చిరంజీవి లేని వెండితెర – సినిమాలో డిజిటల్ బొమ్మల రాజ్యం

No Chiranjeevi - Storeel Software
  • ప్రభాస్ నటన ఇక యంత్రమే
  • అనుష్క అందం ఒక కోడింగ్
  • రష్మిక నవ్వు కేవలం అంకెలే
  • కళకు పట్టిన గ్రహణం… చైనా వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:

పాతాళ భైరవి కాలం నుంచి మొన్నటి బాహుబలి వరకు.. మనల్ని ఏడిపించినా, నవ్వించినా ఆ కళ్లలో ఒక జీవం ఉండేది. కానీ ఇప్పుడు బీజింగ్ వీధుల్లో పుట్టిన ‘స్టోరీల్’ అనే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ మన జ్ఞాపకాలను మింగేయడానికి సిద్ధమైంది. మనం ప్రాణంగా ప్రేమించే చిరంజీవి గ్రేస్, ప్రభాస్ గంభీరం, మహేష్ బాబు మెరుపు, అనుష్క అభినయం… ఇవేవీ ఇక మనకు దక్కవు. రేపు పొద్దున తెరపై మనకు కనిపించేది ఆ నటులు కారు… కేవలం వారి డిజిటల్ నీడలు మాత్రమే.

నటుల యాక్టింగ్ సాఫ్ట్‌వేర్ కోడింగ్‌…
స్టోరీల్ సంస్థ వినోదాన్ని ఒక శవపేటికలో పెట్టి మూసేస్తోంది. వీరు సృష్టించే ఏఐ నటులకు మనుషుల లాగే చర్మం ఉంటుంది. కళ్లలో నీళ్లు తిరుగుతాయి, కానీ ఆ కన్నీటి వెనుక గుండె ఉండదు. ఒకప్పుడు కోట్లాది మంది అభిమానులు ఎదురుచూసే ప్రభాస్ లాంటి కటౌట్లను, అల్లు అర్జున్ లాంటి మేనరిజమ్‌లను ఇప్పుడు కేవలం కొన్ని వేల రూపాయల సాఫ్ట్‌వేర్ కోడింగ్‌తో పుట్టించేస్తున్నారు. వారి రూపాలను, హావభావాలను ఏఐ ద్వారా ఒడిసి పట్టి మనిషి ప్రమేయం లేకుండానే సినిమాలను రూపొందించవచ్చు. దీనివల్ల నటులకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తప్పుతుంది. కానీ ప్రేక్షకుడికి మాత్రం దక్కేది ఒక యంత్రం పలికించే నకిలీ భావోద్వేగం మాత్రమే.

ఖరీదైన శవంలా సినిమా
ఒక సాధారణ మైక్రో డ్రామా తీయాలంటే 1.65 కోట్ల రూపాయలు ఖర్చయ్యే చోట… ఈ చైనా కంపెనీ కేవలం 16 లక్షల నుంచి 33 లక్షల రూపాయలకే పని ముగిస్తోంది. అంటే నిర్మాణ వ్యయంలో 85 శాతం కోత విధిస్తున్నారు. మూడు రెట్లు వేగంగా సినిమాలు వస్తున్నాయి. ఫైలిసియా కోహ్ లాంటి ఇన్వెస్టర్లు దీనిని లాభదాయకమైన వ్యాపారంగా చూస్తున్నారు. కానీ వారు గమనించని విషయం ఏంటంటే.. ఖర్చు తగ్గించే క్రమంలో వారు సినిమాలోని ప్రాణాన్ని తీసేస్తున్నారు. నటుడు లేని సినిమా… శ్వాస లేని శరీరం లాంటిది.

AI Actors

ఏఐ నటులతో నేరుగా చాటింగ్
ఈ టెక్నాలజీలోని అసలైన క్రూరత్వం ఎక్కడ ఉందంటే… ఆ పాత్రలతో మీరు చాట్ చేయవచ్చు. అనుష్క లాంటి బొమ్మనో లేక రష్మిక లాంటి ఏఐ నటినో చూస్తూ మీరు మెసేజ్ చేస్తే ఆ కంప్యూటర్ మీతో రొమాంటిక్ మాటలు మాట్లాడుతుంది. ఏంజెలా యు అనే కో-సీఈఓ గతంలో 40 లక్షల మందిని ఇలాగే డిజిటల్ బానిసలను చేశారు. మనుషుల మధ్య ఉండాల్సిన సహజమైన ప్రేమను, అభిమానాన్ని ఈ ఏఐ పాత్రలు దోచుకుంటున్నాయి. ఇది కేవలం టెక్నాలజీ కాదు… మనుషుల ఒంటరితనాన్ని సొమ్ము చేసుకునే ఒక చీకటి మార్గం.

తెర వెనుక నిశ్శబ్దం
ఈ విధ్వంసం వెనుక రూయ్ జంగ్, షిపెంగ్ ఫాన్ లాంటి వారు ఉన్నారు. వీరు సినిమా స్కూల్ నుంచి వచ్చే నిరుద్యోగులను వాడుకుని వారి సృజనాత్మకతను ఏఐ యంత్రాల్లోకి ఎక్కిస్తున్నారు. ఒక్కసారి ఈ టెక్నాలజీ అలవాటైతే రేపు మన తెలుగు ఇండస్ట్రీలో లైట్ మెన్ ఉండడు, మేకప్ గీతలు ఉండవు, కెమెరా పట్టుకునే చేతులు కనిపించవు. అంతా ఒక నిశ్శబ్దమైన సాఫ్ట్‌వేర్ గదిలో జరిగిపోతుంది. 59 సిరీస్‌లతో మొదలైన ఈ ప్రవాహం రేపు మన సంప్రదాయ సినిమాలను కూడా ముంచేయబోతోంది.

లాభమే దైవమా?
చైనాలో 58,000 కోట్ల రూపాయలకు చేరిన ఈ మార్కెట్… 2030 నాటికి 1.68 లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరుతుందని అంచనా. ‘బ్రదర్స్ బై ఛాన్స్, లవర్స్ బై ఛాయిస్’ వంటి కథలు కేవలం మనుషుల బలహీనతలను టార్గెట్ చేస్తున్నాయి. కళ అనేది ఒక తపస్సు నుంచి కాకుండా… ఒక అల్గారిథమ్ నుంచి పుట్టినప్పుడు అది తన పవిత్రతను కోల్పోతుంది. చైనా వాడు అమ్ముతున్న ఈ డిజిటల్ వినోదం రేపు మన తెలుగు తెరపై వెలిగే నక్షత్రాలను మసకబార్చేలా ఉంది. వెండితెరపై ఇప్పుడు రంగులు కాదు… ఒక రకమైన శూన్యం అలుముకుంటోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *