- నిలకడకు నిదర్శనం.. ‘సహనం వందే’ ప్రస్థానం
- ఏడాది ప్రయాణం పూర్తి… విభిన్నాంశాల వేదిక
- నిష్పక్షపాత జర్నలిజమే మా వైఖరి
కళ్లు మూసి తెరిచేలోగా వార్తలు మారిపోయే కాలమిది. సముద్రపు అలల కంటే వేగంగా సమాచారం ముంచెత్తుతోంది. కానీ ఆ అంతులేని హోరులో నిజమైన నిశ్శబ్దం ఎక్కడ? మనసును తాకే మనిషి కథ ఎక్కడ? సరిగ్గా ఏడాది క్రితం ఒక చిన్న విత్తనం పడింది. అదే సహనం వందే. ఇది కేవలం వార్తా సంస్థ కాదు. అబద్ధాల అడవిలో నిజాయితీగా వేసిన ఒక అడుగు. నిరంతరం ప్రవహించే వార్తల వెల్లువలో తనదైన ముద్ర వేస్తూ… సామాన్యుడి గొంతుకగా మారి నేడు మొదటి వార్షికోత్సవం జరుపుకుంటోంది.
భిన్నమైన బాట
వార్త అంటే కేవలం రాజకీయం కాదు. రొటీన్ సమాచారాన్ని వడ్డించడం అసలే కాదు. సహనం వందే ప్రారంభం నుంచే ఒక స్పష్టమైన రేఖ గీసుకుంది. ప్రతిరోజూ మూడు నాలుగు కథనాలను మాత్రమే అందిస్తోంది. కానీ ఆ కథనాలు ఎంతో ప్రత్యేకం. గంటల వ్యవధిలో కరిగిపోయే వార్తలకు ఇక్కడ చోటు లేదు. సమాజానికి పనికొచ్చే విభిన్న కోణాలను ఇది ఆవిష్కరిస్తోంది. సామాన్య ప్రజల ఆలోచనలకు పదును పెడుతోంది. గత ఏడాది కాలంగా ఈ పద్ధతిని నిలకడగా కొనసాగిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ గొంతుక
స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ సమస్యలపై లోతైన విశ్లేషణలు అందిస్తోంది. తెలుగు పాఠకులకు ప్రపంచ పరిజ్ఞానాన్ని చేరువ చేస్తోంది. విదేశీ పరిణామాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తోంది. కేవలం రెండు రాష్ట్రాల వార్తలే కాకుండా గ్లోబల్ అంశాలను చర్చకు తెస్తోంది. దీనివల్ల పాఠకులకు విస్తృతమైన అవగాహన కలుగుతోంది. జర్నలిజంలో ఇదొక కొత్త ఒరవడి. ఇలాంటి కోణం తెలుగు మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంది.

నిష్పాక్షిక నినాదం
ఏ పార్టీకి కొమ్ముకాయడం లేదు. ఏ నాయకుడిని నెత్తిన పెట్టుకోవడం లేదు. నిర్భయంగా వాస్తవాలను వెల్లడిస్తోంది. స్పష్టత, నిష్పాక్షికత దీని ప్రధాన బలం. రాజకీయ రంగు పూయకుండా వార్తను వార్తలాగే చూస్తోంది. అందుకే కొద్దిగా ఉన్న మా పాఠకుల్లో ఈ వేదికపై నమ్మకం పెరిగింది. చిన్న స్థాయి ఒక ఆశయంతో ప్రారంభమైన ఒక కొత్త మీడియా సంస్థ ఏడాది పాటు నిలబడటం సామాన్యం కాదు. ప్రజలతో ఉన్న అనుబంధమే దీనిని ముందుకు నడిపిస్తోంది. ఏ వైపు మొగ్గు చూపని జర్నలిజమే దీని ఆయుధం.
మనసు మాట
ఇక్కడ కేవలం సమాచారం మాత్రమే దొరకదు. మనుషుల మధ్య బంధాలు, భావోద్వేగాల గురించి చర్చిస్తోంది. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక కథనాలు అందిస్తోంది. జీవనశైలిలోని మార్పులు ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో వివరిస్తోంది. శాస్త్రీయ విశ్లేషణను సామాన్యుడి అనుభవాలతో ముడిపెడుతోంది. దీనివల్ల వార్త అనేది ఒక పాఠంలా మారుతోంది. సామాజిక సంబంధాల ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తోంది. మనుషులను మనుషులుగా ప్రేమించే తత్వాన్ని ఇది నేర్పుతోంది.
సాహస యాత్ర
ఆధునిక మీడియాలో సెన్సేషనలిజం పెరిగిపోయింది. కానీ సహనం వందే మాత్రం బాధ్యతాయుత జర్నలిజం వైపు నడుస్తోంది. బుద్ధిజీవులకు, సామాన్యులకు మధ్య వారధిగా నిలుస్తోంది. ఒక ఏడాది ప్రస్థానం కేవలం ప్రారంభం మాత్రమే. మున్ముందు ఇంకా ఎన్నో మైలురాళ్లను అధిగమించాల్సి ఉంది. బాధ్యత గల మీడియాకు ఇప్పటికీ సమాజంలో చోటు ఉందని ఇది నిరూపించింది. మరింత అర్థవంతమైన వార్తలతో ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం. విలువలతో కూడిన జర్నలిజానికి ఇది నిలువుటద్దం.
రోహిణి, ఎడిటర్