రక్తమే ఆయుధం – మళ్లీ పురుడు పోసుకుంటున్న నాజీయిజం

Najiism
  • వలసవాదంపై ఉక్కుపాదం… అదే సిద్ధాంతం
  • జాతి వివక్షను ఆయుధంగా మలిచే థియరీ
  • రాబోయేది రాక్షస రాజ్యం…20 ఏళ్లలో నాశనం
  • ప్రపంచ ప్రసిద్ధ ‘ది గార్డియన్’ పత్రిక విశ్లేషణ

సహనం వందే, హైదరాబాద్:

ప్రపంచం మరో రెండు దశాబ్దాల్లో భయంకరమైన చీకటి రోజులను చూడబోతోంది. మనం గర్వంగా చెప్పుకునే ప్రజాస్వామ్యం కూలిపోయి దాని స్థానంలో జాతి వివక్షతో కూడిన నియంతృత్వ రాజ్యాలు రాజ్యమేలే ప్రమాదం పొంచి ఉంది. మనుషుల మధ్య పెంచుతున్న ద్వేషమే ఇందుకు ఇంధనంగా మారుతోంది. అధికారం కోసం పాలకులే ప్రజల మధ్య కుల, మత, జాతి గోడలను నిర్మిస్తున్నారు. ఇది కేవలం హెచ్చరిక కాదు… మారుతున్న ప్రపంచ రాజకీయాల వెనుక ఉన్న కఠోర వాస్తవం.

నియంతృత్వానికి గమ్యస్థానం
రాబోయే 20 ఏళ్లలో ఐరోపా సహా ప్రపంచంలోని మెజారిటీ దేశాలు నియంతృత్వ గుప్పిట్లోకి వెళ్లే అవకాశం ఉంది. మనం రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి వచ్చాం. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం నుంచి తిరిగి నియంతృత్వం వైపు వెనక్కి వెళ్తున్నాం. తెలియని వ్యక్తులపై భయం పెంచడం ద్వారా ఈ మార్పు జరుగుతోంది. అమెరికాలో ట్రంప్ నుంచి హంగేరీలో ఆర్బన్ వరకు, బ్రిటన్‌లో రిఫార్మ్ యూకే వరకు అందరిదీ ఇదే బాట. జాతి వివక్షను ఆయుధంగా మలచుకుని వ్యవస్థలను గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. తెల్లజాతీయులను వలసదారులు వచ్చి ఆక్రమిస్తున్నారనే గ్రేట్ రీప్లేస్‌మెంట్ థియరీ ఇప్పుడు ప్రధాన రాజకీయ అజెండాగా మారింది. వలసదారుల వల్ల స్థానిక సంస్కృతి నాశనమవుతోందని అబద్ధాలు చెబుతున్నారు.

Adolf   Hitler

హిట్లర్ వారసత్వం… జెనెటిక్స్ విభజన
రాజకీయ నాయకులు ఇప్పుడు జెనెటిక్స్, రక్తం అనే పదాలను ఆయుధాలుగా వాడుతున్నారు. వలసదారులు దేశ రక్తాన్ని విషపూరితం చేస్తున్నారని 2024 ఎన్నికల ప్రచారంలో ట్రంప్ లాంటి నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించారు. జన్యువుల పేరుతో మనుషులను వేరు చేస్తూ అధికారం కోసం సామాజిక విధ్వంసానికి తెరలేపుతున్నారు. నాజీ కాలం నాటి ఆలోచనలే ఇప్పుడు ఆధునిక రూపంలో వస్తున్నాయి. హిట్లర్ నాడు రక్తం విషపూరితం అవుతోందని వాదించేవాడు. నేడు అదే భాషను ఆధునిక నేతలు వాడుతున్నారు. ఆఫ్రికా, ఆసియా నుంచి వచ్చే వలసదారులు దేశాన్ని పాడు చేస్తున్నారని ట్రంప్ లాంటి వారు ప్రకటిస్తున్నారు.

వివక్ష వెనుక వ్యాపారం
వలసదారుల సమస్యను పాలకులు కావాలనే సజీవంగా ఉంచుతున్నారు. ఒకవైపు యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలను సృష్టించి వలసలను ప్రోత్సహిస్తారు. మరోవైపు వారే దేశానికి ముప్పు అని ప్రచారం చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రజల అసలు సమస్యలైన పేదరికం, అసమానతల నుంచి దృష్టి మళ్లుతుంది. ఇది ఒక రాజకీయ వ్యాపారం. జనం ఒకరినొకరు శత్రువులుగా భావిస్తేనే నియంతలు తమ పీఠాలను కాపాడుకోగలరు.

మానవత్వం మనుగడ
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి. ఒక సమూహం లాభపడితే మరో సమూహం నష్టపోతుందనే అపోహను తొలగించాలి. నియో లిబరల్ పెట్టుబడిదారీ విధానం సృష్టించిన అంతరాలను తగ్గించకపోతే ఈ నియంతృత్వ పోకడలు ఆగవు. అపరిచితులను ప్రమాదకారులుగా చూపించే వారే అసలైన ప్రమాదకారులని ప్రజలు గుర్తించాలి. అప్పుడే రాబోయే 20 ఏళ్లలో ప్రపంచం నియంతృత్వ కోరల్లో చిక్కకుండా ఉంటుంది.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *