తెలుపు బలుపు – బ్రిటన్ గడ్డపై జాత్యహంకారం పడగ

Attacks on Indians
  • రంగు చూసి రెస్టారెంట్లపై దాడులు
  • భారతీయులు, నల్లజాతి ప్రజలే టార్గెట్
  • గత ఏడాది 12,791 ఇమ్మిగ్రేషన్ దాడులు

సహనం వందే, లండన్:

బ్రిటన్ గడ్డపై జాత్యహంకారం పడగ విప్పుతోంది. ముసుగులో ఉన్న వివక్ష ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ కంప్లయన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐస్) దాడుల రూపంలో బయటపడుతోంది. ముఖ్యంగా ఇండియన్లు, నల్లజాతి, ఆసియా మూలాలున్న వారు నడుపుతున్న వ్యాపారాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. చట్టం పేరుతో కేవలం ఒక వర్గాన్నే భయభ్రాంతులకు గురిచేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లేబర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది.

రంగు చూసి వేటు
మందిరా మోయిత్రా సర్కార్ అనే భారతీయ సంతతి మహిళ నడుపుతున్న ‘మందిరాస్ కిచెన్’ పై జరిగిన దాడి ఇందుకు నిదర్శనం. సర్రీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్‌లోకి 11 మంది అధికారులు చొరబడ్డారు. అక్కడ పనిచేస్తున్న వారందరూ గోధుమ రంగు చర్మం కలిగిన వారే కావడం గమనార్హం. వారిని చూడగానే అధికారులు అక్రమ వలసదారులనే ముద్ర వేశారు. కనీసం వారెంట్ లేకుండానే కిచెన్ లోకి దూరి పాస్‌పోర్టులు అడిగారు. చదువుకునే విద్యార్థులను కూడా అనుమానంగా చూడటం అధికారుల జాత్యహంకార బుద్ధిని బయటపెట్టింది.

Britain attacks on Indians...

తూర్పు లండన్‌లో వివక్ష
లండన్‌లోని ‘ఫేసింగ్ హెవెన్’ రెస్టారెంట్ అనుభవం మరీ దారుణం. అక్కడ పనిచేస్తున్న తెల్లజాతి సిబ్బందిని వదిలేసి కేవలం విదేశీ మూలాలున్న వారిని మాత్రమే అధికారులు ప్రశ్నించారు. బెంగాలీ కార్మికులు ఉన్నారనే నెపంతో అక్కడ రచ్చ చేశారు. అధికారుల తీరు చూస్తుంటే వారు అక్రమ వలసల కంటే ఎక్కువగా జాత్యహంకారంతోనే కదులుతున్నారని అర్థమవుతోంది. రంగును బట్టి మనుషులను వేరు చేయడం బ్రిటన్ ప్రజాస్వామ్యానికే మచ్చగా మారుతోంది. ఇది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేయడమేనని అక్కడి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అజ్ఞాత వేధింపుల పర్వం
చాలా దాడులు కేవలం అజ్ఞాత వ్యక్తుల ఫిర్యాదుల ఆధారంగానే జరుగుతున్నాయి. వ్యాపార పోటీదారులు లేదా గిట్టని వారు చేసే ఆన్ లైన్ ఫిర్యాదులను ‘ఐస్’ అధికారులు అస్త్రంగా వాడుకుంటున్నారు. ఎటువంటి ప్రాథమిక విచారణ లేకుండానే ఇంటెలిజెన్స్ పేరుతో రెస్టారెంట్లపై పడుతున్నారు. 2024 జూలై నుండి 17,400 పైగా దాడులు జరగడం వెనుక ఉన్నది అక్రమ వలసల నిరోధం కంటే పక్కా ప్రణాళికతో చేస్తున్న వివక్షేనన్న ఆరోపణలు ఉన్నాయి. టిక్ టాక్ వంటి సోషల్ మీడియాలో ఈ దాడులను ప్రదర్శించడం కూడా ఒక వర్గాన్ని భయపెట్టడానికే అనిపిస్తోంది.

ప్రదర్శన కోసమే అరెస్టులు
గణాంకాలను పరిశీలిస్తే అధికారుల అసలు రంగు బయటపడుతుంది. 2025లో 12,791 దాడులు చేసి 8,971 మందిని అరెస్టు చేశారు. కానీ వీరిలో కేవలం 1,087 మంది మాత్రమే దేశం విడిచి వెళ్లారు. మిగిలిన వారందరూ చట్టబద్ధంగా ఉంటున్నవారే కావడం విశేషం. అంటే కేవలం ప్రజలను భయపెట్టడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి విదేశీయులను బలిపశువులను చేస్తున్నారు. అరెస్టు చేసిన వారిలో ముప్పావు వంతు మందిని వదిలేయాల్సి రావడం అంటే ఆ దాడుల్లో ఎటువంటి పస లేదని స్పష్టమవుతోంది.

చట్టం ముసుగులో దాడి
2003 లైసెన్సింగ్ చట్టం అధికారులకు ఒక ఆయుధంగా మారింది. మద్యం అమ్మే చోట తనిఖీ చేసే అధికారాన్ని వాడుకుని కిచెన్ లో ఉన్న విదేశీయులను వేధిస్తున్నారు. 2025లో 28 శాతం దాడులు కేవలం రెస్టారెంట్లు, కేఫ్ లో పైనే జరిగాయి. ఇతర రంగాల్లో లేని ఈ ఆసక్తి కేవలం విదేశీయులు ఎక్కువగా ఉండే చోటనే కనిపించడం వివక్షకు పరాకాష్ట. ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు, జాత్యహంకార గొడవలు జరుగుతున్న తరుణంలోనే ఈ దాడులు తీవ్రతరం కావడం గమనార్హం. విదేశీయులు నడుపుతున్న చిన్న వ్యాపారాలను దెబ్బతీసేలా ఈ దాడులు సాగుతున్నాయి. ఇది కేవలం అక్రమ వలసల సమస్య కాదు… బ్రిటన్ వ్యవస్థలో పేరుకుపోయిన జాత్యహంకార మూలాల నుంచి పుట్టిన దాడులని సామాజిక వేత్తలు మండిపడుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *