అఖిలాంధ్ర సేవలో ‘నిఖిల’ – ఎంపీ అప్పలనాయుడు కూతురి పేరుతో ట్రస్ట్

Nikhila
  • విద్య, వైద్యం కోసం సేవా కార్యక్రమాలు
  • శ్రీకారం చుట్టిన కలిశెట్టి కుటుంబ సభ్యులు
  • మూడో ఆడబిడ్డ జన్మిస్తే 50 వేల సాయం

సహనం వందే, రణస్థలం:

ఎంపీగా తన గెలుపు వెనుక ఐదుగురు మహిళల ప్రేరణ ఉందని కలిశెట్టి అప్పలనాయుడు బహిరంగంగా ప్రకటించారు. తన కుమార్తె నిఖిల పేరు మీద ఆయన నెలకొల్పిన ట్రస్ట్ ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ పరిధిలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కేవలం రాజకీయమే కాదు సామాజిక బాధ్యతలో కూడా తాము ముందుంటామని ఆయన నిరూపిస్తున్నారు.

నిఖిల పేరిట కొత్త ఆశలు
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సతీమణి ప్రభ నాయుడు ఆదివారం నిఖిల చారిటబుల్ ట్రస్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ట్రస్ట్ పేరు వెనుక ఒక తండ్రి ప్రేమతో పాటు సమాజం పట్ల ఒక బలమైన సంకల్పం దాగి ఉంది. తన కుమార్తె నిఖిల నాయుడు పేరుతో ఏర్పడిన ఈ ట్రస్ట్ ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ పరిధిలో సేవా కార్యక్రమాలను ఉధృతం చేయనుంది.

నాలుగు తరాల మహిళా శక్తి
ట్రస్ట్ ప్రారంభోత్సవం వెనుక ఒక ప్రత్యేకత ఉంది. చైర్ పర్సన్‌గా ప్రభ నాయుడు, డైరెక్టర్‌గా నిఖిలా నాయుడు వ్యవహరించనున్నారు. వీరికి తోడుగా ఎంపీ తల్లి సూరప్పమ్మ, ఎంపీ సోదరి దమయంతి ఇందులో భాగస్వాములయ్యారు. ఇలా నాలుగు తరాలకు చెందిన మహిళలను ఏకం చేయడం ద్వారా ఎంపీ ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. మహిళా సాధికారతకు తమ కుటుంబం నుంచి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

విజయం వెనుక మహిళల పాత్ర
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రణస్థలంలో జరిగిన వేడుకల్లో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందన్న నానుడికి తానే నిదర్శనమని ఆయన చెప్పారు. తన తల్లి, భార్య, రాజకీయ గురువు కావలి ప్రతిభా భారతి, సైన్స్ టీచర్ సత్యవతి, కుమార్తె నిఖిల నాయుడు తన జీవిత గమనాన్ని మార్చారని ఆయన గుర్తు చేసుకున్నారు.

మహిళలకు చెక్కులు అందజేస్తున్న ఎంపీ అప్పలనాయుడు దంపతులు

ఆడబిడ్డలకు భరోసా
ట్రస్ట్ ఆధ్వర్యంలో గతేడాది ప్రకటించిన పథకాన్ని ఆయన అమలు చేస్తున్నారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో మూడో ఆడబిడ్డ జన్మించిన కుటుంబానికి 50,000 రూపాయలను ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ఈ చెక్కులను ఎంపీ దంపతులు అందించారు. ఆడబిడ్డల సంక్షేమం కోసం ప్రభుత్వం కూడా అన్ని విధాలా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

గోసంరక్షణకు చేయూత
కేవలం మనుషులకే కాకుండా మూగజీవాల సంరక్షణకు కూడా ట్రస్ట్ ప్రాధాన్యం ఇస్తోంది. రణస్థలం మండలం కోష్ట వద్ద ఉన్న గోశాలను ఎంపీ దంపతులు సందర్శించారు. అక్కడ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోశాల నిర్వాహకులకు నిఖిల చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ప్రభ నాయుడు 11,111 రూపాయల మొదటి చెక్కును అందజేశారు.

సరికొత్త సంకల్పం
ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అప్పలనాయుడు వెల్లడించారు. ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మగ బిడ్డ కలిగిన దంపతులకు ఆవు, దూడను అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కొనసాగుతోందని ఆయన వివరించారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని ఆయన భావిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *