పాకిస్తానీ నేతకు ధురంధర్ దడ – భారత్ గూఢచారి అంటూ పాక్ లో విమర్శలు

Dhurandhar Jamali role
  • జమీల్ జమాలీ పాత్రతో గబోల్ కు చిక్కులు
  • సినిమా తెచ్చిన తంటాతో పాక్ నేత గుబులు
  • మరోవైపు నిజమైన ధురంధర్ వర్ధంతి
  • అశోకచక్ర అందజేసి గుర్తించిన కేంద్రం

సహనం వందే, హైదరాబాద్:

వెండితెర మీద గూఢచారి సాహసాలు చూసి జనం ఈలలు వేస్తారు. కానీ అదే వెండితెర సృష్టించిన సెగ ఇప్పుడు సరిహద్దు అవతల ఒక రాజకీయ నేతను వణికిస్తోంది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ స్పై థ్రిల్లర్ ఒకవైపు వాస్తవ వీరుడి త్యాగాన్ని స్మరింపజేస్తుంటే… మరోవైపు పాకిస్థాన్ రాజకీయాల్లో పెను తుఫాను రేపుతోంది. రీల్ లైఫ్ పాత్రకు, రియల్ లైఫ్ హీరోకు మధ్య ఉన్న ఈ ఆసక్తికర పోలికలే ఇప్పుడు హాట్ టాపిక్.

గబోల్ గడగడ
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నేత నబీల్ గబోల్ ఇప్పుడు ఊపిరి సలపని స్థితిలో ఉన్నారు. ధురంధర్ మొదటి భాగం వచ్చినప్పుడు అందులోని జమీల్ జమాలీ పాత్ర తనదేనని ఆయన మురిసిపోయారు. టీవీ ఇంటర్వ్యూలలో ఆ పాత్ర తన జీవితం ఆధారంగానే తీశారని ప్రచారం చేసుకున్నారు. జనం తనను జమీల్ జమాలీ అని పిలుస్తుంటే గర్వంగా ఫీలయ్యారు. కానీ ధురంధర్ 2 విడుదలయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. క్లైమాక్స్ లో జమీల్ జమాలీ కూడా భారత్ పంపిన గూఢచారి అని తేలుతుంది. 45 ఏళ్లుగా అక్కడి రాజకీయాల్లో కీలకంగా ఉన్న విషయాన్ని ఆయన చెప్తుంటాడు. దీంతో ఆ పాకిస్తానీ నాయకుడు గబోల్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నాడు.

నిఘా నీడలో గబోల్…
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న అస్థిర పరిస్థితుల వల్ల గబోల్ భయం మరింత పెరిగింది. గతంలో ఆ పాత్ర తనదేనని ఒప్పుకోవడంతో ఇప్పుడు పాక్ ఆర్మీ, అక్కడి నిఘా సంస్థలు ఆయనపై కన్నేసే అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కేవలం పాపులారిటీ కోసం సినిమా పాత్రను ఓన్ చేసుకున్న నేతకు ఇప్పుడు అదే పాత్ర ప్రాణసంకటంగా మారింది. సినిమా సృష్టించిన ఈ వివాదం పాక్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Dhurandhar Mohit Sharma

రియల్ ధురంధర్ వర్ధంతి…
సినిమాలో రణవీర్ గూఢచారిగా కనిపిస్తుంటే నిజ జీవితంలో అసలైన ధురంధర్ మేజర్ మోహిత్ శర్మ. శనివారం ఆయన వర్ధంతి సందర్భంగా దేశం ఆయనను స్మరించుకుంటోంది. ధురంధర్ మోహిత్ శర్మ బయోపిక్ కాదని దర్శకుడు చెప్పినా ఆ పాత్రలోని సాహసాలు ఆయనకు దగ్గరగా ఉంటాయి. 1978 జనవరి 13న హర్యానాలోని రోహ్‌తక్‌లో జన్మించిన మోహిత్‌ను ఇంట్లో చింటూ అని పిలిచేవారు. చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలనే లక్ష్యంతో ఇంజినీరింగ్ సీటును కూడా వదులుకుని ఎన్డీఏలో చేరారు.

అండర్ కవర్ ఆపరేషన్
డిసెంబర్ 1999లో అధికారిగా బాధ్యతలు చేపట్టిన మోహిత్ శర్మ 1వ పారా స్పెషల్ ఫోర్సెస్‌లో చేరారు. 2004లో ఇఫ్తికార్ భట్ అనే పేరుతో ఉగ్రవాద గ్రూపుల్లోకి చొరబడి కీలక సమాచారం సేకరించారు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం అంటే 2009 మార్చి 21న కశ్మీర్‌లోని కుప్వారాలో జరిగిన పోరులో ఆయన వీరమరణం పొందారు. ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి తన సహచరులను రక్షించి దేశం కోసం అత్యున్నత త్యాగం చేశారు. ఆయన ధైర్యానికి గుర్తింపుగా ప్రభుత్వం అశోక చక్ర ప్రకటించింది.

సినిమా సెన్సేషన్
ఆదిత్య ధర్ దర్శకత్వంలోని ఈ స్పై థ్రిల్లర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్‌లో ఈ సినిమాపై నిషేధం విధించినప్పటికీ అక్కడి జనం దొంగచాటుగా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. పాక్ గడ్డపై ఉగ్రవాదాన్ని రూపుమాపే గూఢచారి కథ కావడంతో ఇది అక్కడి పాలకులకు కంటగింపుగా మారింది. సినిమాలోని జమీల్ జమాలీ పాత్ర చుట్టూ తిరుగుతున్న వివాదం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. రీల్ హీరో రణవీర్ నటనకు భారతీయులు బ్రహ్మరథం పడుతున్నారు.

త్యాగానికి నివాళి
దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ మోహిత్ శర్మ సాహసగాథ మధ్య ధురంధర్ 2 నిలిచింది. రాజేంద్ర ప్రసాద్ శర్మ, సుశీల శర్మ దంపతుల రెండో సంతానమైన మోహిత్ శర్మ కథ నేటి యువతకు స్ఫూర్తిదాయకం. అత్యుత్తమ ప్రతిభతో బయటకు వచ్చి దేశ రక్షణలో అసాధారణ పోరాటం చేసిన ఆయన అసలైన హీరో. వెండితెర మీద కనిపిస్తున్న ధురంధర్ వెనుక ఇలాంటి ఎందరో వీరుల త్యాగాలు దాగి ఉన్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *