మెట్లు ఎక్కండి… స్నానం చేయకండి – ఇరాన్ యుద్ధం: విలవిలలాడుతున్న ప్రపంచం

Iran war --- Oil crisis effect
  • కార్లు వాడకండి… ఏసీలు వేయకండి
  • ఆయిల్ ఎఫెక్ట్… దక్షిణ కొరియాలో ఆంక్షలు
  • థాయ్‌లాండ్‌లో టీషర్ట్ పాలన… సూట్లకు బ్రేక్
  • ఏకంగా ఎమర్జెన్సీనే విధించిన ఫిలిప్పీన్స్‌
  • వారానికి 4 రోజుల పనిదినాలపై సమాలోచన
  • ఆసియాలో ఆర్థిక విలయం… కరోనా పరిస్థితి

సహనం వందే, హైదరాబాద్:

అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య చెలరేగుతున్న యుద్ధ జ్వాలలు ఆసియా ఆర్థిక వ్యవస్థను ఊపిరాడకుండా చేస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరా లింక్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. దిగుమతులపై ఆధారపడిన దేశాలు ఇప్పుడు చీకట్లోకి జారుకుంటున్నాయి. ఇది కేవలం ధరల పెరుగుదల మాత్రమే కాదు… ఒక మహా విపత్తు.

ఎమర్జెన్సీలో ఫిలిప్పీన్స్
యుద్ధం నాలుగో వారంలోకి చేరడంతో ఆసియా దేశాలు అల్లాడుతున్నాయి. ఫిలిప్పీన్స్ ఏకంగా జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. తన ముడి చమురు అవసరాలలో 98 శాతం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకునే ఈ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడ చమురు నిల్వలు కేవలం 45 రోజులకు మాత్రమే సరిపోతాయి. గ్యాస్ ధరలు రెట్టింపు కావడంతో ప్రభుత్వం వారానికి 4 రోజుల పనిదినాలను పరిశీలిస్తోంది. చమురు నిల్వలను అక్రమంగా దాచిపెట్టే వారిపై కఠిన చర్యలకు ఆదేశాలిచ్చింది.

కొరియాలో వింత ఆంక్షలు
దక్షిణ కొరియాలో పరిస్థితులు అత్యంత విచిత్రంగా మారాయి. విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ప్రజలు తమ ఫోన్లను కేవలం పగటిపూటే ఛార్జింగ్ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. చమురు కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో స్నానం చేసే సమయాన్ని కూడా తగ్గించుకోవాలని సూచించింది. విద్యుత్ ఉత్పత్తికి వాడే చమురు నిల్వలు అడుగంటుతుండటంతో ప్రభుత్వం ఈ కఠిన ఆంక్షలు విధించింది.

థాయ్‌లాండ్‌లో టీషర్ట్ పాలన
థాయ్‌లాండ్ తన ముడి చమురు అవసరాల కోసం 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. గల్ఫ్ సరఫరా ఆగిపోవడంతో అక్కడ కేవలం రెండు నెలల నిల్వలు మాత్రమే ఉన్నాయి. అందుకే ప్రభుత్వం కార్యాలయాల్లో సూట్లు వేయకూడదని కేవలం టీషర్ట్లుమాత్రమే ధరించాలని నిబంధన పెట్టింది. సూట్లు వేస్తే ఉక్కపోత వల్ల ఏసీలు ఎక్కువగా వాడాల్సి వస్తుంది కాబట్టి టీషర్ట్లు వేసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల ఏసీల వాడకాన్ని తగ్గించవచ్చని భావిస్తోంది. లిఫ్టుల వినియోగం తగ్గించి మెట్లు ఎక్కాలని ప్రజలకు పిలుపునిచ్చింది. చమురు ఎగుమతులను ఆ దేశం పూర్తిగా నిలిపివేసింది.

Iran war - Oil crisis

హార్ముజ్ దిగ్బంధం దెబ్బ
ప్రపంచ ఇంధన సరఫరాలో 20 శాతానికి దారితీసే హార్ముజ్ జలసంధిని టెహ్రాన్ మూసివేయడం ఆసియాను దెబ్బతీసింది. ఆసియా దేశాలు తమ చమురు అవసరాల కోసం 60 శాతం మధ్య ప్రాచ్యంపైనే ఆధారపడుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా జలసంధిలో ట్రాన్సిట్ ఫీజుగా ఒక్కో ప్రయాణానికి సుమారు 16 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. 100 శాతం దిగుమతులపై ఆధారపడే సింగపూర్ వంటి దేశాలు విలవిలలాడుతున్నాయి. కొన్ని దేశాలు కార్ల వినియోగాన్ని తగ్గించాలని భావిస్తున్నాయి.

ధరల చుక్కల మంట
ముడిచమురు ధరలు బ్యారెల్ 150 డాలర్ల వరకు పెరగవచ్చని ఉడ్ మెకెంజీ సంస్థ హెచ్చరించింది. అంటే భారత కరెన్సీలో ఇది సుమారు 12,500 రూపాయలకు పైమాటే. ఏడాది పొడవునా సగటు ధర 125 డాలర్లు అంటే సుమారు 10,400 రూపాయలుగా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తప్పదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ముగింపుపై ఆశగా ఉన్నా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. వియత్నాం, ఆస్ట్రేలియా దేశాల్లో విమాన సర్వీసులు ఇప్పటికే నిలిచిపోయాయి. 40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల చేసినా ఈ సంక్షోభం తీరదని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి.

Iran war - Oil crisis

సామాన్యుడి కన్నీరు
వియత్నాంలో కేవలం 20 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. కంబోడియా రాజధాని నొమ్ పెన్ వీధుల్లో వాహనాలు గంటల కొద్దీ క్యూ కడుతున్నాయి. అక్కడ ఎల్‌పీజీ ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. థాయ్‌లాండ్‌లోని రైతులు సాగును ఆపేయాలని ఆలోచిస్తున్నారు. ట్రాక్టర్లకు ఇంధనం లేకపోతే వ్యవసాయం సాధ్యం కాదని అంటున్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వం మధ్య తరగతి కుటుంబాలకు వారం వారం 2,500 రూపాయల వరకు ఆర్థిక సాయం ప్రకటించింది. బ్రూనై, మలేషియా వంటి చమురు ఎగుమతి దేశాలకు మాత్రం ఇది కొంత లాభసాటిగా మారింది.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *