- అన్నదాత సొమ్ముతో బాండ్ల అక్రమాలు
- అస్థిర బాండ్ల వల… గ్రామీణ నిధుల మళ్లింపు
- ప్రమాదకర వ్యూహం… రైతు భవిత నాశనం
- పారదర్శకత లేని ఒప్పందాలతో పెనుముప్పు
సహనం వందే, హైదరాబాద్:
రైతు ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఇప్పుడు అసాధారణమైన ఆర్థిక జూదాన్ని ఎంచుకుని విమర్శలపాలవుతోంది. దశాబ్దాలుగా రైతులకు చౌకగా రుణాలను అందిస్తూ వచ్చిన ఈ సంస్థ… తాజాగా అంతర్జాతీయ బాండ్ల మార్కెట్‌లో సంక్లిష్టమైన ‘సావరిన్ బాండ్-లింక్డ్ స్వైప్’ లావాదేవీలకు తెరతీయడం వ్యవసాయ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. క్షేత్రస్థాయిలో రైతులకు అప్పులు దొరక్క అల్లాడుతుంటే నాబార్డు తన వద్ద ఉన్న నిధులను అస్థిరమైన గ్లోబల్ ఫైనాన్షియల్ డెరివేటివ్‌లలో పెట్టుబడి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాబార్డు కొత్త ఆర్థిక వ్యూహం
గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయాల్సిన నాబార్డు సరికొత్తగా సావరిన్ బాండ్లతో అనుసంధానమైన స్వైప్ లావాదేవీల్లోకి అడుగుపెట్టింది. సాధారణంగా బ్యాంకులు వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి స్వైప్ లావాదేవీలు చేస్తాయి. కానీ నాబార్డు ఇప్పుడు తన నిధులను ప్రభుత్వ బాండ్ల వడ్డీ రేట్లతో ముడిపెట్టి ఒక రకమైన పందెం కాస్తోంది. ఇలాంటి సంక్లిష్టమైన ఆర్థిక మార్గాలను ఎంచుకోవడం రైతుల రుణాల కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
75 వేల కోట్ల నిధులపై గండం
ఈ నిర్ణయం వల్ల క్షేత్రస్థాయిలో రైతులకు అందే రుణాల లభ్యతపై తీవ్ర ప్రభావం పడనుంది. బ్లూమ్‌బెర్గ్ సమాచారం ప్రకారం… నాబార్డు ఇప్పుడు తన భారీ నిధులను 10 నుంచి 15 శాతం మేర ఇటువంటి బాండ్ల లావాదేవీలకు మళ్లించే అవకాశం ఉంది. అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయల నుంచి 75,000 కోట్ల రూపాయల వరకు నిధులు వ్యవసాయ రంగం నుండి పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. రైతులు బ్యాంకుల చుట్టూ అప్పుల కోసం తిరుగుతుంటే సంస్థ మాత్రం మార్కెట్ లాభాల కోసం వేచిచూస్తోంది. అప్పుల ఊబిలో ఉన్న రైతుకు దక్కాల్సిన ప్రాధాన్యత నాబార్డు కారిడార్లలోని ఆర్థిక జూదగాళ్లకు ఎలా దక్కింది? రైతులకు ఇచ్చే సబ్సిడీల మీద, రుణ వడ్డీ రేట్ల మీద ఈ లావాదేవీల వల్ల ఏర్పడే భారాన్ని ఎవరు భరిస్తారు?
ప్రమాదపు అంచున గ్రామీణ భారతం
రైతుల జీవనోపాధిని పణంగా పెట్టి నాబార్డు చేస్తున్న ఈ ఆర్థిక అడ్వెంచర్ దేశీయ వ్యవసాయ రంగాన్ని ఎటువైపు తీసుకువెళుతుందోనన్న భయం కలుగుతోంది. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్ వ్యతిరేకిస్తే ఆ నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ ప్రభుత్వ నిధులపైనే ఆధారపడాల్సి వస్తుంది. అంటే రైతు కష్టార్జితాన్ని రిస్కులో పెట్టి చివరకు సామాన్యుడిపైనే భారం వేయడం. ఇది ప్రజాధనంతో ఆడుకునే అత్యంత అనైతికమైన పద్ధతి.
ప్రభుత్వ జోక్యం అత్యవసరం
నాబార్డును వెంటనే నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రైతు నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి మార్కెట్ రిస్కులకు గురి చేయకూడదు. ఈ స్వైప్ లావాదేవీలపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి. వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక శక్తిగా మార్చడం అంటే సంస్థలను జూదగాళ్లుగా మార్చడం కాదు. దేశంలోని ప్రతి రైతుకు జవాబుదారీగా ఉండాల్సిన నాబార్డు ఈ ఆర్థిక మాయాజాలాన్ని ఆపాలి. రైతులే దేశానికి వెన్నెముక అయితే… ఆ వెన్నెముకను విరిచే హక్కు ఎవరికీ లేదు.
సావరిన్ బాండ్లు అంటే ఏమిటి?
సావరిన్ బాండ్లు అంటే మరేదో కాదు. ప్రభుత్వం తీసుకునే అప్పు. దేశ ఆర్థిక అవసరాల కోసం ప్రభుత్వం ప్రజల నుండి లేదా బ్యాంకుల నుండి డబ్బు తీసుకుని దానికి బదులుగా ఇచ్చే పత్రాలే ఈ బాండ్లు. వీటిని ప్రభుత్వం జారీ చేస్తుంది కాబట్టి అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అయితే ఈ బాండ్లపై వచ్చే వడ్డీ రేట్లు అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రకారం మారుతూ ఉంటాయి. ఇప్పుడు నాబార్డు ఈ బాండ్ల వడ్డీ రేట్లపైనే పందెం కాస్తూ స్వైప్ లావాదేవీలు చేస్తోంది.
ఏమిటీ స్వైప్ లావాదేవీల జూదం?
స్వైప్ అంటే ఒక రకమైన వడ్డీ రేట్ల ఒప్పందం. నాబార్డు తన దగ్గర ఉన్న రైతు రుణ నిధులను బాండ్ల మార్కెట్లో వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో అనుసంధానం చేస్తోంది. వడ్డీ రేట్లు పెరిగితే లాభం రావచ్చు… కానీ తగ్గితే భారీ నష్టం వస్తుంది. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాల్సిన నాబార్డు ఇలాంటి పందెం కాసే ఆర్థిక పద్ధతుల్లోకి వెళ్లడం రైతుల పాలిట గొడ్డలిపెట్టు.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్