోజుల నిరీక్షణకు చరమగీతం

Amazon Deliveries with in 45 Mins.,
  • ఇక నుంచి గంటలలోపే ఇంటికి వస్తువులు
  • పది సాట్లుగా సరుకుల సరఫరాకు ప్లానింగ్
  • గంట ముందు ఫంక్షన్… షర్ట్ కొనే అవకాశం
  • భారీ లాభాల వ్యూహం… కస్టమర్లపై భారం

సహనం వందే, హైదరాబాద్:

అమెజాన్ ఇప్పుడు కేవలం వస్తువుల అమ్మకందారు మాత్రమే కాదు… సమయాన్ని అమ్ముతూ జేబులు గుల్ల చేసే వ్యాపారిగా మారుతోంది. వారం రోజుల వెయిటింగ్‌కు మంగళం పాడుతూ ఆర్డర్ ఇచ్చిన 45 నిమిషాల్లోనే వస్తువును మీ గుమ్మం ముందుకు తెచ్చేలా స్కెచ్ వేసింది. ‘ఎవ్రీథింగ్ స్టోర్’ నుంచి ‘ఎవ్రీ అవర్ స్టోర్’గా మారి… రోజులో ప్రతి గంటను క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా జేఫ్ బెజోస్ సామ్రాజ్యం కొత్త యుద్ధానికి తెరలేపింది. దీనికోసం ప్రత్యేక రుసుములు వసూలు చేస్తూ లాభాల వేట మొదలుపెట్టింది.

నిరీక్షణకు ఇక చరమగీతం
సాధారణంగా అమెజాన్‌లో ఒక షర్టు లేదా బ్రాండెడ్ వాచ్ ఆర్డర్ చేస్తే అది మీ ఇంటికి చేరడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. కానీ కొత్త పద్ధతిలో ఇది గంటల వ్యవధికి మారుతుంది. మీరు సాయంత్రం ఫంక్షన్‌కు వెళ్లాలనుకుని మధ్యాహ్నం 3 గంటలకు కొత్త డ్రెస్ ఆర్డర్ చేస్తే 4 గంటలకల్లా అది మీ చేతిలో ఉంటుంది. కేవలం దుస్తులే కాదు… స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్స్, ఆఫీస్ ఫైళ్లు లేదా ఇంట్లో పాడైన ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఏదైనా సరే కన్నుమూసి తెరిచేలోపు డెలివరీ అవుతాయి.

Amazon Deliveries with in 45 Mins.,

పది స్లాట్ల పక్కా ప్లాన్
రోజును అమెజాన్ 10 ప్రత్యేక సమయ విభాగాలుగా చీల్చింది. ప్రతి విభాగం సుమారు 3 గంటల నిడివి కలిగి ఉంటుంది. వీటికి సన్‌రైజ్, కాఫీ, నైట్ అవుల్ వంటి కోడ్ పేర్లు పెట్టింది. ఉదాహరణకు మీరు ఆఫీస్‌కు వెళ్లే ముందు ఉదయం 7 గంటలకు షేవింగ్ కిట్ ఆర్డర్ చేస్తే అది ‘కాఫీ’ విండోలో గంటలోనే అందుతుంది. అలాగే అర్ధరాత్రి వేళ మీ ల్యాప్‌టాప్ ఛార్జర్ పాడైతే ‘నైట్ అవుల్’ విండో ద్వారా తెల్లవారకముందే మీ చేతికి వచ్చేలా ప్లాన్ చేస్తోంది.

అదనపు బాదుడు షురూ
ఈ అద్భుతమైన వేగం ఉచితం మాత్రం కాదు. వేగంగా డెలివరీ కావాలనుకునే వారి నుంచి ప్రత్యేక ఫీజులు వసూలు చేయాలని అమెజాన్ లోని ఉదిత్ మదన్ నేతృత్వంలోని బృందం నిర్ణయించింది. 45 నిమిషాలు, రెండున్నర గంటల అత్యంత వేగవంతమైన సర్వీసుల కోసం అదనపు చార్జీలు ఉంటాయి. వాల్మార్ట్, ఇన్స్టాకార్ట్, డోర్‌డాష్ వంటి సంస్థల ఫీజులను అమెజాన్ ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంది. అంటే అత్యవసరమైతే అదనపు బాదుడుకు సిద్ధపడాల్సిందే.

వేల కోట్ల భారీ పెట్టుబడి
ఈ కొత్త ప్రాజెక్టు కోసం అమెజాన్ భారీగా ఖర్చు చేస్తోంది. జూలై నాటికి అన్ని చోట్ల విస్తరిస్తే ఈ ఏడాది 2760 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అంచనా. వచ్చే ఏడాది ఇది ఏకంగా 6520 కోట్ల రూపాయలకు చేరవచ్చు. ఒకవేళ వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయిలో విస్తరిస్తే వచ్చే ఏడాది ఖర్చు 4100 కోట్ల రూపాయలుగా ఉండవచ్చు. ఈ భారీ వ్యయం భవిష్యత్తులో లాభాలను కురిపిస్తుందని కంపెనీ గట్టిగా నమ్ముతోంది.

లాభాల బాటలో లక్ష్యాలు
అదనపు ఫీజులు, పెరిగిన అమ్మకాల ద్వారా ఈ ఏడాది 167 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని కంపెనీ లెక్కలు వేస్తోంది. దీనివల్ల సుమారు 4 కోట్ల అదనపు యూనిట్ల అమ్మకాలు జరుగుతాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే 2027 నాటికి 2170 కోట్ల రూపాయల లాభం వస్తుందని కంపెనీ ఆశిస్తోంది. అంటే పెట్టిన ప్రతి రూపాయికి భారీ రాబడి వచ్చేలా అమెజాన్ పక్కా ప్లాన్ సిద్ధం చేసింది.

క్షేత్రస్థాయిలో ప్రయోగం
ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. కస్టమర్ల స్పందనను బట్టి దీనిని అంతటా విస్తరిస్తారు. కేవలం సమయ వ్యవధి మాత్రమే కాకుండా వస్తువు సరిగ్గా ఎన్ని నిమిషాల్లో వస్తుందో కూడా అమెజాన్ ఇకపై స్పష్టంగా చెబుతుంది. ప్రైమ్ మెంబర్‌షిప్‌లో ఇప్పటికే ఉన్న ప్రయోజనాలకు ఇది అదనం మాత్రమేనని అమెజాన్ ప్రతినిధి స్పష్టం చేశారు.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *